తిరుప‌తికే ఓటు

జిల్లాల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ తేనె తుట్టెను జ‌గ‌న్ స‌ర్కార్ క‌దిలించింది. ఈ సంద‌ర్భంగా ర‌క‌ర‌కాల పేర్లు తెరపైకి వ‌స్తున్నాయి. ముఖ్యంగా తిరుప‌తి కేంద్రంగా శ్రీ‌బాలాజీ జిల్లాను ప్ర‌క‌టించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ప్ర‌పంచ హిందూ ఆధ్మాత్మిక కేంద్రంగా…

జిల్లాల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ తేనె తుట్టెను జ‌గ‌న్ స‌ర్కార్ క‌దిలించింది. ఈ సంద‌ర్భంగా ర‌క‌ర‌కాల పేర్లు తెరపైకి వ‌స్తున్నాయి. ముఖ్యంగా తిరుప‌తి కేంద్రంగా శ్రీ‌బాలాజీ జిల్లాను ప్ర‌క‌టించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ప్ర‌పంచ హిందూ ఆధ్మాత్మిక కేంద్రంగా తిరుప‌తి ప్ర‌సిద్ధిగాంచింది. దీంతో తిరుప‌తిపై అంద‌రి దృష్టి ప‌డింది. శ్రీ‌బాలాజీ జిల్లాగా నామక‌ర‌ణం చేయ‌డంపై మాత్రం వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంది.

ఎక్క‌డో ఉత్త‌రాధిలో పిలుచుకునే బాలాజీ పేరును ఇక్క‌డ పెట్ట‌డంపై తిరుప‌తి పౌర‌స‌మాజం వ్య‌తిరేకిస్తోంది. అస‌లు బాలాజీ అనే పేరు క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి స‌హ‌స్ర నామాల్లో కూడా లేద‌ని పండితులు చెబుతున్నారు. అలాంటి లేనిదాన్ని తీసుకొచ్చి, ఉత్త‌రాధి సంస్కృతిని ప్ర‌తిబింబించే బాలాజీ పేరును కొత్త జిల్లాకు పెట్ట‌డంలో ఔచిత్యం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

తిరుప‌తి లేదా శ్రీ‌వారి జిల్లాగా నామ‌క‌ర‌ణం చేయ‌డం మంచిద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. తెలంగాణ‌లో గ‌ద్వాల్ జోగులాంబ జిల్లాగా పేరు పెట్టుకుని స్థానిక సెంటిమెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చిన విష‌యాన్ని ప్ర‌జ‌లు గుర్తు చేస్తున్నారు. బాలాజీ జిల్లాగా పేరు పెట్ట‌డం వ‌ల్ల తిరుప‌తి వాసుల‌కు మ‌న‌ది అనే సొంత భావ‌న లేకుండా పోతుంద‌నే ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. 

శ్రీ‌బాలాజీ జిల్లాగా పేరు పెట్ట‌డం వ‌ల్ల సీమ‌వాసుల మ‌నోభావాలు దెబ్బ‌తింటున్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే బాలాజీ పేరుపై ప్ర‌జాసంఘాలు, వివిధ రాజ‌కీయ ప‌క్షాలు త‌మ వ్య‌తిరేక‌త‌ను ప్ర‌భుత్వానికి తెలియ‌జేశాయి. అయితే ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల మ‌నోభావాల్ని ఎంత వ‌ర‌కు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుందో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.