అమరావతి జేఏసీ, దాని వెనకున్న ప్రధాన ప్రతిపక్షం చేష్టలు మరోసారి రాష్ట్ర విభజనకు బీజం వేసేలా ఉన్నాయి. అన్నీ తమ ప్రాంతంలోనే ఉండాలి, అందరూ తమ ప్రయోజనాల కోసమే పని చేయాలనే వారి స్వార్థపూరిత, పచ్చి అవకాశవాద వైఖరి ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసుల గుండెల్లో మంట పుట్టిస్తోంది. ఇలాంటి అవకాశవాదులతో తామెందుకు కలిసి ఉండాలనే ఆవేదనతో కూడిన ఆలోచనలకు అమరావతి జేఏసీ నేత డాక్టర్ మద్దిపాటి శైలజ హైకోర్టులో వేసిన వ్యాజ్యం బీజం వేసింది. ఈ పిల్ సీమ గుండెల్లో గునపం గుచ్చినట్టుగా ఆ ప్రాంత ఉద్యమకారులు భావిస్తున్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్‌సీ) కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేయడానికి జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేసేలో పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఆ కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేయకుండా నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వా లని కోరుతూ హైకోర్టులో అమరావతి జేఏసీ నేత డాక్టర్ మద్దిపాటి శైలజ పిల్ వేశారు.
ఈ వ్యాజ్యంలో కర్నూలులో లోకాయుక్త, ఏపీహెచ్‌ఆర్‌సీ ఏర్పాటు చేయడం ఏపీ విభజన చట్ట నిబంధనలకు విరుద్ధమని, శాసన, న్యాయ, కార్యనిర్వహణ వ్యవస్థలు రాజధానిలోనే ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి జ్యుడీషియల్, క్వాసీ జ్యుడీషియల్ వ్యవస్థలను రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపారు. దూరంగా ఉన్న కర్నూలు జిల్లాలో లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ ఏర్పాటు చేయడం.. న్యాయాన్ని ప్రజలకు చేరువ చేయాలనే సిద్ధాంతానికి విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని లోకాయుక్త, ఏపీహెచ్‌ఆర్‌సీలను కర్నూలులో కాకుండా అమరావతిలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఆమె అభ్యర్థించారు.
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో పరిపాలన రాజధాని లేదా హైకోర్టు ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి. కానీ పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని, హైకోర్టు …ఇలా అన్నీ అమరావతిలోనే ఏర్పాటు చేస్తూ…ఇతర ప్రాంతాల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోలేదు. రాయలసీమలో కనీసం హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాసులు ఎంతగా మొర పెట్టుకున్నా చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. అలాంటి నియంతృత్వ, ఒంటెత్తు పోకడలే …నేడు మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటుకు దారి తీసింది.
ఇంత జరుగుతున్నా ఇంకా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తన వైఖరిని మార్చుకోలేదు. ఇంకా అమరావతిలోనే అన్నీ ఉండాలనే చెబుతోంది. డాక్టర్ శైలజ పిటిషన్‌లో కర్నూలు జిల్లాలో లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ ఏర్పాటు చేయడం.. న్యాయాన్ని ప్రజలకు చేరువ చేయాలనే సిద్ధాంతానికి విరుద్ధమని పేర్కొనడం విడ్డూరంగా ఉంది. మరి వాటిని అమరావతిలో మాత్రమే ఏర్పాటు చేస్తే…ప్రజలకు ఏ విధంగా న్యాయం చేరువ అవుతుందో ఇతర ప్రాంతాల వారికెవరికీ అర్థం కావడం లేదు. కనీసం చిన్న చిన్న కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయడాన్ని ఓర్వలేని అమరావతి జేఏసీ నైజం కళ్లకు కడుతోంది.
ఇలాంటి విషయాలే ఒక్కొక్కటిగా తోడై చివరికి మరోసారి రాష్ట్ర విభజనకు దారి తీసే ప్రమాదం లేకపోలేదని రాయలసీమ వాసులు హెచ్చరిస్తున్నారు. అన్నీ రాజధాని ప్రాంతంలోనే ఉండాలనే అమరావతి జేఏసీ మాట ప్రకారం… తమ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం, రాజధాని సాధించుకుంటే, తమ అకాంక్షలకు అనుగుణంగా అన్నీ వస్తాయనే భావన క్రమంగా ఆ ప్రాంతంలో వేళ్లూను కుంటోంది.