మోడీ సర్కార్‌ను వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి దేశ అత్యున్నత చట్ట సభ వేదికగా దుమ్ము దులిపేశారు. ఆలోచన, ఆగ్రహం, ఆక్రోశం కలగలిసిన విజయసాయిరెడ్డి ప్రసంగం ఇటు సొంత పార్టీనేతలు, అటు బీజేపీ, ఇతర పక్షాలకు ఆశ్చర్యం కలిగించింది. కేంద్రంలో బీజేపీ అనుకూల వైఖరితో వ్యవహరిస్తున్న వైసీపీ నుంచి ఈ స్థాయిలో విమర్శలను ఎవరూ ఊహించలేదు.
‘రాజధాని ప్రాంతం -ఢిల్లీ ప్రభుత్వం (సవరణ) బిల్లు -2021’ పై రాజ్యసభలో చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఆవేశపూరిత ప్రసంగం చేశారు. తన ప్రసంగంలో కేంద్రప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు సర్వాధికారాలు కట్టబెట్టే ప్రయత్నాలను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఇప్పుడు ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్, రేపు రాష్ట్రాల్లో గవర్నర్‌లకు ఇదే రకమైన అధికారాలు కట్టబెట్టరనే గ్యారెంటీ ఏంటి? అంటూ నిలదీశారు.
విజయసాయిరెడ్డి ప్రసంగం అసాంతం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ, ఒంటెత్తుపోకడలను ఎండగడుతూ సాగింది. విజయసాయిరెడ్డి ఆవేదన ఏంటో ఆయన మాటల్లోనే …
“ప్రభుత్వమంటే లెఫ్టినెంట్ గవర్నర్ అంటున్నారు. రేపు లెఫ్టినెంట్ అనే పదం తీసేసి గవర్నర్‌కూ అదే అమలు చేస్తారా? ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అంటున్నారు. పార్లమెంటరీ వ్యవస్థపైనే ఈ బిల్లు అనేక సందేహాలు లేవనెత్తింది. ప్రజలకు ప్రాతినిథ్యం వహించే ప్రభుత్వానికి అధికారాలు ఉండాలి తప్ప… కేంద్రం నియమించిన వ్యక్తికి కాదని మా పార్టీ , మా ముఖ్యమంత్రి ఉద్దేశం.
లెఫ్టినెంట్ గవర్నర్‌కు పూర్తి అధికారాలు ఇవ్వకూడదు. అది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరి స్తున్నారు. మీ సంఖ్యా బలంతో దాన్ని ఆమోదించుకున్నా దాన్ని సుప్రీంకోర్టు నిలిపేస్తుంది. ఈ బిల్లు విషయంలో బీజేపీ ప్రభుత్వంతో ఏకీభవించలేం” అని ఆయన సభ నుంచి వాకౌట్ చేశారు.
ఈ బిల్లుపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ రాజ్యసభలో చేసిన ఘాటు వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆయన ఏమన్నారంటే …మహాభారతంలో ద్రౌపదికి జరిగిందే, ఇవాళ భారత రాజ్యాంగానికి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కోట్ల మంది ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.
రాజ్యసభలో కూడా బిల్లుకు ఆమోద ముద్ర పడడంతో బీజేపీ ఢిల్లీ అధికారాలను పరోక్షంగా హస్తగతం చేసుకున్నట్టైంది. ఈ బిల్లు ప్రకారం కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయాలకైనా లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తప్పనిసరి. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఉత్సవ విగ్రహం మాదిరి కావాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.