కొత్త ముఖ్యమంత్రి అమరావతిని తరలించబోతున్నారన్న బాధ ఓ వైపు.. పాత ముఖ్యమంత్రి ఐదేళ్లు ఏ పనీ చేయకుండా నిద్రపోయారన్న కోపం మరో వైపు.. రాజధాని రైతుల ఆందోళనల్లో ఈ రెండు అంశాలూ స్పష్టంగా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. అనుకూల మీడియాలో జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారంతా.. ఆఫ్ ది రికార్డు చంద్రబాబుని ఏకిపడేస్తున్నారు.
ధర్నాలు చేస్తున్న రాజధాని ప్రాంత రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా చంద్రబాబు సరిగ్గా ఉండి ఉంటే, ఈ కష్టాలు తమకి వచ్చేవి కాదని బాధఫడుతున్నారు. అసలు తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు.. అని తాత్సారం చేయకుండా.. అసలైన భవనాలే నిర్మించి ఉంటే.. ఇప్పుడు వాటిని తరలించే సాహసం జగన్ చేసి ఉండేవారు కాదు కదా అని అంటున్నారు స్థానికులు. అన్నీ తాత్కాలికంగా కట్టి చంద్రబాబు తమ కొంప ముంచారని, ఇప్పుడు జగన్ ఆ తాత్కాలిక భవనాలన్నిటినీ తరలిస్తున్నారని బాధపడుతున్నారు.
ఐదేళ్ల పాటు చంద్రబాబు గ్రాఫిక్స్ తయారీలో బిజీగా ఉన్నారు. ఆ డిజైన్, ఈ డిజైన్ అంటూ కాలయాపన చేశారు, కంపెనీల స్థాపనపై దృష్టిపెట్టకుండా ఎంవోయూలు మాత్రం కుదుర్చుకుని సరిపెట్టారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలన్నీ అమరావతిలో పనులు ప్రారంభించి ఉంటే జగన్ వాటి జోలికి వచ్చేవారు కూడా కాదు, నిజంగానే అమరావతిలో ఆ ఐదేళ్లలో శాశ్వత భవనాలు నిర్మించి ఉంటే జగన్ కి రాజధాని మార్చాలన్న ఆలోచన కూడా వచ్చేది కాదేమో.
అప్పుడు చంద్రబాబు చేసిన తప్పుల వల్లే ఇప్పుడు తాము ఇబ్బంది పడుతున్నామని నిరసనకారులకు స్పష్టంగా అర్థమైంది. వాస్తవానికి అవినీతి మేత మేయడానికే చంద్రబాబు రాజధాని విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. కేంద్రం దగ్గర నిధులు కాజేస్తూ అమరావతిని ఓ కామధేనువు లాగా వాడుకోవాలనుకున్నారు. కానీ అధికారం మారడంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది.
అధికారంలోకి వచ్చిన జగన్, అమరావతి అవకతవకలన్నింటినీ బయటపెట్టారు. సీఆర్డీఏ పేరిట సాగించిన భూదందా, రియల్ ఎస్టేట్ వ్యాపారాలన్నింటినీ ప్రజల కళ్లకు కట్టారు. పనిలోపనిగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. జగన్ కు ఈ ఆలోచన రావడానికి కారణం, గతంలో చంద్రబాబు రాజధాని చుట్టూ చేసిన అవినీతి అంకమే.