విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ డెబ్బై దశకంలో ఎన్నో పొరాటాలు జరిగాయి. ఉత్తరాంధ్రాలో పుట్టిన ఈ ఉద్యమం ఉమ్మడి ఏపీనే కాదు, యావత్తు దేశాన్నే కదిలించింది. మొత్తానికి విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పడింది.
తక్కువ సామర్ధ్యంతో ఉత్పత్తి మొదలెట్టిన స్టీల్ ప్లాంట్ ఇప్పటికి సొంత నిధులతో 7.3 మిలియన్ టన్నుల ప్లాంట్‌గా అభివృద్ధి సాధించింది. ఇపుడు చూస్తే ప్రత్యక్షంగా 3ఎ వేల మంది పరోక్షంగా 70 వేలమంది ఉపాధి పొందుతున్నారు. ఇక స్టీల్ ప్లాంట్ ని మరింతగా విస్తరించాలన్నడిమాండ్ ఎటూ ఉంది. దాని కోసం కావాల్సినన్ని భూములు ఉన్నాయి.
అయితే ఆ భూములను పోస్కో సంస్థకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఇపుడు స్టీల్ ప్లాంట్ ని కుదిపేస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఇది తొలిమెట్టు అని విమర్శిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం ఉన్న వందల ఎకరాల భూములను ప్రైవేట్ సంస్థకు ఎలా అప్పగిస్తారంటూ స్టీల్ ప్లాంట్ యూనియన్లు మండిపడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ భూముల జోలికొస్తే ఊరుకుకోమని హెచ్చరిస్తున్నాయి.
అయినా స్టీల్ ప్లాంట్ సామర్ధ్యాన్ని 10 మిలియన్ టన్నుల దాకా పెంచాలన్న డిమాండ్ ను పట్టించుకోరు కానీ ఉన్న భూములు లాగేసుకుంటారా అంటూ కార్మిక సంఘాలు ఆగ్రహం చెందడంతో ధర్మం ఉంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించిన ప్లాంట్ ని కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని అంటున్నారు. మొత్తానికి కేంద్రంలోని మోడీ సర్కార్ కి ఉక్కు సెగ గట్టిగానే తగిలేలా ఉంది.