కోవిడ్-19కి విరుగుడు కోసం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 160 వ్యాక్సిన్ లు తయారీ దశలో ఉన్నాయి. వాటిల్లో 32 ఉత్పత్తులు హ్యూమన్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయి. వాటిల్లోనూ ఏడు వ్యాక్సిన్ లు హ్యూమన్ ట్రయల్స్ లో మూడో దశకు చేరుకున్నట్టుగా ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ లు మంచి ఫలితాలను నమోదు చేస్తున్నాయని తయారీ దారులు స్పష్టం చేస్తున్నారు. తమ వ్యాక్సిన్ లు కోవిడ్-19 వ్యాప్తికి చెక్ పెట్టి తీరతాయని నమ్మకంగా చెబుతున్నారు.
సెప్టెంబర్ ఆరంభంలో కొన్ని వ్యాక్సిన్ లను ఏకంగా వేల మందిపై ప్రయోగించనున్నారు. జాన్సన్ అండ్ జాన్సన్స్ వాళ్లు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 180 కేంద్రాల్లో 60 వేల మందిపై తమ వ్యాక్సిన్ ను ప్రయోగించనున్నారట. బహుశా అది తుదిదశ హ్యూమన్ ట్రయల్స్ కావొచ్చు.
ప్రపంచంలోని వేర్వేరు దేశాలకు చెందిన అరవై వేల మందిపై ఆ వ్యాక్సిన్ ప్రయోగించి, ఫలితాలు సానుకూలంగా ఉంటే.. అది దాదాపు సక్సెస్ అని పరిశీలకులు అంటున్నారు. సెప్టెంబర్ లో వ్యాక్సిన్ ను వేసినా.. పరిశీలనలు అంతా పూర్తి అయ్యే సరికి ఈ ఏడాది ఆఖరు అవుతుందని.. ఆ సమయానికి తమ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ ప్రకటించింది.
మరోవైపు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ- జెన్నర్ ఇనిస్టిట్యూట్ వాళ్ల వ్యాక్సిన్ కూడా అక్టోబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఇది ఇండియాలో కూడా తయారు కాబోతోంది. మూడో దశ ట్రయల్స్ ను ఇండియాలో కూడా నిర్వహిస్తున్నారు. కోవీషీల్డ్ పేరుతో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ వ్యాక్సిన్ ఇండియాలో అందుబాటులోకి రాబోతోందని సమాచారం.
ఇక భారత్ బయోటెక్ వారి కో వ్యాక్సిన్, పూనే బేస్డ్ జైడస్ లు కాస్త వెనుక ఉండవచ్చని అంటున్నారు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సినే ఇండియాలో మొదట అందుబాటులోకి రాబోతోందని తెలుస్తోంది. హ్యూమన్ ట్రయల్స్ లో వెనుక ఉండటంతో ఈ వ్యాక్సిన్ లు మరి కాస్త లేట్ గా అందుబాటులోకి వస్తాయని వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ 2021 ప్రథమార్థంలో సర్క్యులేషన్ లోకి వస్తుందని సమాచారం.
అయితే ఇండియా వంటి భారీ జనాభా ఉన్న దేశానికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం తేలికైన విషయం కాదు. సక్సెస్ ఫుల్ వ్యాక్సిన్ వచ్చినా.. 140 కోట్ల జనాభాకు అది రీచ్ అయ్యేదెప్పుడు? అనేది కొశ్చన్ మార్క్. తయారీదారులకు కూడా అన్ని డోస్ లు తయారు చేయడం తలకు మించిన భారం అని వార్తలు వస్తున్నాయి. కాబట్టి.. సక్సెస్ ఫుల్ వ్యాక్సిన్ వచ్చినా.. ఇండియాలో అది అందరికీ అందుబాటులోకి రావడానికి ఒక ఏడాది సమయం పట్టినా ఆశ్చర్యం లేదు. అయితే అంతలోపు కరోనానే జనం నుంచి మాయం అయినా అది అంతకన్నా ఆశ్చర్యం కలిగించని విషయం!