కడియం శ్రీహరి … ఈయన్ని ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. టీడీపీలో ఒక వెలుగు వెలిగిన, మంత్రి పదవులు అనుభవించిన, పార్టీ పదవులు నిర్వహించిన కడియం శ్రీహరి టీఆర్ఎస్ లో చేరాక మంత్రి కమ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ కు సన్నిహితుడని ప్రచారం పొందాడు.
ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసిపోవడంతో ఖాళీగా ఉన్నాడు. మళ్ళీ ఎమ్మెల్సీని చేస్తానని సీఎం కేసీఆర్ ఆయనకు హామీ ఇచ్చాడట. ఇంతకూ ఆయన్ని గురించిన ముచ్చట ఏమిటంటే …దళిత బంధు విషయంలో కడియం శ్రీహరి సీఎం కేసీఆర్ ను హెచ్చరిస్తూనే …మరో పక్క ప్రశంసించాడు. ఇప్పటివరకు ఏ టీఆర్ఎస్ నాయకుడు, ఏ మంత్రి ఇలాటి హెచ్చరిక చేయలేదు. ఇటువంటి జాగ్రత్త చెప్పలేదు.
వాస్తవానికి హెచ్చరిక చేసి వదిలేస్తే టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని అనుకుంటారేమోనని దానికి కొంత ప్రశంస కూడా జోడించాడు కడియం. ఇంతకూ కడియం శ్రీహరి ఏమన్నాడు ? దళితబంధు అమలు చేయడమంటే పులి మీద స్వారీ చేయడమే అన్నాడు.
''దళితబంధు పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే తీవ్రంగా నష్టపోయేది టీఆర్ఎస్ పార్టీయే. దళితుల వ్యతిరేకతను కూడగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నికల్లో ఘోరమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈ పథకం అమలు 'సింహం మీద స్వారీ' లాంటిది. పైన కూర్చున్నంత సేపు అది ఏమీ చేయదు.. దిగితేనే తినేస్తుంది. ఇవన్నీ తెలిసే దళితబంధు పథకం అమలు నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది'' అని అన్నాడు కడియం.
సమాజంలో అత్యంత దారిద్య్రంలో ఉన్న దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకే సీఎం కేసీఆర్.. ఉన్నతాధికారులు, మేధావులు, ఎన్జీవోలతో చర్చించి దళితబంధు పథకాన్ని రూపొందించారని కాస్త పాజిటివ్ గా మాట్లాడాడు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే ఈ పథకాన్ని ప్రకటించారని, దీనిని పూర్తిస్థాయిలో అమలు చేయరని ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్నాయని కేసీఆర్ కు అనుకూలంగానే మాట్లాడాడు. ప్రతిపక్షాలు రాజకీయాలు మాని, పథకం అమలుకు కావాల్సిన సూచనలు, సలహాలు ప్రభుత్వానికి అందజేయాలన్నారు. రాష్ట్రంలో 18 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉండగా, వారిలో దళిత బంధు పథకానికి అర్హత కలిగిన కుటుంబాలు 15 లక్షల దాకా ఉంటాయని చెప్పారు.
చివరకు దళిత బందును సహసోపేత నిర్ణయమని పొగుడుతూ, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కేసీఆర్ కే సాధ్యమవుతుందని అన్నాడు శ్రీహరి. దళిత బంధు ప్రకటించినప్పుడే ఇది పులిలాంటిదని కేసీఆర్ కు తెలుసన్న మాట. తెలిసి కూడా సాహసించాడంటే వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే డబ్బులు పంచే పనికి రెడీ అయిపోయాడని చెప్పుకోవాలి.
ఇలా ఎన్ని వర్గాలకైనా డబ్బులు పంచేస్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరో ఉప ఎన్నిక రాదనీ గ్యారంటీగా చెప్పగలమా ? అప్పుడు మరో వర్గాన్ని టార్గెట్ గా చేసుకొని డబ్బులు పంచుతారు. బీసీ బంధు, గిరిజన బంధు, మైనారిటీ బంధు …ఇలాంటివి సవాలక్ష బంధులు ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇవ్వను అని కేసీఆర్ చెప్పగలడా ? ఒకవేళ అలా అంటే ఆ వర్గం ఓట్లు పోయినట్లే కదా. దళిత బందును కేసీఆర్ బ్రహ్మాండమైన పథకంగా కలరిచ్చాడు. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు దేశంలోనే ఇలాంటి గొప్ప పథకం లేదని ప్రతిరోజూ ఊదరగొడుతున్నారు.
10 లక్షలు ఇచ్చి వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా ఎదగాలంటున్నారు. పది లక్షలు తీసుకున్న వారంతా వ్యాపారాలు చేస్తారా ? అప్పులుంటే తీర్చుకుంటారు. ఇంకా దేనికో ఖర్చు పెట్టుకుంటారు. మళ్ళీ మరో సాయం కోసం ఎదురు చూస్తారు. డబ్బులు పంచే ఏ పథకమైనా దాదాపుగా ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇదేదో బ్రహ్మాండమైన పథకం అన్నట్లుగా బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ పది లక్షలతో దళితుల జీవితాల్లో పెను మార్పులు రావు. వాళ్లకు సాధికారత రాదు.