నిత్యం వార్తల్లో వ్యక్తిగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా సొంత ప్రభుత్వంపై వ్యతిరేక గళం వినిపించడం స్టార్ట్ చేసినప్పటి నుంచి …జగన్ వ్యతిరేక ఎల్లో మీడియా ఆయన్ని నెత్తికెత్తుకుంది. దీంతో అయినదానికి కానిదానికి రఘురామకృష్ణంరాజు అభిప్రాయాలు చెప్పడం అలవాటు చేసుకున్నారు. ఇటీవలి పరిణామాలు అందరికీ తెలిసినవే.
ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు పరువుకు తనకు తానుగా లెక్క కట్టారు. రఘురామకృష్ణంరాజు వేలాది కోట్ల ఆస్తిపాస్తులకు యజమానిగా పేరుంది. అలాంటిది తన పరువుకు కట్టిన లెక్క చూసి …ఓర్నీ రఘురామ పరువు విలువ ఇంత తక్కువా? అని జనం నిట్టూర్పు విడుస్తున్నారు. అసలేం జరిగిందంటే…
తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు బేషరతు క్షమాపణ చెప్పాలని కోరుతూ సాక్షి మీడియాకు రఘురామకృష్ణంరాజు లీగల్ నోటీస్ పంపారు. 15 రోజుల్లో నోటీసుకు సమాధానం ఇవ్వకుంటే …రూ.50 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఇటీవల రఘురామకృష్ణంరాజు అరెస్ట్, అనంతర పరిణామాల నేపథ్యంలో ఆయనపై సాక్షి మీడియా పలు కథనాలు ప్రచురించడంతో పాటు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో రఘురామరాజు తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్చంద్ర నోటీసు జారీ చేశారు.
నోటీసులో రూ.50 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేస్తామనడం చర్చకు దారి తీసింది. రఘురామకృష్ణంరాజు వివిధ కేసుల నిమిత్తం చెల్లించే లాయర్ల ఫీజులే కోట్ల రూపాయల్లో ఉంటుందనే అభిప్రాయాలున్నాయి.
అలాగే ఆయన పారిశ్రామికవేత్తగా వేల కోట్లకు అధిపతి అనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో తన పరువు కేవలం రూ.50 కోట్లగా రఘురామే పేర్కొనడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.