పెదనాన్న దివంగత ముఖ్యమంత్రి, నాన్న దివంగత మాజీ మంత్రి, మాజీ ఎంపీ, అన్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత గల కుటుంబానికి చెందిన ఆడబిడ్డ… తమకు ప్రాణహాని ఉందని భయాందోళన వ్యక్తం చేయడం కంటే దుస్థితి ఏమైనా ఉందా? ఉండదు కాక ఉండదని ఎవరైనా అంటారు.
ఔను మరి …తెలుగు సమాజంలో అత్యంత ప్రభావశీల రాజకీయ కుటుంబం ఏదైనా ఉందా? అంటే, అది వైఎస్సార్ కుటుంబమనే చెబుతారు. దివంగత వైఎస్సార్ తమ్ముడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఏకైక తనయ డాక్టర్ సునీత తన కుటుంబానికి ప్రాణహాని పొంచి ఉందని ఆవేదన, ఆందోళన చెందుతోంది. ఈ మేరకు కడప ఎస్పీ అన్బురాజన్, డీజీపీ, సీబీఐ అధికారులకు ఆమె లేఖలు రాయడం సంచలనం సృష్టిస్తోంది.
ఏ ప్రత్యర్థి పార్టీకి చెందిన పాలకులో ఉంటే, ఆమె ఆందోళనను అర్థం చేసుకోవచ్చు. కానీ తన అన్న పాలిస్తున్న రాజ్యంలో ఓ చెల్లి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని డీజీపీ, కడప ఎస్పీ, సీబీఐ అధికారులను వేడుకుంటూ లేఖలు రాయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉత్తుత్తి ఆరోపణలు ఆమె చేయడం లేదు. తన భయానికి గల కారణాలను ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు సమర్పించడం గమనార్హం.
ఈ నెల 10న పులివెందులలోని తమ నివాసం వద్ద మణికంఠరెడ్డి అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడని తన ఫిర్యాదులో సునీత పేర్కొన్నారు. వైసీపీ ముఖ్య నాయకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడే మణికంఠరెడ్డి అని ఆమె వివరించారు. తన తండ్రి హత్య కేసులో శివశంకర్‌రెడ్డి ప్రధాన అనుమానితుడని గుర్తు చేశారు. ఇప్పుడు అతని అనుచరుడు రెక్కీ నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆమె లేఖలో పేర్కొన్నారు.
సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా అనుమానితుడిని గుర్తించామని, వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు. లేఖతో పాటు సీసీ కెమెరా దృశ్యాల పెన్ డ్రైవ్‌లు కూడా పంపినట్లు ఆమె పేర్కొన్నారు. వైఎస్ వివేకా కుమార్తె ప్రాణభయంతో వణికిపోవడం చూసిన ప్రజానీకం …అయ్యో అంతటి గొప్ప కుటుంబానికి చెందిన ఆడబిడ్డకు ఎందుకీ దుస్థితి అనే ఆవేదన చెందుతోంది.