లోకల్ లాక్ డౌన్ తో ఉపయోగం ఎంత..?

ప్రకాశం జిల్లా ఒంగోలు, చీరాల పూర్తిగా లాక్ డౌన్ లో ఉన్నాయి. ప్రైవేట్ వెహికల్స్ తో పాటు.. ఆర్టీసీ బస్సులు కూడా ఆపేశారు. గతంలో కంటే ఇప్పుడు మరింత కఠినంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. అటు…

ప్రకాశం జిల్లా ఒంగోలు, చీరాల పూర్తిగా లాక్ డౌన్ లో ఉన్నాయి. ప్రైవేట్ వెహికల్స్ తో పాటు.. ఆర్టీసీ బస్సులు కూడా ఆపేశారు. గతంలో కంటే ఇప్పుడు మరింత కఠినంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. అటు శ్రీకాకుళం లో కూడా దాదాపు ఇలాంటి నిర్బంధాలే అమలులో ఉన్నాయి. అనంతపురం కూడా మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ఇలాంటి లోకల్ లౌక్ డౌన్స్ తో ఉపయోగం ఎంతనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మిగతా అన్ని రాష్ట్రాల్లో లాగే ఏపీలో కూడా లాక్ డౌన్ సమయంలో కేసుల నమోదు శాతం రోజు రోజుకీ తగ్గిపోతూ వచ్చింది. తీరా అన్ లాక్ చేసిన తర్వాత తమిళనాడు ప్రభావం గట్టిగా పడింది. సరిహద్దు జిల్లాల్లో రోజూ నమోదయ్యే కొత్త కేసుల్లో దాదాపు 90శాతం చెన్నైనుంచి వచ్చినవారే ఉంటున్నారు. అంటే తమిళనాడు బోర్డర్ మూసేస్తే అసలు సమస్యే ఉండేది కాదు, కానీ అన్ లాక్ నిబంధనలు అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా ఉండటం, ప్రజల భావోద్వేగాలను ప్రభుత్వాలు మన్నించడంతో ఈ సమస్య వచ్చింది.

దీంతో మళ్లీ లోకల్ లాక్ డౌన్ మొదలైంది. ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి, మంత్రులకు సమాచారం అందించి స్థానికంగా లాక్ డౌన్ లు ప్రకటించేశారు. అయితే ఏపీలో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్యలో ముందున్న కర్నూలు, కృష్ణా జిల్లాల్లో మాత్రం ఇలాంటి లాక్ డౌన్ లేకపోవడం విచిత్రం. ముందు జాగ్రత్తగా ఒంగోలు, అనంతపురం, శ్రీకాకుళంలో మాత్రమే నిబంధనలు కఠినతరం చేశారు.

స్థానికంగా ఈ నిబంధనలు అమలు చేసి జిల్లా సరిహద్దుల్లో స్ట్రిక్ట్ గా ఉండి కరోనా కట్టడి చేస్తారు సరే. మరి రేపు అన్ లాక్ చేశాక పరిస్థితి ఏంటి? మిగతా ప్రాంతాల నుంచి రాకపోకలు మొదలైతే అప్పుడేం చేస్తారు. ఒకవేళ లాక్ డౌన్ ప్రకటిస్తే.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిబంధనలు ఒకే రకంగా అమలు చేయాలని, లేదంటే.. అన్నిచోట్లా వెసులుబాట్లు ఇవ్వాలనేది కొంతమంది వాదన. లోకల్ లాక్ డౌన్ వల్ల ప్రయోజనం ఉండదని, ఆంక్షలు తీసేశాక ఆటోమేటిక్ గా కరోనా కేసులు పెరుగుతాయని అంటున్నారు.

ఎలాగూ కేంద్రం చేతులెత్తేసింది కాబట్టి.. రాష్ట్రాలైనా లాక్ డౌన్ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆ మూడు జిల్లాల్లో అమలు చేసి వదిలేస్తే లాభం లేదు. మిగతా జిల్లాల్లో కూడా కరోనా తీవ్రతను బట్టి నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ఏపీలో రేపటినుంచి కొత్త రాజకీయం

కల్నల్ భార్యకు డిప్యూటీ కలెక్టర్ హోదా