దేశంలో తొలి కోవిడ్ కేసుకు… రెండేళ్లు!

రెండు సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయాయి. దేశంలో తొలి కోవిడ్ కేసు న‌మోదై రెండేళ్లు గ‌డిచాయి. 2020 జ‌న‌వ‌రి ముప్పైయ‌వ తేదీన దేశంలో తొలి సారి కోవిడ్ పాజిటివ్ కేసు అధికారికంగా నిర్ధార‌ణ అయ్యింది. రెండేళ్ల‌లో రెండు…

రెండు సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయాయి. దేశంలో తొలి కోవిడ్ కేసు న‌మోదై రెండేళ్లు గ‌డిచాయి. 2020 జ‌న‌వ‌రి ముప్పైయ‌వ తేదీన దేశంలో తొలి సారి కోవిడ్ పాజిటివ్ కేసు అధికారికంగా నిర్ధార‌ణ అయ్యింది. రెండేళ్ల‌లో రెండు కోవిడ్ వేవ్ లు గ‌డిచి మూడో వేవ్ లో ఉంది భార‌త‌దేశం.

2019లో చైనాలో క‌రోనా విజృంభించిన‌ట్టుగా భార‌తీయులు వార్త‌లు చ‌దివేవారు. అక్క‌డ జ‌నాలు మాస్కులు వేసుకుని తిరుగుతూ ఉన్నార‌ట‌, ఒక మ‌నిషికి మ‌రో మ‌నిషి త‌గ‌ల‌కుండా భౌతిక దూరాల‌ను పాటిస్తున్నార‌ట‌, ఏదైనా ఇంటికి పార్సిల్ వ‌స్తే.. దాన్ని డెలివరీ చేసే వ్య‌క్తి గేటు వ‌ద్ద పెట్టి వెళ్లిపోతే, ఆ త‌ర్వాతే పార్సిల్ బుక్ చేసిన వ్య‌క్తి వెళ్లి దాన్ని తీసుకుంటాడ‌ట‌! క‌రోనా చాలా భయంక‌ర‌మైన వైర‌స్ అట‌, కోట్ల‌లో మ‌ర‌ణాలు న‌మోదైనా చైనా అధికారికంగా చెబుతున్న‌ది త‌క్కువేన‌ట‌… ఇలాంటి మాట‌లు రెండేళ్ల కింద‌ట భార‌తీయుల్లో వినిపించేవి. 2019 ఏడాది చివ‌ర్లోనే ఈ త‌ర‌హా మాట‌లు, విశ్లేష‌ణ‌లు సాగాయి.

ఇక 2020 జ‌న‌వ‌రి  క‌ళ్లా.. క‌రోనా చైనాకే ప‌రిమితం అని, అది ఇండియాను ట‌చ్ కూడా చేయ‌లేద‌ని వాట్సాప్ యూనివ‌ర్సిటీ మొద‌లుపెట్టింది. అదేమంటే ఆవు పేడ అంటూ రీజ‌న్ చెప్పింది. ఆవు పేడ‌తో ఇళ్లు అలుక్కునే మ‌న‌కు క‌రోనా పీడ ఉండ‌ద‌ని ఆ స‌మ‌యంలో వాట్సాప్ యూనివ‌ర్సిటీ బోధించింది. ఇక్క‌డితో మొద‌లుపెట్టి.. చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్ భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి వంగి వంద‌నం చేస్తున్నాడ‌ని, భార‌తీయ సంస్కృతి సంప్రదాయాల‌కు చైనా అధ్య‌క్షుడు ప్ర‌ణామాలు చేస్తున్నాడంటూ.. వాట్సాప్ యూనివ‌ర్సిటీ జ‌నాల‌కు వెర్రెక్కించింది!

క‌ట్ చేస్తే.. 2020 జ‌న‌వ‌రి ముప్పైన దేశంలో తొలి క‌రోనా కేసు అధికారికంగా రిజిస్ట‌ర్ అయ్యింది. అయినా.. కేంద్రం లైట్ తీసుకుంది. భ‌క్తులు అయితే.. అబ్బే.. అన్నారు! మార్చి 20 నాటికి కానీ మెలకువ రాలేదు. దాదాపు యాభై రోజుల త‌ర్వాత ఉన్న‌ట్టుండి.. జ‌న‌తా క‌ర్ఫ్యూ అని ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఒక్క రోజు ఎక్క‌డి వారు అక్క‌డ ఆగిపోతే ఇక వైర‌స్ అంతే నంటూ మ‌ళ్లీ భ‌క్తులు అందుకున్నారు. పగ‌లంతా భౌతిక దూరం పాటిస్తే చాలంటూ.. వైర‌స్ మాడి మ‌సైపోతుందంటూ సాయంత్రానికి గో క‌రోనా.. నినాదాల‌తో ర్యాలీలు తీశారు!

ఆ ర్యాలీల్లో అంత‌గా నిన‌దించినా.. క‌రోనాకు విన‌ప‌డ‌లేదు… తొలి వేవ్, లాక్ డౌన్ల దుష్ఫ‌లితాలు, రెండో వేవ్ లో క‌రోనా తీవ్ర రూపం గురించి వేరే వివ‌రించ‌న‌క్క‌ర్లేదు. ఇలా రెండేళ్లు గ‌డిచిపోయాయి. రెండేళ్లు పూర్త‌యిన త‌రుణంలో మూడో వేవ్ ఇబ్బంది పెడుతూ ఉంది. మ‌నిషి స్వేచ్ఛ‌కు ప్ర‌తిబంధ‌కంగా మారి క‌రోనా వైర‌స్ త‌న ఉనికిని చాటుకుంటూ ఉంది. 

దేశంలో రోజువారీగా ఇప్పుడు రెండు ల‌క్ష‌ల పై చిలుకు కేసులు న‌మోద‌వుతున్నాయి. ప్ర‌భుత్వ అధికారిక గ‌ణాంకాల ప్ర‌కార‌మే… దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కూ 4.93 ల‌క్ష‌ల మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. క‌రోనాకు బ‌లైన వారు, క‌రోనా కార‌ణంగా ఆప్తుల‌ను కోల్పోయిన వారికీ ఈ స‌మ‌యం పెను విషాదం.