ఈ రోజు 'సాక్షి' ఏపీ ఎడిషన్ లో ఫస్ట్ పేజీలో ఒక ప్రముఖ వార్తను, ఒకింత సంచలన వార్తను ప్రచురించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ కూతుళ్ల బ్యాంకు రికార్డులు ఇచ్చారని యూనియన్ బ్యాంకు ఉద్యోగులు ఐదు మందిని బదిలీ చేశారు అనేది ఆ వార్త సారాంశం.
అమరావతి అక్రమాలపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ ఏసీబీకి జస్టిస్ రమణ కూతుళ్ల బ్యాంకు లావాదేవీల రికార్డులను ఇచ్చారని బ్యాంకు ఉద్యోగులను బదిలీ చేసింది యూనియన్ బ్యాంకు యాజమాన్యం. ఒకరకంగా ఇది బ్యాంకు అంతర్గత వ్యవహారమే.
అయితే ఇప్పుడు అంతర్గత బదిలీల విషయంలో కూడా ఇప్పుడు బ్యాంకులు కొన్ని రూల్స్ పెట్టుకున్నాయని, కరోనా నేపథ్యంలో బదిలీల ప్రక్రియలను ఆపారని, అలాగే విజయవాడ రీజియన్ నుంచి బదిలీ అయిన ఐదు మందిలో ఒకరు రిటైర్మెంట్ కు మరో ఏడాది కాలమే ఉందని, ఇలాంటి సమయంలో సాధారణంగా బదిలీలు చేయరని 'సాక్షి' పేర్కొంది.
అయినా ఈ బదిలీలు జరగడం అసాధారణ ఒత్తిళ్ల ఫలితమే అని పేర్కొంది. అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించి యూనియన్ బ్యాంకుకు ఏసీబీ అధికారులు లేఖ రాయడం, అందుకు అధికారులు స్పందించడం జరిగిందట.
అనధికారికంగా ఏమీ జరగలేదని, అంతా అధికారికంగా జరిగిందట. అయినా ఈ కేసులో రికార్డులు అందించిన అధికారులపై బదిలీవేటు వేసినట్టుగా 'సాక్షి' పేర్కొంది. ఇదంతా బెదిరించే ప్రక్రియ అని, కొన్ని కేసుల విచారణకు బ్యాంకుల నుంచి ప్రాథమిక సహకారం కూడా అందకుండా చేసేందుకు ఈ బదిలీలపై ఒత్తిళ్లు వచ్చాయని, అందుకు ఫలితామే నిబంధనలను కూడా ఖాతరు చేయకుండా ఈ బదిలీలు జరిగాయని .. ఏసీబీ లేఖకు స్పందించినందుకు బ్యాంకు ఉద్యోగులు పనిష్మెంట్ బదిలీలు చోటు చేసుకున్నట్టుగా ఆ కథనంలో పేర్కొన్నారు.
రాజకీయ నేతల అవినీతి వ్యవహారాల్లో విచారణల సందర్భంగా సహకరించిన అధికారులపై బదిలీలు జరగడం, రాజకీయ నేతల అవినీతిని తిరగదోడిన అధికారులను బదిలీ చేశారు, సస్పెండ్ చేశారు అనే వార్తలను ఈ దేశం చాలా చూసింది.
అలాంటి సమయాల్లో కోర్టులు స్పందించిన దాఖలాలు కూడా అప్పుడప్పుడున్నాయి. అయితే ఇప్పుడు సుప్రీం కోర్టు జస్టిస్ రమణ కూతుళ్ల అక్రమాలపై విచారణలో ఇలా బ్యాంకు అధికారులు అనూహ్యమైన బదిలీలకు గురయ్యారనే 'సాక్షి' కథనం మాత్రం సంచలనంగానే ఉంది.