‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ గారు మీరు తిరుపతిలో మౌనదీక్ష ఎప్పుడు చేస్తారు’ అని రాయలసీమ వాసులు ప్రశ్నిస్తున్నారు. రాజధాని తరలింపునకు నిరసనగా ప్రదాని మోడీ అమరావతి రాజధాని నిర్మాణానికి ఉద్ధండరాయునిపాలెంలో భూమి పూజిన చేసిన ప్రాంతంలో శుక్రవారం ఉదయం 8.30 గంటలకు కన్నా లక్ష్మినారాయణ మౌనదీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో మౌనదీక్ష చేపట్టాలని రాయలసీమ వాసులు ఆహ్వానిస్తున్నారు. దానికో ప్రత్యేక కారణం లేకపోలేదు.
2014 సార్వత్రిక ఎన్నికల సమయం. బీజేపీ-టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. నాటి ప్రధాని అభ్యర్థి మోడీతో కలసి తిరుపతి నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఆ సభ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అద్భుత భరోసా కల్పిస్తూ మోడీ చేసిన ప్రసంగం వారికి విజయాన్ని తెచ్చి పెట్టింది. మోడీ ప్రసంగాన్ని తెలుగు వారి ముద్దుబిడ్డ వెంకయ్యనాయుడు బ్రహ్మాండమైన తేనెలొలికే మాతృభాషలో ఆనువదించారు.
ఆ రోజు ఎన్నికల ప్రచారంలో మోడీ మాట్లాడుతూ…ఢిల్లీని తలదన్నేలా అమరావతిని నిర్మించేందుకు సహకిరిస్తామన్నారు. అలాగే ప్రత్యేక హోదా ఇస్తామని కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి సాక్షిగా రాష్ట్ర ప్రజానీకానికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు.
ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన రాజధానిని తరలించవద్దని బీజేపీ అధ్యక్షుడు మౌనదీక్ష చేయడాన్ని ఎవరూ అభ్యంతరం పెట్టరు. అదే మోడీ శ్రీవారి సాక్షిగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడాన్ని నిరసిస్తూ…కన్నా లక్ష్మినారాయణ తిరుపతిలో ఒక్కరోజు దీక్ష చేస్తే బాగుంటుందని రాయలసీమ వాసులు కోరుతున్నారు.