అమరావతి అంటూ లేచింది మొదలు పెడబొబ్బలు పెడుతున్న చంద్రబాబుకు మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైల్లో అచ్చమైన ఉత్తరాంధ్ర యాసలో గట్టి కౌంటర్ ఇచ్చారు. అమరావతిలోనే అంతా ఉందని, అక్కడే జీవితం అని జనాలను మభ్యపెట్టడం మానేసి హుందాగా వ్యవహరించాలని సలహా ఒకటి మంత్రి ఇచ్చారు.
అమరావతిలో ఏం పోయిందో తెలియదు కానీ విశాఖలో కూడా అన్నీ దొరుకుతాయి బాబూ అంటూ సెటైర్లు వేశారు. అక్కడ ఉన్నా, విశాఖలో రాజధాని ఉన్నా బాగుపడేది బాబు సొంత సామజికవర్గం వారే కదా అంటూ గట్టిగానే తగులుకున్నారు.
విశాఖలో రాజధాని పెట్టినా ఆ సామాజికవర్గం హవా బాగానే ఉంటుందని, ఆ సంగతి బాబుకు కూడా తెలుసు అని బొత్స అంటున్నారు. ఊరకే ఏడుస్తూ జనాలను అయోమయానికి గురి చేస్తున్న బాబుకు విశాఖ రాజధాని అయినా వచ్చిన నష్టం కూడా ఏమీ లేదని బొత్స అంటున్నారు. ఆ సంగతి బాబుకు కూడా తెలుసు అని అంటున్నారు.
రాజధాని కోసం గాజులు ఇవ్వడం కాదు, దోచేసిన నాలుగు వేల ఎకరాల భూములు తిరిగి ఇచ్చేస్తే బాబు మంచి పని చేసినవారు అవుతారని కూడా మంత్రి అంటున్నారు. ప్రతీ రోజూ ఒక డ్రామా ఆడుతూ అమరావతి రైతులను రెచ్చగొడుతున్న బాబు ఏపీని అప్పుల ఊబిలో నెట్టాడని, అమరావతి పేరిట చిన్నపాటి శాశ్వత భవనం కూడా నిర్మించలేకపోయారని కూడా బొత్స హాట్ కామెంట్స్ చేశారు.
అనుభవం అంటూ తలకెత్తుకున్నందుకు ఏపీకి పాతికేళ్ళు వెనక్కు తీసికెళ్ళి తగుదునమ్మా అంటూ ఇపుడు మళ్ళీ విషపు రాజకీయం చేస్తున్నారని బొత్స విరుచుకుపడ్డారు.
ఇవన్నీ ఎలా ఉన్నా కూడా విశాఖలో రాజధాని పెడితే ఎనభై శాతం పైగా ఉన్న బీసీలు బాగుపడతారని జగన్ భావిస్తున్నారు. మరి బొత్స మాత్రం ఇక్కడ కూడ కమ్మ వారి ఆధిపత్యమే ఎక్కువగా ఉందని లెక్కలతో చెబుతున్నారు.
అంటే అమరావతి అయినా విశాఖ అయినా వారిదే రాజ్యం అయినపుడు బాబు ఎందుకు బాధపడుతున్నారో అర్ధం కావడంలేదని తమ్ముళ్ళు కూడా అంటున్నారిపుడు. ఏమైనా కూడా బాబు మార్క్ పాలిటిక్స్ తో ఏపీలో కమ్మనైన రాజకీయమే సాగిపోతోందని వైసీపీ మంత్రి బాగానే గుర్తించారనుకోవాలి.