ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి అయినా పాలించవచ్చు. ఫలనా చోట నుంచే పాలించాలనిలేదు. రాజ్యాంగంలో ఎక్కడా దీనిని నిర్వచించలేదు కూడా. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుంది. అక్కడికే మందీమార్బలం వచ్చేస్తాయి.
ఇపుడు విశాఖను పరిపాలనారాజధానిగా వైసీపీ సర్కార్ ప్రకటించింది. చట్టం కూడా చేసింది. అయితే దాని మీద హైకోర్టులో విచారణ సాగుతోంది. మరి విశాఖను రాజధానిగా ఇప్పట్లో చూడలేమా అని ఎవరికైనా సందేహం రావచ్చు.
మనసు ఉంటే మార్గం ఉన్నట్లుగా రాజు తలచుకుంటే విశాఖ ఎపుడూ రాజధానే. విశాఖలో ముఖ్యమంత్రి నెలలొ కొన్ని రోజులు విడిది చేస్తే చాలు, ఇక్కడ కూడా రాజధాని కళ వస్తుంది. ముఖ్యమంత్రి వెంట ఎటూ అధికార గణం వస్తుంది. ఆ సందడి కూడా ఎటూ ఉంటుంది.
ఇక విశాఖలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అది కనుక పూర్తి అయితే ముఖ్యమంత్రి రెండవ క్యాంప్ ఆఫీస్ గా చేసుకుని విశాఖ నుంచే పాలన చేయవచ్చు. దానికి ఎవరూ ఎటువంటి అభ్యంతరాలు పెట్టలేరు కూడా. మొత్తం మీద చూసుకుంటే ముందే అనుకున్న ముహూర్తం విజయదశమి నాటికి ముఖ్యమంత్రి విశాఖ వచ్చి పాలన ప్రారంభిస్తారు అన్న చర్చ అయితే సాగుతోంది.
ఇక విశాఖ అభివ్రుధ్ధి విషయంలో గట్టి పట్టుదలతో ఉన్న వైసీపీ సర్కార్ ఎటూ ఆ దిశగా తన వంతుగా కార్యక్రమాలు చేస్తూ పోవచ్చు. మొత్తం మీద విశాఖ ఎప్పటికీ రాజధానే. ఆర్ధిక రాజధాని అన్నా, పర్యాటక రాజధాని అన్నా మరే పేరు పెట్టినా కూడా విశాఖ రాజధాని అన్నది జనం ఎపుడో డిసైడ్ చేసేశారు.