పచ్చ పిచ్చి పీక్స్

మళ్లీ ఏమైనా అంటే మీడియాను మీడియా అనడం ఏమిటీ? అంటూ సుద్దులు చెబుతారు. సమస్యల మీద దృష్టి పెట్టాలి కానీ మా మీద ఏమిటీ? అంటారు. ఎంత శతృవు అని డిసైడ్ అయిపోయినా బిలో…

మళ్లీ ఏమైనా అంటే మీడియాను మీడియా అనడం ఏమిటీ? అంటూ సుద్దులు చెబుతారు. సమస్యల మీద దృష్టి పెట్టాలి కానీ మా మీద ఏమిటీ? అంటారు. ఎంత శతృవు అని డిసైడ్ అయిపోయినా బిలో ది బెల్ట్ కొట్టకూడదు అని ఓ ధర్మసూత్రం వుంది. కానీ శతృవు కదా ఎలాగైనా ఓడించాల్సిందే. 

వీలయితే బరిలోంచి తప్పించేయాల్సిందే అనే అక్కసుతో మీడియా ధర్మాధర్మాలు కూడా మరచిపోయి వార్తలు వండి వారుస్తున్నారు. దాన్నే నిలదీస్తే, విశ్లేషిస్తే, అటు జల్లుతున్న బురదలోంచి కొంత తీసి ఇటువేయడం ప్రారంభిస్తున్నారు. ఏమిటిది?

కుక్కను చంపాలి అనుకుంటే దాన్ని పిచ్చిది అని ముద్ర వేయాలి. ఓ ఉద్యోగిని తీసేయాలంటే ఫైలు తయారుచేయాలి అనే సూత్రాలు వున్నాయి. 

ఆంధ్ర సిఎమ్ జగన్ మోహన్ రెడ్డి పని తీరును తట్టుకోలేక, మరో రెండేళ్ల తరువాత మళ్లీ అతగాడే సిఎమ్ అయితే ఇక తమ భవిష్యత్ ఎలా వుంటుందో అనే భయంతో, అన్ని రకాలుగా, అన్ని విధాలుగా, అన్ని వైపుల నుంచి, జగన్ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు. చేసుకోవచ్చు. తప్పులేదు. ఎందుకుంటే అతగాడిని తమ శతృవుగా ఫీల్ అవుతున్నారు కనుక. 

కానీ అక్కడ కూడా మీడియా ధర్మాలు అనేవి కొన్ని వుంటాయని మరిచిపోతే ఎలా? ఓ ముఖ్యమంత్రిపై గ్యాసిప్ లు రాసి, ప్రజల్లో చులకన చేయాలని అనుకోవడం ఏపాటి సబబు? ఓ ముఖ్యమంత్రి రాత్రి పూట ఆత్మలతో, దేవుడితో మాట్లాడతాడని ప్రచారం ఛేయడానికి పూనుకోవడం వెనుక ఉద్దేశం ఏమై వుంటుంది? ఆ ముఖ్యమంత్రిని జనాల్లో పలుచన చేయాలనే కదా? 

ఇదే పని మరో మీడియా మీరు అభిమానించే నాయకుడి మీద చేస్తే మీరు ఎలా స్పందిస్తారు. ఇలా పేరు ఊరు లేకుండా ఓ అధికారి, కొందరు అధికారులు ఇలా చెప్పారు అంటూ ఏమైనా రాసుకోవచ్చు. ఎవరి మీదయినా రాసుకోవచ్చు. ఎన్నయినా రాసుకోవచ్చు. దానికి పెద్ద కష్టం కూడా లేదు. దారుణమైన అక్రమసంబంధాలు కూడా అంటకట్టి మరీ రాసుకోవచ్చు. 

ఇలా తమ చిత్తానికి కథలు వండేసి, వార్చేసి, వ్యక్తిత్వ హననానికి తెగబడవచ్చు. కానీ ఇదంతా ఎందుకోసం? ఏళ్ల తరబడి అధికారం మీ దగ్గరే వుంది. పట్టుమని రెండేళ్లు దాటింది మీ అధికారం చేజారి. మరో రెండు, రెండున్నరేళ్లలో మళ్లీ ఎన్నికలు వస్తాయి. 

జగన్ అనేవాడు చేపడుతున్న పథకాలు, గ్రామాల్లో అందుబాటులోకి వచ్చిన అధికార వ్యవస్థ, రైతులకు దొరుకుతున్న విత్తనాలు, స్కూళ్లకు కొత్త హంగులు, ఆసుపత్రుల అభివృద్ది ఇలా అన్నీ చూస్తుంటే ఎక్కడో గుండెల్లో గబులు. మళ్లీ జగన్ అధికారంలోకి వచ్చేస్తే ఇక తమ బతుకు బస్టాండే అనే భయం. ఆ భయం నుంచి పుట్టుకువచ్చిన ఆందోళన. ఆ ఆందోళన కారణంగా వదిలేస్తున్న విచక్షణ. 

కానీ ఒక్కోసారి జనాలు ఎంత అమాయకత్వంతో వుంటారో, అంతకు అంతా తెలివిగా వ్యవహరిస్తుంటారు. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో ఇదే మీడియా ఇంతా అంతా ఊదరకొట్ట లేదు. సింగిల్ నెగిటివ్ న్యూస్ లేదు. నిత్యం పత్రికలో కలర్ ఫుల్ సినిమాలే. నిత్యం చంద్రబాబును గాల్లోకి లేపి, ఈఫిల్ టవర్ ఎత్తున నిల్చోపెట్టడమే. కానీ ఏం జరిగింది? జనాలు ఎందుకు నమ్మలా? 

చంద్రబాబు పాజిటివ్ వార్తలు ఇలా చదివి అలా పక్కన పెట్టిన జనాలు, జగన్ నెగిటివ్ వార్తలు మాత్రం పట్టించుకుంటారని సదరు మీడియా ఎలా భ్రమపడుతోంది? కేవలం తమ ప్రయత్నం తాము చేయాలని, తమ అక్కసు తాము వెళ్లకక్కాలని, తమ స్వామి భక్తి తాము ప్రదర్శించాలనే తాపత్రయం అనుకోవాలా? లేక పిచ్చి పీక్స్ కు చేరిపోయింది అనుకోవాలా?