ఇప్పుడు సౌత్ సినిమాల పబ్లిసిటీ కూడా కేరాఫ్ దుబాయ్ గా మారుతోంది. గతంలో హిందీ సినిమాలకు మాత్రమే ఈ హడావుడి వుండేది. రోబో సినిమా కోసం దుబాయ్ లో కోట్లకు కోట్లు ఖర్చు చేసి ఫంక్షన్ చేసారు. దుల్కర్ సల్మాన్ కురుప్ సినిమా ట్రయిలర్ ను బుర్జ్ దుబాయ్ మీద ప్రదర్శించి మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
రాజమౌళి-రామారావు, రామ్ చరణ్ ల ఆర్ఆర్ఆర్ మూవీ కోసం దుబాయ్ లో ఓ ఫంక్షన్ నిర్వహించబోతున్నారు. ఇప్పుడు ఇదే బాట ను పుష్ప కోసం కూడా అనుసరించబోతున్నట్లు వార్తలు అందుతున్నాయి.
పబ్లిసిటీ విషయంలో కీలకంగా వుంటారు హీరో బన్నీ. ఆయన తన చరిష్మా, తన స్టయిల్, తన పాపులారిటీ, పెంచుకోవడానికి సదా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఆయనకు స్వంత పీఆర్ టీమ్ వుంది. అన్ని భాషల్లో పీఆర్ లను నియమించుకున్నారు.
ఇప్పుడు ఏకంగా దుబాయ్ లో ఫంక్షన్ ను నిర్వహించడం ద్వారా బన్నీ మరో మెట్టు ఎక్కబోతున్నారు. పుష్ప సినిమాను హిందీ మినహా పలు భారతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు. వీటిలో తమిళ, మలయాళ వెర్షన్ లు కూడా వున్నాయి.
దుబాయ్ లో తెలుగు వారితో పాటు తమిళ, మలయాళ ప్రజలు ఎక్కువగా వున్నారు. అందుకే అక్కడ కూడా ఫంక్షన్ చేయాలని బన్నీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.