రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మొదటి నుంచి వివాదాస్పదమైన అధికారే. వివాదాలకు, నిమ్మగడ్డకు అవినాభావ సంబంధం ఏదో ఉన్నట్టుంది. ఎక్కడ వివాదం ఉంటుందో అక్కడ నిమ్మగడ్డ ఉంటారనే నానుడి ఏపీ రాజకీయాల్లో ఇటీవల బాగా ప్రచారంలోకి వచ్చింది.
రాజ్యాంగమనే గొప్ప ఆయుధం నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ లాంటి స్వార్థపరుడి చేతిలో ఎంతగా విలవిలలాడుతోందో ఊహించ డానికే భయమేస్తోంది. రాజ్యాంగాన్ని, వ్యవస్థల్ని తన స్వార్థ రాజకీయాలకు నిమ్మగడ్డ ఎంతలా దుర్వినియోగం చేస్తున్నాడ నేందుకు తాజాగా ఓ హోటల్‌లో బీజేపీ నేతలతో అతను రహస్యంగా నిర్వహించిన సమావేశమే నిదర్శనం.
ఈ నెల 13న హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, ఆ పార్టీకే చెందిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌రావు రహస్యంగా గంటన్నర పాటు చర్చలు జరపడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పది రోజుల క్రితం జరిగిన సమావేశ వివరాలు ఇప్పుడు విజువల్స్‌తో సహా బట్టబయలయ్యాయి.
పంచాయతీరాజ్ చట్ట సవరణ నేపథ్యంలో నిమ్మగడ్డ తన పదవి కోల్పోవడం, దానిపై హైకోర్టును ఆశ్రయించడం, అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఒక వైపు సుప్రీంకోర్టు నిమ్మగడ్డకు నోటీసులు పంపి, విచారణను వాయిదా వేసింది.
నిన్నమొన్న వరకు రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ వ్యక్తి, తిరిగి ఆ పదవి కోసం న్యాయ పోరాటం చేస్తూ, అందులోనూ తన కేసులో ఇంప్లీడ్ అయిన కామినేని లాంటి వాళ్లతో రహస్య సమావేశం కావడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. నిమ్మగడ్డ వ్యవహార శైలి మొదటి నుంచి కొన్ని పార్టీలకు అనుకూలంగా ఉంటూ వస్తోంది. ఏపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తూ కేంద్ర హోంశాఖకు ఐదు పేజీల లేఖ రాయడం, అది ఎస్ఈసీ రాయలేదని ఆ కార్యాలయం పేర్కొన్న విషయం తెలిసిందే.
అయితే ఆ లేఖ టీడీపీ కార్యాలయంలో తయారైందని అనుమానం వ్యక్తం చేస్తూ…నిజానిజాలు నిగ్గు తేల్చాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు ఆ లేఖపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఆ లేఖ ఎన్నికల సంఘం కార్యాలయలంలో తయారు కాలేదని సీఐడీ ప్రాథమిక విచారణలో నిగ్గు తేల్చింది. అంతేకాదు, విజయ సాయిరెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేసిన తర్వాతే ఆ లేఖ తానే రాసినట్టు నిమ్మగడ్డ ఒప్పుకోవడాన్ని గమనించాలి.
తాజాగా ఆయన రహస్యంగా చర్చలు జరిపిన ఇద్దరు బీజేపీ నేతలు కూడా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితులు కావడం విశేషం. అంతేకాదు, నిమ్మగడ్డ, సుజనా, కామినేని ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. పచ్చి రాజకీయ నాయకుడి వలే వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ లాంటి వ్యక్తి రాజ్యాంగ వ్యవస్థలో ఉంటే ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తారో ఊహించడం కష్టమైన పనికాదు.
రాజ్యాంగ పదవిని ప్రజల కోసం వినియోగించడానికి బదులు, స్వప్రయోజనాల కోసం నిమ్మగడ్డ వాడుకుంటున్నారనేందుకు ఇంత కంటే నిదర్శనం ఏం కావాలి? న‌్యాయస్థానాలు రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలనే గొప్ప ఆశయంతో ఆలో చిస్తుంటే…నిమ్మగడ్డ మాత్రం దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుండం చర్చనీయాంశమైంది. ఇలాంటి వ్యక్తి మరోసారి రాజ్యాంగ పదవి చేపడితే…వ్యవస్థకు జరిగే నష్టాన్ని ఎవరు పూడ్చాలి? రాజ్యాంగ వ్యవస్థల్ని ఎలా కాపాడాలి?
హైకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడేందుకే తప్ప, నిమ్మగడ్డ లాంటి వ్యక్తి అవకాశవాదుల కోసం ఎంత మాత్రం కాదు. ఈ నిస్సహాయ స్థితిలో రాజ్యాంగమా…నిన్ను నీవే కాపాడుకో అని వేడుకోవడం తప్ప ఏపీ ప్రజలకు మరో దిక్కేది?.