జగిత్యాల ఘటన జగన్ కు మేలుకొలుపా..?

తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూసి విసిగివేసారిన లబ్ధిదారులు వాటిని ఆక్రమించుకున్నారు. తెలంగాణవ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. నిర్మాణం పూర్తయి మూడేళ్లయినా తామింకా పూరి గుడిసెల్లో ఎందుకుండాలని లబ్ధిదారులు…

తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూసి విసిగివేసారిన లబ్ధిదారులు వాటిని ఆక్రమించుకున్నారు. తెలంగాణవ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. నిర్మాణం పూర్తయి మూడేళ్లయినా తామింకా పూరి గుడిసెల్లో ఎందుకుండాలని లబ్ధిదారులు అధికారుల్ని నిలదీశారు. 

ఇదే పరిస్థితి ఏపీలోని టిడ్కో ఇళ్ల వ్యవహారంలో వస్తే జగన్ తట్టుకోగలరా. ప్రజల్లో అసహనం పెరగకముందే వాటిపై నిర్ణయం తీసుకోవడం మంచిది. టీడీపీపై కోపంతో ప్రజలను టిడ్కో ఇళ్లకు దూరం చేస్తున్నారనే అపవాదు ఇంకా ఉంది. దాన్ని జగన్ ఎంత త్వరగా తుడిచేసుకుంటే అంత బెటర్.

తెలంగాణలో ఏం జరిగింది..?

తెలంగాణ ఏర్పడిన తర్వాత పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ అప్పట్లో పెద్ద వాగ్దానమే చేశారు. ఆ తర్వాత ఎక్కడ ఎవరిని పరామర్శించడానికి వెళ్లినా, మీకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చేస్తామంటూ హామీ ఇవ్వడం కేసీఆర్ కి ఆయన మంత్రి వర్గ సహచరులకు కూడా అలవాటైపోయింది. 

తొలి విడతలో 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని ఇప్పటికే చాలాసార్లు కేసీఆర్ సర్కారు ప్రకటించింది. అయితే వాటి సంఖ్య లక్ష మాత్రమేననేది ప్రతిపక్షాల ఆరోపణ. అయితే అలా పూర్తయిన ఇళ్లను ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో లబ్దిదారులకు కేటాయించలేదు. దీంతో కొన్ని శిథిలావస్థకు చేరుకోగా.. మరికొన్ని చోట్ల ఎలక్ట్రానిక్ సామగ్రిని దొంగలు దోచుకెళ్లారు. 

ఈ క్రమంలో జగిత్యాలలో లబ్ధిదారులు ప్రభుత్వ తీరుకి నిరసనగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై దండెత్తారు. వాటిని ఆక్రమించుకున్నారు. అయితే రెవెన్యూ అధికారులు వెంటనే రంగంలోకి దిగి వారిని అక్కడ్నుంచి తరిమేశారు.

ఇదే సీన్ ఏపీలో రిపీట్ అయితే..!

ఇక ఏపీ విషయానికొస్తే.. ఎన్టీఆర్ గృహాల పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఆసరాగా తీసుకుని టిడ్కో ఇళ్లను నిర్మించింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. కేంద్రం ఇచ్చే రాయితీ పోను, లబ్ధిదారులే బ్యాంకు నుంచి లోను తీసుకోవాల్సిన పరిస్థితి. ఎన్నికల వేళ ఈ టిడ్కో ఇళ్లు తమను కాపాడతాయనుకున్న బాబుకి ప్రజలు చుక్కలు చూపించారు. అదే సమయంలో టిడ్కో ఇళ్లను ఉచితంగా పేదలకు ఇస్తామని వైసీపీ నేతలు కొంతమంది పెద్ద హామీలిచ్చేశారు.

కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ఇంతవరకు ఒక్క ఇంటిని కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు. కరోనా కష్టకాలంలో అవి క్వారంటైన్ సెంటర్లుగా మారడం మినహా.. వాటితో ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదు. రాగా పోగా వాటి రంగులు మార్చడంలో మాత్రం వైసీపీ నేతలు, అధికారులు అత్యుత్సాహం చూపించి విమర్శలు మూటగట్టుకున్నారు.

టిడ్కో ఇళ్ల కేటాయింపు అదిగో ఇదిగో అంటూ దాటవేస్తున్నారే కానీ, నిజంగా వాటిని లబ్ధిదారులకు ఇవ్వాలన్న ఆలోచన అధికారుల్లో కూడా లేదు. ఈలోగా జగనన్న కాలనీల్లో నిర్మాణాలు మాత్రం ఓ కొలిక్కి వచ్చేలా ఉన్నాయి. టిడ్కో ఇళ్ల కంటే ముందు జగనన్న కాలనీల్లో గృహప్రవేశాలు జరగాలని, అప్పుడే వైసీపీకి మంచి మైలేజీ వస్తుందనేది ఆ పార్టీ నేతల భావన.

అయితే బ్యాంకులో లోన్లు తీసుకుని, నోటీసులందుకుంటున్న టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు మాత్రం మింగలేక, కక్కలేక ఇబ్బంది పడుతున్నారు. వీరి అసహనాన్ని, ఆగ్రహాన్ని ఎక్కువరోజులు తొక్కిపెట్టాలనుకోవడం సరికాదు. 

జగనన్న కాలనీలతో పాటు, పూర్తయిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించడం అందరికీ శ్రేయస్కరం. లేకపోతే ఏపీలో కూడా జగిత్యాల సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి ఘటనే కనుక జరిగితే ఏరికోరి టీడీపీకి మరో అస్త్రం అందించినట్టవుతుంది.