మాజీ మంత్రి వివేకా హత్యపై సీబీఐ విచారణ ముగింపు దశకు చేరుకుందన్న తరుణంలో అనూహ్య ట్విస్ట్. సీబీఐ సత్యశోధన కంటే అసత్య శోధనకే ప్రాధాన్యం ఇస్తోందన్న అభిప్రాయాలు కొందరి విషయంలో కలుగుతున్నాయి. సీబీఐకి మాజీ మంత్రి వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఎల్లో మీడియా, ప్రతిపక్షాలకు తప్ప, కేసులో వాస్తవాలు వెలికితీయడానికి పనికి రాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆవేశంలో, అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అక్కసుతో సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే తప్ప, సీబీఐ విచారణ సమయంలో నర్రెడ్డి రాజశేఖరరెడ్డి వివేకంతో వ్యవహరించలేదనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. సీబీఐకి వివేకా అల్లుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిశీలిద్దాం.
2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకే వైఎస్ జగన్ తన మామ వివేకా హత్యకు పథక రచన చేసి వుంటారని సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. నిజానికి ఇది చాలా సీరియస్ ఆరోపణ. ఇంత కాలం కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి చుట్టూ వివేకా హత్య కేసు నడుస్తోంది. వివేకా హత్యపై వైసీపీతో సహా మిగిలిన రాజకీయ పక్షాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, సామాన్య ప్రజల అభిప్రాయాలు ఏంటో అందరికీ తెలుసు.
అనూహ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు తెరపైకి తేవడంతో …ఇంత కాలం వివేకా కూతురు డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెబుతున్న విషయాలపై అనుమానం కలిగిస్తోంది. హత్యతో ఏ మాత్రం సంబంధం లేని జగన్‌ను ఇందులో ఇరికించి నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తప్పు చేశారని వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. జగన్ ప్రత్యర్థుల వలలో పడి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సీబీఐకి రాజకీయ పరమైన వాంగ్మూలం ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు సంబంధమే అని జగన్‌ను ఈ కేసులోకి లాగడం ద్వారా మొత్తానికి సీబీఐ విచారణనే బలహీనపరిచారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత కాలం వైఎస్ వివేకా కూతురు, అల్లుడు చేసిన ప్రయత్నాలన్నీ…. జగన్‌ను తెరపైకి తేవడం ద్వారా వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డారనే విమర్శలొస్తున్నాయి. ఆవేశంలో జగన్‌ను ఇరికించే ప్రయత్నంలో సీబీఐ విచారణకే ఎసరు తెర్చారనే వాళ్లు లేకపోలేదు.