ఆర్టీసీ మీదే ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ్మె ఆశ‌లు!

ఏపీలో జీతాల పెంపుపై స‌మ్మెకు వెళ్తామంటున్న ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఆశ‌ల‌న్నీ ఏపీఎస్ ఆర్టీసీ మీదే ఉన్నాయి. తాము స‌మ్మె చేస్తే ప్ర‌భుత్వం ఖాత‌రు చేయ‌క‌పోవ‌చ్చ‌నే భ‌య‌మో, తాము స‌మ్మె చేసినా ప్ర‌జ‌లు పెద్ద‌గా ఇబ్బంది పడేది…

ఏపీలో జీతాల పెంపుపై స‌మ్మెకు వెళ్తామంటున్న ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఆశ‌ల‌న్నీ ఏపీఎస్ ఆర్టీసీ మీదే ఉన్నాయి. తాము స‌మ్మె చేస్తే ప్ర‌భుత్వం ఖాత‌రు చేయ‌క‌పోవ‌చ్చ‌నే భ‌య‌మో, తాము స‌మ్మె చేసినా ప్ర‌జ‌లు పెద్ద‌గా ఇబ్బంది పడేది ఉండ‌ద‌నే భావ‌నో.. కానీ, త‌మ‌తో పాటు ఆర్టీసీని స‌మ్మె ముగ్గులోకి దించ‌డానికి ప్ర‌భుత్వ ఉద్యోగ సంఘాలు తెగ తాప‌త్ర‌య‌ప‌డుతున్నాయ‌ని స్ప‌ష్టం అవుతోంది.

ఆర్టీసీ ఉద్యోగులు స‌మ్మెకు వెళితే… రోడ్ల‌పైనే ఆ ప్ర‌భావం క‌నిపిస్తుంది. ప్ర‌యాణాలు చేయాల‌నుకునే ప్ర‌జ‌లూ ఇక్క‌ట్ల పాల‌వుతారు. అప్పుడే స‌మ్మె జ‌రుగుతోంద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లోకి ఎక్కువ‌గా వెళ్తుంది. అదే ఇత‌ర డిపార్ట్ మెంట్ల‌లోని ప్ర‌భుత్వ ఉద్యోగులు స‌మ్మె చేస్తే ఆ ప్ర‌భావం ప్ర‌జ‌ల‌పై పెద్ద‌గా ప‌డ‌దు. ఒక‌వేళ ప‌డేట్టు అవుతుంద‌నే ధీమానే ఈ ఉద్యోగుల్లో ఉంటే… ఆర్టీసీ ఉద్యోగుల‌కు క‌న్ను కొట్టే వారే కాదు!

ఇక ఇంత‌కీ ఆర్టీసీ ఉద్యోగుల ప‌రిస్థితి ఏమిటి? అంటే.. వారికి జ‌గ‌న్ ఇప్ప‌టికే చేయాల్సింది, చెప్పింది చేశారు. త‌మ ఉద్యోగాలు ప్ర‌భుత్వంలోకి విలీనం కావాల‌ని ఆర్టీసీ కార్మికులు ఆకాంక్షించారు. ఈ విష‌యంలో ద‌శాబ్దాలుగా త‌పించారు. ఎన్నిక‌ల హామీగా ఆర్టీసీ విలీనాన్ని ప్ర‌తిపాదించిన జ‌గ‌న్, దాన్ని చేసి చూపించారు. ఆ సంద‌ర్భంలో ఆర్టీసీ ఉద్యోగులు సంతోషించారు.

మ‌రోవైపు తెలంగాణ‌, క‌ర్ణాట‌క వంటి రాష్ట్రాల్లో… ఆర్టీసీ కార్మికులు ఇప్ప‌టికీ ప్ర‌భుత్వంలోకి విలీనం అనే డిమాండ్ ద‌గ్గ‌రే ఆగిపోయారు. ఏపీ క‌న్నా ఆర్థిక వ‌న‌రుల విష‌యంలో మెరుగ్గా ఉన్న క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌ల్లో కూడా ఆర్టీసీ ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే జ‌గ‌న్ మాత్రం అధికారంలోకి రాగానే.. ఆర్టీసీ ఉద్యోగుల‌కు కోరిన వ‌రాన్ని ఇచ్చారు.

మ‌రి ఇప్పుడు ప్ర‌భుత్వ ఉద్యోగులు అయిపోయిన ఆర్టీసీ ఉద్యోగులు.. ఉద్యోగ సంఘాల ట్రాప్ లో ప‌డ‌తాయా? అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన ప్ర‌శ్న‌. ఒక‌వేళ ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు స‌మ్మెలో పాల్గొంటే.. జ‌గ‌న్ పై విశ్వాస ఘాతుకానికి అంత‌క‌న్నా నిద‌ర్శ‌నం మ‌రోటి ఉండ‌దు. 

అవ‌త‌ల రాష్ట్రాల్లో కార్మికులు ఇంకా కార్మికులుగానే ఉంటే, ఏపీలో ఉద్యోగులు అయ్యారు. ఈ విష‌యంలో అయినా ఈ సంద‌ర్భంలో ఆర్టీసీ ఉద్యోగులు కాస్త విశ్వాసం చూపిస్తారా? లేక ఉద్యోగ సంఘాల‌తో జ‌త కూడి మ‌రింత తీవ్ర విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతారా? అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం.