తిరుప‌తి ప్ర‌చారానికి పవ‌న్ క‌ల్యాణ్ ష‌ర‌తుల‌వేనా!

తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక ప్ర‌చారంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొంటారా?  లేక అక్క‌డ త‌న పార్టీ పోటీ చేయ‌డం లేదు కాబ‌ట్టి లైట్ తీసుకుంటారా? అనేది ఈ బై పోల్…

తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక ప్ర‌చారంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొంటారా?  లేక అక్క‌డ త‌న పార్టీ పోటీ చేయ‌డం లేదు కాబ‌ట్టి లైట్ తీసుకుంటారా? అనేది ఈ బై పోల్ ఘ‌ట్టంలోని ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. బీజేపీతో దోస్తీ త‌ర్వాత జ‌న‌సేన ఆ పార్టీతో క‌లిసి చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు ఏమీ లేవు. 

జాయింటుగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాలు ఏమీ లేవు. ఇలాంటి నేప‌థ్యంలో తిరుప‌తి బైపోల్ వ‌చ్చింది. మ‌రి అక్క‌డ ఈ రెండు పార్టీలూ భుజం భుజం క‌లిపి ప‌ని చేస్తాయా? అనేది సందేహంగానే ఉంది. జ‌న‌సేన విష‌యంలో బీజేపీకి ఎలాంటి అభిప్రాయాలున్నాయో, బీజేపీ విష‌యంలో జ‌న‌సేన‌కూ అలాంటి అభిప్రాయాలే ఉండ‌టం గ‌మ‌నార్హం!

జ‌న‌సేన ను బీజేపీ ఎంత త‌క్కువ అంచ‌నా వేస్తోందో, బీజేపీని జ‌న‌సేన అంతే త‌క్కువ అంచ‌నా వేస్తోంది. ఇద్ద‌రికీ ప‌ర‌స్ప‌రం చిన్న చూపు ఉంది. మీరెంత అంటే మీరెంత అనే తీరునే రెండు పార్టీల మ‌ధ్య‌నా వాతావ‌ర‌ణం కొన‌సాగుతూ ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో తిరుప‌తి టికెట్ పై కూడా చాలా ర‌చ్చ జ‌రిగింది. 

చివ‌ర‌కు బీజేపీ పై చేయి సాధించి, టికెట్ ను ఓన్ చేసుకుంది. అయితే అభ్య‌ర్థి విష‌యంలోనే బీజేపీ చాలా త‌ట‌ప‌టాయింపుల త‌ర్వాత ఒక క్లారిటీకి రాగ‌లిగింది. ఇక ఆ అభ్య‌ర్థికి జ‌న‌సేన ఎంత వ‌ర‌కూ మ‌ద్ద‌తు ప‌లుకుతుంది?  తిరుప‌తిలో బీజేపీ విజ‌యం కోసం జ‌న‌సేన ఎంత వ‌ర‌కూ ప‌ని చేస్తుంది? అనేవి సందేహాలు!

సూటిగా స్ప‌ష్టం అవుతున్న విష‌యంలో.. జ‌న‌సేన‌కు ఎలాంటి క్యాడ‌ర్ లేదు. స్థిర‌మైన పార్టీ నిర్మాణం లేదు. ఇలాంటి నేప‌థ్యంలో బీజేపీని జ‌న‌సేన ప్ర‌త్యేకంగా ఉద్ధ‌రించేది ఏమీ లేదు. తిరుప‌తిలో జ‌న‌సేన బ‌లం ఎంతో.. స్థానిక ఎన్నిక‌ల‌తో స్ప‌ష్టం అయ్యింది. 

ఈ లోక్ స‌భ సెగ్మెంట్ ప‌రిధిలో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఎలాంటి ప్ర‌భావం చూపించ‌లేని జ‌న‌సేన‌, తిరుప‌తి కార్పొరేష‌న్ ఎన్నిక‌లో.. క‌నీసం నాలుగైదు వందల ఓట్లు సాధించ‌లేక‌పోయింది తిరుప‌తిలో త‌మ‌కు ఎంతో బ‌లం అని చెప్పుకున్న జ‌న‌సేన రెండంటే రెండు డివిజ‌న్ల‌కు నామినేష‌న్లు వేయ‌గ‌ల‌గ‌డం, అక్క‌డ కూడా విజ‌యం మాట అటుంచి… ఒక్కో చోట క‌నీసం రెండు వంద‌ల ఓట్ల‌ను సాధించ‌లేక‌పోవ‌డం.. ఆ పార్టీ ప‌రిస్థితిని తేట‌తెల్లం చేసింది.

ఇక బీజేపీ కూడా తిరుప‌తి కార్పొరేష‌న్ ప‌రిధిలో ఏ ర‌కంగానూ ఉనికిని చాట‌లేక‌పోయింది. ఇలా రెండు పార్టీల రంగులూ బ‌య‌ట‌ప‌డిన అనంత‌రం తిరుప‌తి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో.. ఈ పార్టీలు ఉమ్మ‌డిగా ఎలాంటి ఫ‌లితాన్ని పొందుతాయ‌నేది వీటి పొత్తు భ‌విత‌వ్యాన్ని కూడా తేల్చ‌బోతోంది.

ఇక ఈ ఉప ఎన్నిక ప్ర‌చారంలో కూడా బీజేపీ, జ‌న‌సేన‌లు ఎంత వ‌ర‌కూ యాక్టివ్ గా ఉంటాయ‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. బీజేపీ అభ్య‌ర్థి త‌ర‌ఫున ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చారం చేస్తారా?  చేయిస్తారా? అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక పెద్ద ష‌ర‌తునే పెట్టార‌ట‌! అదేమిటంటే.. బీజేపీ అధినాయ‌క‌త్వం తిరుప‌తి లోక్ స‌భ సీటుకు ప్ర‌చారానికి వ‌స్తే..త‌ను కూడా ప్ర‌చారం చేసి పెడ‌తానంటూ ష‌ర‌తు విధించార‌ట ప‌వ‌న్ క‌ల్యాణ్.

బీజేపీ అధినాయ‌క‌త్వం అంటే.. అమిత్ షా రావాల‌ట‌, దాంతో పాటుగా.. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక ప్ర‌చారానికి వచ్చ‌నిట్టుగా యోగి ఆదిత్య‌నాథ్, త‌దిత‌రులంతా వ‌స్తే.. త‌ను కూడా తిరుప‌తి బై పోల్ ప్ర‌చారంలో పాల్గొన బోతున్న‌ట్టుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ష‌ర‌తు విధించార‌ట‌. 

బీజేపీకి అమిత్ షా, యోగి ఆదిత్య‌నాథ్ వంటి వారు ఎలాంటి వారో, జ‌న‌సేన‌కు త‌నే ఆ స్థాయి కాబ‌ట్టి.. వారితో స‌మానం అంటున్నార‌ట ప‌వ‌న్ క‌ల్యాణ్. వాళ్లు ప్ర‌చారానికి వ‌చ్చే ప‌క్షంలో త‌ను కూడా హాజ‌రు కాబోతున్న‌ట్టుగా బీజేపీ వాళ్ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ క్లారిటీ ఇచ్చార‌ట‌. తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌ను బీజేపీ అధిష్టానం ఎంత వ‌ర‌కూ సీరియ‌స్ గా తీసుకుంటుందో ఇంకా క్లారిటీ లేదు. 

త‌మ అభ్య‌ర్థి నోటాతో పోటీ ప‌డే చోట‌.. ప్ర‌చారానికి అధినాయ‌క‌త్వం అంతా దిగొస్తుందా? అనేది సందేహ‌మే. మ‌రి వారు ప్ర‌చారానికి రాని ప‌క్షంలో త‌ను కూడా వ‌చ్చే ప్ర‌స‌క్తి లేద‌ని ప‌వ‌న్ అంటున్నార‌ట‌. అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ మొద‌ట ఇలానే బెట్టు చేస్తార‌ని, ఆ త‌ర్వాత ఆయ‌న‌ను బుజ్జ‌గించి ప్ర‌చారానికి ర‌ప్పించ‌వ‌చ్చ‌నేది బీజేపీ నేత‌ల లెక్క‌ట‌. బెట్టు చేయడం, బుజ్జ‌గించుకునేలా చేయ‌డం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అల‌వాటే అని వారు అంటున్నారు. ఆఖ‌రికి ఏపీ రాజ‌కీయాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పాత్ర ఇలా త‌యారైన‌ట్టుగా ఉంది!