నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటుంటారు జగన్. ఆయన మాటిస్తే చేస్తారు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు, ఆరు నూరైనా అమలు చేసి తీరుతారు. అలాంటి జగన్ పోలవరంపై స్టేట్ మెంట్ ఇచ్చేశారు. 2022లో పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు.
ఇదేమాట చంద్రబాబు అంటే ఎవరైనా లైట్ తీసుకుంటారు. ఎందుకంటే ఆయనవన్నీ గాలిమాటలు, గ్రాఫిక్స్ చేతలు. కానీ ఇక్కడ పోలవరానికి డెడ్ లైన్ పెట్టింది సీఎం జగన్. మాట తప్పని, మడమ తిప్పని మనిషి. అందుకే ప్రజల్లో ఇప్పుడు కొత్త ఆశ చిగురించింది.
2022నాటికి పోలవరం పూర్తవుతుందనే భావన బలపడుతోంది. అయితే పరిశీలకులు మాత్రం జగన్ స్టేట్ మెంట్ పై ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తంచేస్తున్నారు. అటు అధికారులు ఇంకాస్త టెన్షన్ పడుతున్నారు.
ఏళ్ల తరబడి సాగుతున్న పోలవరం ప్రాజెక్టుని మరో రెండేళ్లలో పూర్తిచేయడం సాధ్యమేనా అనేదే ఇక్కడ ప్రశ్న. వైసీపీ అధికారంలోకి వచ్చాక కనీసం ఒక శాతం కూడా పని జరగలేదని టీడీపీ విమర్శలు చేస్తున్న వేళ.. ఏకంగా రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని జగన్ స్టేట్ మెంట్ ఇవ్వడం వెనక ఆంతర్యమేంటి? ఆయనది ఓవర్ కాన్ఫిడన్సా, లేక ఓన్లీ కాన్ఫిడెన్సా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి.
పోలవరం అంచనా విలువ 55,548కోట్ల రూపాయలుగా గతంలో కేంద్ర జలశక్తి సంస్థ పరిధిలోని సాంకేతిక సలహా కమిటీ నిర్థారించింది. దీనిపై సమీక్ష జరిపి రూ47,725కోట్లుగా తేల్చారు.
అయితే 2013-14 అంచనా ప్రకారం పోలవరం వ్యయాన్ని కేవలం 20,398 కోట్ల రూపాయలుగా తీర్మానిస్తూ.. అదే మొత్తాన్నీ తాము ప్రాజెక్ట్ కి కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ చెబుతోంది. ఇక్కడే కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వివాదం మొదలైంది.
గతంలో టీడీపీ ప్రభుత్వం చేసుకున్న చీకటి ఒప్పందం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కొర్రీలు వేస్తోందని వైసీపీ విమర్శిస్తుండగా.. కేసుల తొలగింపు కోసం జగనే పోలవరం నిధుల్లో రాజీ పడ్డారని టీడీపీ గొడవ చేస్తోంది.
ఎవరి వాదన ఎలా ఉన్నా.. పోలవరం నిధుల్ని పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి వసూలు చేస్తామని ధీమాగా చెబుతున్నారు వైసీపీ నేతలు. కుదరని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే పోలవరాన్ని పూర్తి చేసి చూపిస్తుందని సవాల్ విసురుతున్నారు.
అంతా బాగానే ఉంది కానీ.. ప్రస్తుతం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకే నిధులు సరిపోవడంలేదు, ఇక పోలవరాన్ని కూడా భుజానికెత్తుకుంటే.. కుదిరేపనేనా అనే అనుమానం చాలామంది మనసుల్లో ఉంది.
ప్రస్తుతం రాష్ట్రం వద్ద తగినన్ని నిధుల్లేవు. కేంద్రం ఇచ్చేలా లేదు. నిర్వాసితుల విషయంలో కేంద్రం పెడుతున్న పేచీలు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి టైమ్ లో జగన్ పోలవరంపై హామీ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
అయితే జగన్ వ్యవహార శైలి తెలిసినవారెవరికైనా పోలవరం 2022కి పూర్తి కావడం అనేది అసాధ్యం కాదనిపిస్తోంది. జగన్ ఓ మాట ఇచ్చారంటే.. దానికి కట్టుబడి ఉంటారు. ఆయన నోటి నుంచి ఓ మాట వచ్చిందంటే అందులో విశ్వసనీయత ఉంటుంది. అంటే పోలవరాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, 2022 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారని స్పష్టమవుతోంది.
అలాంటి ఆలోచన లేకపోతే.. జగన్ సామాన్యంగా పోలవరంపై టార్గెట్ ఫిక్స్ చేయరు. టార్గెట్ ఫిక్స్ చేశారు కాబట్టి జగన్ ఇక నిద్రపోరు. అంటే 2022 నాటికి పోలవరం పూర్తయి, ఖరీఫ్ కు పోలవరం కాలువల నుంచి నీరు పారుతుంది. జగన్ గురించి తెలిసిన వాళ్లంతా ఇది జరిగి తీరుతుందంటున్నారు.