ఏపీలో బుల్లి జిల్లా ఏదంటే….?

కొత్త జిల్లాల కూర్పు మార్పుతో ఏపీలో అనేక జిల్లాల పూర్వ స్వరూపాలూ స్వభావాలూ మారిపోతున్నాయి. విశాఖ జిల్లా విషయానికి వస్తే ఏపీలోనే బుల్లి జిల్లాగా అవతరించింది. ఒకపుడు అరవై లక్షల జనాభాతో, భౌగోళికంగా అతి…

కొత్త జిల్లాల కూర్పు మార్పుతో ఏపీలో అనేక జిల్లాల పూర్వ స్వరూపాలూ స్వభావాలూ మారిపోతున్నాయి. విశాఖ జిల్లా విషయానికి వస్తే ఏపీలోనే బుల్లి జిల్లాగా అవతరించింది. ఒకపుడు అరవై లక్షల జనాభాతో, భౌగోళికంగా అతి పెద్ద విస్తీర్ణంతో అలరారిన విశాఖ ఇపుడు అందులో మూడవ  వంతుకు చేరుకుంది.

ఏపీలో కేవలం 11 మండలాలతో ఆరు అసెంబ్లీ సీట్లతో, 18 లక్షల జనాభాతో విశాఖ రూపం ఉందిపుడు. అంతే కాదు, కేవలం 928 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో విశాఖ ఇక మీదట కనిపించనుంది. ఈ విశాఖలో ఏజెన్సీ ఊసు లేదు, అరకు అందాల ఆర్భాటం కానరాదు, పాడేరు జలపాతాల హొయలు లేదు, అంత దాకా ఎందుకు పచ్చని గ్రామీణ వాతావరణం గుభాళింపు అసలు లేనే లేదు.

అంతా విశాఖ సిటీలోనే ఉంది. ఎటు చూసినా సిటీలో అటూ ఇటూ తిరిగితే చాలు చిన్నదైన  విశాఖ జిల్లా మొత్తం చుట్టేయవచ్చు. ఒకనాడు అతి పెద్ద జిల్లాకు పెద్దగా ఉన్న జిల్లా క‌లెక్టర్ మల్లికార్జున ఇపుడు బుల్లి జిల్లాకు కలెక్టర్ గా కంటిన్యూ అవుతున్నారు.

ఈ విభజన‌తో విశాఖ చాలానే కోల్పోయిందని అంటున్నారు. తనకున్నఆస్తుల‌న్నీ అనకాపల్లికి, అల్లూరి సీతారామరాజు జిల్లాకూ సర్దేసి మరీ తాను కురచగా మారిపోయింది అని నగరవాసులు నిట్టూరుస్తున్నారు. మరి ఈ బుల్లి జిల్లా ప్రగతిలో పెద్ద జిల్లాగా మారుతుందేమో చూడాలి.