తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో 23 సీట్లు అయినా వచ్చాయి… అయితే ఓపెన్ హార్ట్ సర్జన్ కు అది కూడా ఇష్టం లేనట్టుగా ఉంది. ఆ పార్టీని రెండు సీట్లకో, మూడు సీట్లకో పరిమితం చేసేంత వరకూ ఆ ఓపెన్ హార్ట్ సర్జన్ నిద్రపోయేలా లేరని స్పష్టం అవుతూ ఉంది.
తమ శత్రువు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద బుదరజల్లడంలో అనేక ప్రయత్నాల్లో విఫలం అయ్యి, ఇప్పుడు మరో దురాగతానికి కూడా వెనుకాడటం లేదు ఆ పత్రికాధినేత. ఇలాంటి ప్రయత్నాలు ఆయనకు కొత్త కాదు, కొత్తవీ కావు.
జగన్ ను తను చిత్రీకరించినట్టుగా జనం నమ్మాలనేది ఆయన తాపత్రయం. అయితే ఆయన ప్రయత్నాలు విఫలం అవుతూనే ఉన్నాయి. అయినా కొండకో వెంట్రుక వేయడం, వస్తే కొండ, లేకపోతే వెంట్రుక అన్నట్టుగా మారింది సదరు వీకెండ్ కామెంటరేటర్ పరిస్థితి!
అయితే ఇక్కడ.. ఆయన మరో విషయాన్ని చర్చకు తెస్తున్నాడు. అదే చంద్రబాబునాయుడి మాట తీరు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అధికారులతో లైవ్ సమావేశాల్లో, పబ్లిక్ మీటింగుల్లో చంద్రబాబు నాయుడు అనేక సార్లు అడ్డగోలుగా మాట్లాడారు! ఆ మాటల్లో కొన్ని విన్నాకా.. ఇంతకీ ఆయనకు ఏమైంది? అని ప్రజలు అనుకోవాల్సి వచ్చింది.
అందులో కొన్ని గుర్తు చేస్తే.. బ్రిటీష్ వారితో పోరాడిన పార్టీ తెలుగుదేశం, భారతదేశాన్ని అవినీతిమయం చేసేంత వరకూ నిద్రపోయేది ఉండదు.. ఇలాంటివి మొదలుపెడితే చంద్రబాబు నాయుడు మాట్లాడిన అర్థం లేని మాటలెన్నో ఉంటాయి. అంతే కాదు.. చరిత్రను వక్రీకరించి, అబద్ధాలను కూడా నిజాలని తను నమ్మేసినట్టుగా చంద్రబాబు నాయుడు పలు మాటలు మాట్లాడారు.
అమరావతిలో ఒలింపిక్స్, ఒలింపిక్స్ పతకం గెలిస్తే నోబెల్ ప్రైజ్ ఇప్పిస్తా.. ఇలా చంద్రబాబు నాయుడు! ఈ మాటలకు వేరే సాక్ష్యాలు అక్కర్లేదు. వీడియో కెమెరాలు, జర్నలిస్టుల ఎదురుగానే చంద్రబాబు నాయుడు ఇలాంటి మాటలు మాట్లాడారు. అయినా ఒలింపిక్స్ లో పతకం గెలిస్తే నోబెల్ ప్రైజ్ ఇప్పిస్తా.. అని చంద్రబాబు నాయుడు అప్పట్లో చేసిన ప్రకటన షాకింగ్!
ఎలాంటి మానసిక స్థితి ఉన్న వారు అలా మాట్లాడతారు? అనేది బిగ్ కొశ్చన్! అక్కడకూ అప్పటికే కాంగ్రెస్ నేతలు చంద్రబాబుకు ఆల్జీమర్స్ అంటూ దెప్పి పొడిచే వారు. చంద్రబాబు చేసిన తలాతోకలేని ప్రకటనలు విన్నాకా.. కాంగ్రెస్ నేతల కామెంట్లు గుర్తుకు వస్తే తప్పు ప్రజలది కాదు.
అలాగే.. సత్యానాదెళ్ల మైక్రోసాఫ్ట్ లో సీఈవోగా నియమితం అయ్యాకా చంద్రబాబు నాయుడు మరో విస్మకరమైన ప్రకటన చేశారు. సత్యానాదెళ్ల ఆ స్థాయికి ఎదగడానికి తనే కారణమన్నారు. అంతటితోనూ ఆగక సత్యానాదెళ్ల తండ్రి తన వద్ద పని చేశారంటూ ఒక అంతుబట్టని విషయాన్ని చెప్పుకొచ్చారు.
అయితే.. సత్యానాదెళ్ల తండ్రి ఏపీ ప్రభుత్వోద్యోగిగా పని చేసే సమయానికి చంద్రబాబు నాయుడు సీఎం కాదు కదా, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎన్టీఆర్ అల్లుడు అనే హోదాలో ఉన్న వ్యక్తి మాత్రమే. అలాంటప్పుడు చంద్రబాబు దగ్గర సత్యానాదెళ్ల తండ్రి పని చేసి ఉండే అవకాశమే లేదు. అయినా.. చంద్రబాబు ఒక భ్రమతో కూడిన కథను చెప్పారప్పట్లో.
ఇక పాపాలు చేసే వాళ్లే హుండీల్లో డబ్బులేస్తారంటూ అధికారులతో సమావేశాల్లో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఒకవైపు తన భార్యే అడపాదడపా హుండీల్లోకి డబ్బులు వేయడాన్ని కూడా పత్రికల్లో వార్తలుగా వేస్తుంటారనే విషయాన్ని కూడా మరిచి చంద్రబాబు నాయుడు అలాంటి ప్రకటనలు చేశారు.
ఇలాంటి పిచ్చిపరాకాష్ట అనదగ్గ అనేక రకాల ప్రకటనలు ఓపెన్ గా చేశారు చంద్రబాబు నాయుడు. దీన్ని ప్రత్యర్థులు ఆయన మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లనే ఇలా అని అభివర్ణించారు. అయితే చంద్రబాబు చేసిన విస్మయకరమైన, తలాతోకలేని ప్రకటనలను కూడా అప్పట్లో ఓపెన్ హార్ట్ సర్జన్ విపరీతంగా సమర్థించుకొచ్చారు.
ఆ తర్వాత ఫలితం ఎలా ఉండిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు జగన్ గురించి వంకరటింకర రాతలు రాసి.. జనాల్లో ఏదో పుట్టించాలన్న ఆయన ప్రయత్నాలను చూస్తే..చంద్రబాబు మాట్లాడిన అనుచితమైన మాటలు, ఆయన వ్యవహరించిన అనుచితమైన తీరంతా గుర్తుకు రాకమానదు!