తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరగకుండానే బీజేపీ పరోక్షంగా తన ఓటమిని అంగీకరించింది. ఓటమికి సాకుల వెతుకులాటలో బీజేపీ నేతలు తలమునకలయ్యారు.
తిరుపతి ఉప ఎన్నికలో ఓ విచిత్రమైన పరిస్థితి. తిరుపతి ఉప ఎన్నికలో గెలుపుతో ఆంధ్రప్రదేశ్లో పాగా వేస్తామని గత కొన్ని నెలలుగా ప్రగల్భాలు పలుకుతున్న బీజేపీ … ఇంత వరకూ తమ అభ్యర్థి ఎవరో కూడా తేల్చుకోలేదని దయనీయ స్థితి. పైగా అభ్యర్థి ఎంపిక కంటే, ఓటమికి గల కారణాలను అన్వేషించడం ఒక్క బీజేపీకే చెల్లుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ నిన్న, మొన్న తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపణలు వింటే …తమ పరువు కాపాడుకునే క్రమంలో బోగస్ ఓట్లను తెరపైకి తెచ్చారనే విమర్శలు లేకపోలేదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బోగస్ ఓట్లతో వైసీపీ మెజార్టీ తెచ్చుకుందని, తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లోనూ ఇలాగే గెలవడానికి సన్నాహాలు చేస్తోందని పురందేశ్వరి, సత్యకుమార్ ఆరోపించడం గమనార్హం. అంతేకాదు, తిరుపతిలో 2 లక్షల బోగస్ ఓట్లు ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని నేతలిద్దరూ వరుసగా రెండు రోజుల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆరోపించారు.
అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులతో విస్తృతంగా ప్రచారం చేస్తుంటే, బీజేపీ అసలు అభ్యర్థి ఎవరో దిక్కుతోచక, పసలేని విమర్శలు చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఏపీకి ప్రత్యేక హోదా, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి నిధుల్లో భారీ కోత, వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంలో నిర్లక్ష్యం తదితర అంశాలు బీజేపీపై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది.
ఇప్పుడు బీజేపీ ముందున్న అతిపెద్ద సవాల్ నోటాను అధిగమించడం. ఎందుకంటే మిత్రపక్షమైన జనసేన ఓట్లు కూడా బీజేపీకి పడేలా లేవు. ఈ నేపథ్యంలో పరువు కాపాడుకునేందుకు బీజేపీ నేతలు బోగస్ ఓట్ల సాకును నెత్తికెత్తుకుని ఊరేగుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.