ఒక తెలుగు వ్యక్తి దాదాపు 55 సంవత్సరాల తర్వాత దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న గొప్ప సందర్భం ఇది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి తెలుగు వ్యక్తి జస్టిస్ కోకా సుబ్బారావు. సుప్రీంకోర్టు 9వ చీఫ్ జస్టిస్‌గా ఆయన 1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు బాధ్యతలు నిర్వర్తించారు.
మరోసారి ఆ ఘనత మన తెలుగు వారైన జస్టిస్ ఎన్వీ రమణకు దక్కనుంది. అలాంటి అత్యున్నత పదవిని అలంకరించనున్న జస్టిస్ ఎన్వీ రమణకు సంబంధించి తెలుగు మీడియా ఆవిష్కరించిన తీరు పేలవంగా ఉంది. న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ వెలువరించిన గొప్ప తీర్పుల గురించి తెలుసుకోవాలనుకునే పాఠకులకు నిరుత్సాహం మిగిలింది. గుడ్డిలో మెల్లలా ఆంధ్రజ్యోతి అంతోఇంతో ఫర్వాలేదనిపించింది.
జస్టిస్ ఎన్వీ రమణపై మూడు ప్రధాన పత్రికలు ప్రచురించిన వార్తా కథనాల గురించి తెలుసుకుందాం. తెలుగుదేశం అనుబంధ పత్రికలుగా ముద్రపడిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఎన్వీ రమణపై రాసిన వార్తా కథనాలను ముందుగా పరిశీలిద్దాం.
“తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ!” శీర్షికతో ఈనాడు బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. ఇందులో జస్టిస్ ఎన్వీ రమణ ఎప్పుడు , ఎక్కడ పుట్టారు? ఆయన విద్యాభ్యాసం, న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టిన సమయం, ఆ తర్వాత హైకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ తదితర వివరాలన్నీ పొందుపరిచారు. ఆయన ఎప్పుడు పదవీ విరమణ చేయనున్నారనే వివరాలను కూడా ఈనాడులో రాసుకొచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక తీర్పులు వెలువరించారనే మాటే తప్ప… ఆ వివరాలేంటో మచ్చుకు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం గమనార్హం.
జస్టిస్ ఎన్వీ రమణ 2000 జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 20 ఏళ్లలో వివిధ స్థాయిల్లో ఆయన వెలువరించిన గొప్పగొప్ప తీర్పుల గురించి ఏ పత్రికైతే సమగ్రంగా రాస్తుందని, తెలుసుకోవాలని తహతహలాడిన పాఠకుడికి ఈనాడు తీవ్ర నిరాశ కలిగించింది.
ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మిగిలిన పత్రికలంటే ఫర్వాలేదనిపించేలా కథనాన్ని ఇచ్చింది. “సుప్రీం పీఠంపై తెలుగు తేజం!” శీర్షికతో ఆంధ్రజ్యోతి తన మార్క్ జర్నలిజాన్ని ప్రదర్శించింది. ఈ కథనంలో ప్రత్యేకత ఏమంటే కీలక తీర్పులెన్నో… అంటూ రాసుకొచ్చి… పాఠకుల కుతూహలానికి తగ్గట్టు జస్టిస్ ఎన్వీ రమణ వెలువరించిన గొప్ప తీర్పుల గురించి ఆవిష్కరించారు.
ఆ కీలక తీర్పుల్లో … ఉద్యోగం చేసే భర్తతో పాటు ఇంట్లో భార్య చేసే పని విలువ ఏ మాత్రం తక్కువ కాదని, నష్టపరిహారాలిచ్చే విషయంలో మహిళకే ప్రాధాన్యం ఇవ్వాలని జస్టిస్ రమణ తీర్పునిచ్చారని రాశారు. అలాగే జమ్మూ కశ్మీర్లో టెలికాం, ఇంటర్నెట్ సేవలపై విధించిన నిషేధాన్ని సమీక్షించి వారంలోగా వాటిని పునరుద్ధరించాలని తీర్పునిచ్చారు.
సమాచార హక్కు పరిధిలోకి సీజే కార్యాలయం కూడా వస్తుందని తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణ ఒకరని ఆంధ్రజ్యోతి రాస్తే తప్ప ఎవరికీ తెలిసే అవకాశం లేదు.
ముఖ్యంగా స్పీకర్‌ను, ముఖ్యమంత్రిని, మంత్రివర్గాన్ని సంప్రదించకుండా అసెంబ్లీ సమావేశాలను ముందుకు జరిపే లేదా వాయిదా వేసే అధికారం గవర్నర్లకు లేదని అరుణాచల్ కేసులో జస్టిస్ ఎన్వీ రమణనే తీర్పు ఇచ్చారు. మరో గొప్ప తీర్పు … ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఆలయాల్లో అర్చకులను నియమించుకోవచ్చు. ఇందులో నిర్దేశిత నిబంధనలు, రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన జరగరాదని తమిళనాడుకు చెందిన కేసులో జస్టిస్ రమణ తీర్పు ఇచ్చారనే సమాచారాన్ని పాఠకులకు అందించారు.
ఇక వైసీపీ అనుకూల పత్రిక సాక్షిలో ఈనాడు కంటే బెటర్‌గా రాశారు. ఈనాడు, సాక్షి పత్రికల శీర్షికలు ఒక్కటే కావడం గమనార్హం. ఈనాడుకు ఇంకా ఏ మూలనో అనుమానం ఉన్నట్టు …హెడ్డింగ్‌కు ఆశ్చర్యార్థకం పెట్టారు. సాక్షికి ఆ అనుమానాలు కూడా లేవు. ఇక కథనం విషయానికి వస్తే… ఉమ్మడి ఏపీ హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ట్రిబ్యునళ్లు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారని రాసుకొచ్చారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, ఎన్నికల అంశాల్లో కేసులు వాదించారని ఆవిష్కరించారు. అలాగే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార కేసులు, క్రిమినల్ కేసుల్లో నిపుణుడిగా పేరు పొందారని కూడా రాశారు.
ఎన్వీ రమణను ప్రధానంగా న్యాయమూర్తి కోణంలో ఆయన వెలువరించిన తీర్పుల గురించి కాకుండా, న్యాయవాదిగా విశిష్టతను తెలిపేలా సాక్షి కథనాన్ని రాసుకొచ్చింది. మొత్తానికి న్యాయమూర్తిగా దేశ వ్యాప్తంగా పేరు గాంచిన ఎన్వీ రమణపై అందుకు తగ్గట్టు సరైన కథనాల్ని ఆవిష్కరించడంలో తెలుగు మీడియా విఫలమైందని చెప్పొచ్చు.
తెలుగు మీడియా కథనాలను చదివితే… అసలు ఎన్వీ రమణ గొప్ప తీర్పులేవీ ఇవ్వలేదా? అనే సందేహాలు కలిగే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు, విద్యావంతులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హేమిటో…. ఈ కథనాలు!