తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గట్టి హెచ్చరిక చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్పై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ‘దళితబంధు’ అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఫోర్జరీ సంతకాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి దళిత బంధు పథకాన్ని బీజేపీ నిలిపేసిందనే ప్రచారాన్ని టీఆర్ఎస్ చేసిందన్నారు.
ఎన్నికలు ముగిశాయని, ఫలితం కూడా వచ్చిందని, ఇక ‘దళితబంధు’ అమలుకు ఎలాంటి అడ్డంకులు లేవని ఆయన అన్నారు. ఒక్క దళిత బంధు పథకమే కాదని, ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ రేపటి నుంచే సీఎం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క దళిత బంధు పథకమే కాదని, బీసీ బంధు, ఎస్టీ బంధు, అగ్రవర్ణాల్లో పేదల కోసం ఓ బంధును అమలు చేస్తానని సీఎం చెప్పిన మాటలను బండి సంజయ్ గుర్తు చేశారు.
వీటన్నిటిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా తాము ఒత్తిడి తెస్తామన్నారు. ఒకవేళ వీటిని అమలు చేయకపోతే తాము ఉద్యమిస్తామని, అప్పుడు టీఆర్ఎస్ తట్టుకోలేదని బండి సంజయ్ హెచ్చరించారు. ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరుకు ప్రజలు ఆశ్చర్యపోయారన్నారు. హుజురాబాద్లో అడ్డదారిలో గెలవాలని అధికార పార్టీ చూసిందని, డబ్బులు పంచి హుజురాబాద్ ప్రజలను అవమానించారన్నారు.
ఓటుకు రూ.6వేల చొప్పున పంపిణీ చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ గెలిస్తే హుజూరాబాద్ ప్రజలకు అవమానకర పరిస్థితి తలెత్తేదన్నారు. అందుకే తమ ఓట్లను డబ్బులతో కొంటారా? అని హుజూరాబాద్ ప్రజలు ఆలోచించి తగిన గుణపాఠం చెప్పా రన్నారు. ఓటర్ల విజ్ఞతకు చేతులెత్తి మొక్కాలన్నారు. సీఎం, మంత్రులు ఎన్నో అబద్ధాలు చెప్పారన్నారు.
ఏకంగా అబద్ధాలకే ఓ శాఖను ఏర్పాటు చేశారని వెటకరించారు. టీఆర్ఎస్ అబద్ధాలను, జిమ్మిక్కులను ప్రజలు నమ్మలేద న్నారు. హుజూరాబాద్ ప్రజలకు మొదటి నుంచి మాజీ మంత్రి ఈటల అండగా ఉన్నారని గుర్తు చేశారు. ఈటల గెలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు తమ పార్టీ రుణపడి ఉంటుందని బండి సంజయ్ అన్నారు.