వయసు మీద పడుతున్నా కాలం కంటే ముందే పరిగెత్తాలనుకోవడం చంద్రబాబుకి అలవాటు, అలా పరిగెత్తే క్రమంలో బొక్కబోర్లా పడటం కూడా ఆయనకు అనుభవమే. ఆలూ లేదు చూలూ లేదు.. రాజధాని అమరావతి అంటూ.. అధికారంలో ఉండగా హడావిడి చేసి రాష్ట్రాన్ని నిట్టనిలువునా ముంచేశారు బాబు.
గ్రాఫిక్స్ రాజధాని నిర్మించి చివరకు అధికారం కోల్పోయారు. తీరా వైసీపీ అధికారంలోకి వచ్చాక అదిగో జమిలీ, ఇవిగో ఎన్నికలంటూ కొన్నాళ్లు కహానీలు చెప్పారు. ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందో స్థానిక సంస్థల పోరాటంలో బాబుకి బాగా అర్థమైంది.
తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఊరికి ముందే అభ్యర్థిని ఖరారు చేసి నానా హంగామా చేశారు. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత పనబాక లక్ష్మిని అభ్యర్థిగా నిలబెట్టినా.. ఏమాత్రం రాజకీయానుభవం లేని డాక్టర్ గురుమూర్తి, జగన్ ఆశీస్సులతో సునాయాస విజయం సాధించారు.
తిరుపతి అనుభవం సరిపోలేదా..
తిరుపతి అనుభవం చంద్రబాబుకి సరిపోలేదు, అందుకే ఇప్పుడు బద్వేలు బరిలో నోటిఫికేషన్ వెలువడటానికి ముందే అభ్యర్థిని ప్రకటించి రాజకీయం మొదలుపెట్టారు. బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణం కారణంగా అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గంలో 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్ పై వైసీపీ అభ్యర్థి వెంకట సుబ్బయ్య 44వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.
సుబ్బయ్య మరణంతో ఇప్పుడు మరోసారి అదే స్థానం నుంచి రాజశేఖర్ ని పోటీకి దింపేందుకు రంగం సిద్ధం చేశారు చంద్రబాబు. టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారు చేశారు.
తిరుపతి ఉప ఎన్నికల విషయంలో సెంటిమెంట్ ఓట్ల కోసం వారసుల్ని ఎంపిక చేసే సంప్రదాయానికి స్వస్తి పలికి, అసలు రాజకీయ అనుభవమే లేని గురుమూర్తిని తెరపైకి తెచ్చారు సీఎం జగన్. బద్వేలులో మాత్రం దివంగత నేత వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధకు అవకాశమిచ్చారు. ఆమె ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు, గెలుపుపై ధీమాగా ఉన్నారు.
విజయం అసాధ్యమని తెలిసినా కూడా నోటిఫికేషన్ వెలువడటానికి ముందే అభ్యర్థిని ఖరారు చేసి బద్వేలులో హడావిడి మొదలు పెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు చంద్రబాబు. ఎన్నికలొస్తే సత్తా చూపిస్తామంటూ.. చెప్పడం మినహా, చేసి చూపించడం మరచిపోయారు బాబు.
ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని రంకెలేస్తున్న టీడీపీ.. బద్వేలులో దాన్ని నిరూపించాలని సవాల్ విసురుతున్నారు వైసీపీ నేతలు. తిరుపతి తరహాలోనే బద్వేల్ లో కూడా గెలుపెవరిది అనేదాని కంటే, వైసీపీకి మెజార్టీ ఎంత అనే విషయంపైనే ఎక్కువగా చర్చ నడుస్తోంది.