అమెరికా వ‌ద్దంటోంది…బ‌తుకు ఉండ‌మంటోంది!

అమెరికా అంటే మ‌న దృష్టిలో ఓ భూత‌ల స్వ‌ర్గం. స‌హ‌జంగా మ‌నిషి సుఖాన్వేషి. ఏం చేసినా సుఖ‌సంతోషాల కోస‌మే ప్ర‌తి ఒక్క‌రూ నిత్యం ప‌రిత‌పిస్తుంటారు. త‌మ క‌ల‌ల‌ను నెర‌వేర్చే దేశం అమెరికా అనే భావ‌న…

అమెరికా అంటే మ‌న దృష్టిలో ఓ భూత‌ల స్వ‌ర్గం. స‌హ‌జంగా మ‌నిషి సుఖాన్వేషి. ఏం చేసినా సుఖ‌సంతోషాల కోస‌మే ప్ర‌తి ఒక్క‌రూ నిత్యం ప‌రిత‌పిస్తుంటారు. త‌మ క‌ల‌ల‌ను నెర‌వేర్చే దేశం అమెరికా అనే భావ‌న మొద‌టి నుంచి మ‌న‌లో బలంగా నాటుకుపోయింది. చ‌దువు నిమిత్తం అమెరికా వెళ్ల‌డం. అక్క‌డే ఉద్యోగం, ఆ త‌ర్వాత గ్రీన్‌కార్డ్‌…ఇలా ఎన్నెన్నో క‌ల‌లు కన్న‌, కంటున్న వారి క‌ల‌ల‌ను క‌రోనా మ‌హ‌మ్మారి క‌ల్ల‌లు చేస్తోంది.

అమెరికాను క‌రోనా అత‌లాకుతలం చేస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో ఆ దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతుండ‌డం ఆ దేశ ప్ర‌భుత్వానికి వారికి భృతి ఇవ్వ‌డం పెద్ద స‌వాల్‌గా మారింది. ఈ నేప‌థ్యంలో త‌మ దేశంలో నిరుద్యోగ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు విదేశీ వృత్తి నిపుణుల‌కు జారీ చేసే హెచ్‌1 బీ స‌హా అన్ని ర‌కాల వర్క్ వీసాల‌ను తాత్కాలికంగా నిలిపి వేయాల‌ని ఆ దేశ అధ్య‌క్షుడు ట్రంప్ నిర్ణ‌యించారు.

ఈ నిర్ణ‌యం మ‌న దేశ విద్యార్థుల‌తో పాటు ఉద్యోగాన్వేష‌ణ‌లో ఉన్న వారికి తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. ట్రంప్ నిర్ణ‌యం అమెరి కాలో ఉన్నతవిద్యను అభ్యసించిన భారతీయ గ్రాడ్యుయేట్ల‌కు నిద్ర క‌రవు చేసింది. ఎందుకంటే గ్రాడ్యుయేషన్‌ అయిపోగానే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) వర్క్‌ పర్మిట్‌తో ఉద్యో గం చేస్తున్న దాదాపు 25 వేల మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఈసారి హెచ్‌1బీ వీసా రానిపక్షంలో స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సిందే.

హెచ్‌1బీ సహా అన్ని రకాల వర్క్‌ వీసాల రద్దుపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులిస్తాన‌ని  ట్రంప్  ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ఇదే జ‌రిగితే మాత్రం వేలాది మంది భార‌తీయులు ఉద్యోగులు కోల్పోయి రోడ్డున ప‌డ‌తారు.  ఓపీటీపై పనిచేస్తూ  హెచ్‌1బీ వీసా కోసం ఎదురు చూస్తున్న దాదాపు 40 వేల మంది ఉద్యోగాలు కోల్పోతార‌ని అంచ‌నా. వీరిలో ఎల్‌–1పై అమెరికా వెళ్లిన 15 వేల మంది ఐటీ నిపుణులు కూడా ఉన్నారు.

ప్రస్తుతం అమెరికాలో హెచ్‌1బీ వీసాపై పనిచేస్తున్న ఐటీ నిపుణుల రెన్యువల్‌ దరఖాస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఒక వైపు చెబుతున్నారు. అయితే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ వెలువడే దాకా భ‌విష్య‌త్ ఏంట‌నేది చెప్పలేమంటున్నారు. ఎందుకంటే గ‌తంలో ట్రంప్ ఎన్నిక‌ల్లో గెలిచేందుకు అమెరిక‌న్ల‌కే ఉద్యోగాల‌నే నినాదాన్ని విస్తృతంగా ప్ర‌చారంలోకి తీసుకొచ్చార‌నే విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడు కూడా దాన్నే మ‌రోసారి అస్త్రంగా వినియోగించే అవ‌కాశం ఉందంటున్నారు. ఈ ఏడాది జ‌రిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ట్రంప్ దేనికైనా వెనుకాడ‌ర‌ని, ఇందుకోసం  ఎంతటి కఠిన నిర్ణయాలనైనా తీసుకొనే ప్రమాదం లేక‌పోలేద‌ని భారతీయ ఐటీ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

ఈ ఏడాది మార్చిలో దాదాపు 1.67 లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులు హెచ్‌1బీ వీసాలకు దరఖాస్తు చేశారు. వీరిలో 70 వేల మంది లాటరీలో ఎంపికయ్యారు. వారికి వీసాలు జారీ చేసే ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. మామూలుగా జూన్‌ నుంచి లాటరీ ద్వారా ఎంపికైన వారికి హెచ్‌1బీ వీసాలు జారీ చేస్తారు. అయితే ఈసారి కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలోని పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయాలు మూతపడ్డాయి.

అయినా దాదాపు 8 వేల మందికి హెచ్‌1బీ వీసాలు మంజూరయ్యాయి. మిగిలిన వారి దరఖాస్తులు పరిశీలిస్తున్న సమయంలో కొత్త స‌మ‌స్య వేధిస్తోంది. జూలై నుంచి రెన్యువల్‌ అయ్యే వారి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.  ఏది ఏమైనా అమెరికాలో ఉద్యోగుల భ‌ద్ర‌త దిన‌దిన‌గండంగా మారింది. ఎప్పుడేమ‌వుతుందో తెలియ‌క , భ‌విష్య‌త్‌ను త‌లుచుకుని ఆందోళ‌న‌తో బ‌తుకు వెళ్ల‌దీయాల్సిన ప‌రిస్థితి. 

ఏపీలో రేపటినుంచి కొత్త రాజకీయం

కల్నల్ భార్యకు డిప్యూటీ కలెక్టర్ హోదా