దాదాపు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ రిలేషన్ షిప్ ను కూడా దాచలేదు. ఎప్పటికప్పుడు సెల్ఫీలు వదులుతూనే ఉన్నారు. అయితే ఇంత జరుగుతున్నా నయన్ ను పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు విఘ్నేష్ శివన్.
ఇదిగో ఇప్పుడు, అదిగో అప్పుడు అంటూ గాసిప్స్ రావడమే తప్ప విఘ్నేష్ లేదా నయన్ నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు నయనతారతో పెళ్లిపై స్పందించాడు విఘ్నేష్ శివన్.
తాజాగా సోషల్ మీడియాలో ఛాటింగ్ చేసిన ఈ దర్శకుడ్ని, ఓ వ్యక్తి ఇదే విషయంపై సూటిగా ప్రశ్నించాడు. ఎందుకు మీరిద్దరూ పెళ్లి చేసుకోరని అడిగాడు. దీనికి కాస్త వెరైటీగా సమాధానం ఇచ్చాడు విఘ్నేష్. పెళ్లికి, పెళ్లి తర్వాత కార్యక్రమాలకు, ఆ తర్వాత జీవితానికి చాలా డబ్బు అవసరమని, అందుకే తామిద్దరం ప్రస్తుతం డబ్బులు కూడబెట్టే పనిలో బిజీగా ఉన్నామని అన్నాడు.
కాస్త ఫన్నీగా అనిపించినా విఘ్నేష్ సమాధానంలో లాజిక్ ఉందంటూ అతడ్ని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. ఇక నయనతారకు సంబంధించిన సీక్రెట్ ఏదైనా చెప్పమని అడిగితే, దానికి కూడా రియాక్ట్ అయ్యాడు విఘ్నేష్. నయనతార నెయ్యి అన్నం, చికెన్ కర్రీ చాలా బాగా చేస్తుందట. తనకు చాలాసార్లు చేసి పెట్టిందట.
ఛాట్ సందర్భంగా నయన్ తో దిగిన మరో సెల్ఫీని రిలీజ్ చేశాడు విఘ్నేష్. అయితే తమకు ఇలాంటి సెల్ఫీలు వద్దని, నయన్ ను కిస్ చేసే ఫొటో కావాలని ఓ నెటిజన్ అడిగాడు. దీనిపై స్పందించిన విఘ్నేష్.. నయన్ ను కిస్ చేసే సమయంలో తను బిజీగా ఉంటానని, కాబట్టి సెల్ఫీ తీసుకోలేనని.. ఆ టైమ్ లో ఫొటో తీయడానికి మరో వ్యక్తి ఎవరైనా ఉంటే బాగుంటుందని ఫన్నీగా స్పందించాడు.