తక్కువ స్థాయి జీతం పొందే ఉద్యోగులకు వైద్య సేవలను అందించాల్సిన వ్యవహారంలో అత్యంత భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది ఇప్పుడేమీ కాదు. ముందుగా తెలంగాణలో ఇందుకు సంబంధించి వ్యవహారం బయటకు వచ్చింది. దేవికారాణి అనే ఒక ఉద్యోగి అక్కడ భారీ స్కామ్ కు పాల్పడటం, ఐదేళ్లలో 400 కోట్ల రూపాయలకు సంబంధించి స్కామ్ లో ఆమె పాత్ర బయటకు రావడం, ఆమెను ఏసీబీ అధికారులు ఆరెస్టు చేయడం కొన్ని నెలల కిందటే జరిగింది. ఆమె అక్రమాస్తుల చిట్టాను కూడా బయటకు తీశారు. హైదరాబాద్ నుంచి అమరావతి, తిరుపతి వరకూ కూడా ఆమె ఆస్తులున్నాయని తేల్చారు. తెలంగాణలో సంచలనం రేపిన ఆ తరహా స్కామ్ ఏపీలో కూడా జరిగిందనే విషయం నెమ్మదిగా బయటకు వచ్చింది.
ఈఎస్ఐ నిబంధనల ప్రకారం.. అక్కడ ఏం కొనాలన్నా టెండరింగ్ పద్ధతిలోనే జరగాలి. అయితే ఏపీలో నామినేషన్ పద్ధతిలో భారీగా కొనుగోళ్లు జరిగాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో ముగ్గురు ఉద్యోగులను అరెస్టు చేశారు. మరో ఐదు మంది ఉద్యోగుల నుంచి స్టేట్ మెంట్లను తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఆ ముగ్గురు ఉద్యోగులు ఇచ్చిన సమాచారం మేరకు స్కామ్ వివరాలన్నీ బయటకు వచ్చాయి.
నామినేషన్ పద్దతిన కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. కొన్ని డమ్మీ కంపెనీలను సృష్టించారు. మందులు కొనకపోయినా కొన్నట్టుగా చూపించారు, అవసరం లేకపోయినా శస్త్ర చికిత్స పరికరాలను కొన్నారు. కొన్న పరికరాలకు మార్కెట్ రేటు కన్నా చాలా ఎక్కువ ధరను చెల్లించారు. ఆపై టెలీ మెడిసిన్ అంటూ ఒక్కో కాల్ కు ఇంత అంటూ దోచారు. ఎన్ని కాల్స్ వచ్చాయి, ఎలాంటి సేవలు అందించారు అనే లెక్కలేవీ లేకుండా ఒక ఏజెన్సీకి కోట్ల రూపాయల డబ్బును చెల్లించారు.
ఇంతకీ ఈ వ్యవహారాల్లో అచ్చెన్నాయుడి పాత్ర ఏమిటి? అంటే.. లేఖలు ఇవ్వడం! నామినేషన్ పద్ధతిలో వందల కోట్ల రూపాయల వ్యవహారాలను చేసి, , టెండర్ల అవసరం లేకుండా తను చెప్పిన కంపెనీలకే మందుల సరఫరా కాంట్రాక్టులు ఇవ్వాలని నాటి మంత్రిగా అచ్చెన్నాయుడు లేఖలు రాసినట్టుగా తెలుస్తోంది. నకిలీ కంపెనీలకు కోట్ల రూపాయల చెల్లింపులు, మందులు కొనకుండానే వందల కోట్ల రూపాయలు ఇవ్వడం.. ఇలాంటి స్కామ్ లో మంత్రి లేఖలతో సహా దొరికినట్టుగా ఉన్నారు. ఈ విషయంపై ఇప్పటికే అచ్చెన్న స్పందించారు కూడా. కొన్నాళ్ల కిందట ఆయన మాట్లాడుతూ తను నిప్పు అని, తెలంగాణలో చేసినట్టుగానే ఏపీలో కూడా జరిగిందని ఆయన తేల్చి చెప్పారు. స్కామ్ జరిగిందని అలా ఆయనే క్లారిటీ ఇచ్చారు. ఇక ఆయన పాత్రకు సంబంధించి కీలక ఉద్యోగుల స్టేట్ మెంట్లే ఆధారంగా ఆయన అరెస్టు జరిగిందని ఏసీబీ చెబుతోంది. అలాగే ఈ వ్యవహారంలో మరింత మంది రాజకీయ పాత్రధారులున్నారని టాక్. మరో మాజీ మంత్రి తనయుడికి కూడా ఈ స్కామ్ లో వాటా ఉందట. ఆ అరెస్టు కూడా జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.