ఆయుర్వేదం ఆనందయ్య. కరోనా వ్యాప్తి సమయంలో ఆనందయ్య క్రేజ్ అంతా ఇంతా కాదు. కరోనా రాకుండా ఒక మందు, వస్తే మరో మందు, ప్రాణం పోయేవారికి చుక్కలమందు.. ఇలా ఆనందయ్య వైద్యం అద్భుతం అని ప్రచారం జరిగింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ప్రాంతంలో ఆనందయ్య మందు పంపిణీ చేపట్టేవారు.
ఆనోటా ఈనోటా ప్రచారం జరిగి జనం తండోపతండాలుగా అక్కడికి వచ్చేసరికి స్థానిక అధికారులు అడ్డుకట్ట వేశారు. చివరకు కోర్టు జోక్యంతో ఆయన ఉచితంగానే చాలా వరకు మందు పంపిణీ చేపట్టారు. నాయకులు, ఇతర పెద్దలు.. ఆనందయ్యతో ప్రత్యేకంగా కేజీలకొద్దీ మందుని తయారు చేయించుకుని తమ వారికి పంచిపెట్టుకున్నారు.
కట్ చేస్తే ఇప్పుడు కరోనా కేసులు తగ్గాయి, దాదాపుగా కరోనా అంటే జనాల్లో భయం కూడా తగ్గిపోయింది. అంతకు ముందులా ఆనందయ్య పేరు కూడా వినపడ్డంలేదు. వారానికోసారి హైకోర్టు.. ఆనందయ్య చుక్కల మందుపై ఏదో ఒక కామెంట్ చేస్తే మాత్రం ఆయన పేరు పేపర్లలో పడుతుంది.
రాజకీయమే పరమావధి..
ఒక రకంగా ఆయుర్వేదం మందు ఉచితంగా అందించి ప్రజాసేవ చేశారు ఆనందయ్య. ఇప్పుడాయన నేరుగా ప్రజా క్షేత్రంలో దిగుతానంటున్నారు. గతంలో ఆయన వైసీపీ నాయకుడు, ఆయన్ను ఫేమస్ చేసింది, కొన్నాళ్లపాటు ఆయనకు అండదండగా ఉన్నది వైసీపీ ఎమ్మోల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి.
కానీ ప్రస్తుతం కాకాణికి, వైసీపీకి దూరంగా ఉంటున్నారు ఆనందయ్య. సొంత పార్టీ పెడతానని ఆమధ్య స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ మాత్రం ఆపేశారు.
ఇప్పుడప్పుడే కాదు..
ఆనందయ్య ఫేమస్ అయిన తర్వాత ఆయన సామాజిక వర్గంలో పలుకుబడి బాగా పెరిగింది. జిల్లాల వారీగా ఆయన్ను తీసుకెళ్లి సన్మానాలు, సత్కారాలు చేశారు సదరు సామాజిక వర్గం ప్రజలు. తమ కులంలో ఆణిముత్యం అంటూ కొనియాడారు.
ఒకరకంగా అక్కడే ఆయనకు రాజకీయాల్లోకి రావాలనే బీజం పడింది. తన చుట్టూ ఉన్న మద్దతుదారులంతా రాజకీయాల్లోకి వస్తే తనకు మద్దతుగా నిలుస్తారనే ఆలోచనతో పార్టీ పెడుతున్నానంటూ ప్రకటించారు ఆనందయ్య. రథయాత్ర చేపడతానని కూడా అన్నారు.
ప్రకటన వచ్చింది కానీ ఆయన ఎందుకో ఇంకా ఆలోచనలోనే ఉన్నారు. పార్టీ గురించి ప్రస్తావిస్తే.. ఇప్పుడల్లా కాదని చెబుతున్నారు. ఇదే విషయంపై ఆనందయ్యను కదిలించింది గ్రేట్ ఆంధ్ర. పార్టీ పెట్టే అంశంపై ఆయన నర్మగర్బంగా స్పందించారు. పార్టీపై ఇంకా కసరత్తు జరుగుతోందన్నారు. అది ఇప్పుడప్పుడే కాదని, బహుశా వచ్చే ఏడాది వీలవుతుందేమోనని అన్నారు.
మొత్తమ్మీద రాజకీయ పార్టీ పెట్టడం, దాన్ని నడపడం, ఎన్నికల్లో పోటీ చేయడం.. అన్నీ ఆనుకున్నంత ఈజీ కాదు. అందులోనూ ఏపీలో రాజకీయ శూన్యత అసలే లేదు. ప్రతిపక్ష పార్టీ అనే అర్హత కోసమే పెద్ద ఎత్తున పోరాటాలు సాగుతున్నాయి.
ఈ సమయంలో ఆనందయ్య పార్టీపెట్టి నడపడం అనుకున్నంత సులభం కాదు. మరి ఆనందయ్య పార్టీపై ముందుకు సాగుతారో లేక, ఆయుర్వేదం మందు పంపిణీయే ప్రజా సేవగా భావించి పక్కకు తప్పుకుంటారో వేచి చూడాలి.