ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి పరిపాలన ఎలా సాగుతోంది? ప్రధానంగా దేనిపై దృష్టిపెడుతున్నారు? కీలకంగా దృష్టి సారించాల్సిన విషయాలలో కూడా వేటిని విస్మరిస్తున్నారు? ఈ ప్రశ్నలు చాలా మందిలో దోబూచులాడుతున్నాయి.
జగన్.. అనుభవజ్ఞుడైన పాలకుడు కాదు. కానీ, ఆ అనుభవలేమి తెలియకుండా.. ఆయనకు అనేకమంది సలహాదార్లున్నారు. కానీ పాలన వ్యవహారాలలో కుదుపులు బయటకు తెలిసిపోతున్నాయి. సంక్షోభ పరిస్థితులను ‘టాకిల్’ చేయడంలో వైఫల్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని నిర్ణయాలే తేడాగా వస్తున్నాయి.
రాష్ట్ర ప్రజల ఊహకు కూడా అందనంత అద్భుతమైన సంక్షేమ పథకాలను కార్యరూపంలో పెట్టడం ద్వారా.. జగన్ పరిపాలనలో బయటపడుతున్న చిన్న చిన్న లోపాలన్నీ కప్పబడిపోతున్నాయి. కానీ కొంత అప్రమత్తంగా ఉండి, వాటిని కూడా దిద్దుకుంటే మరింతగా ప్రజల మన్నన పొందే అవకాశం ఉంది.
తూకం చెడిపోయింది సారూ…
సంక్షేమం పరిపాలన అనేవి.. నాణేనికి రెండు ముఖాల్లాంటివి. త్రాసులో ఈ రెండూ సమానంగా ఉండాలి. కానీ జగన్మోహన రెడ్డి పాలనలో తొలిరోజు నుంచి ఇప్పటిదాకా తూకం పూర్తిగా చెడిపోయింది. సంక్షేమం వైపు బరువు పెరుగుతోంది. పరిపాలనవైపు తేలిపోతోంది. రాజధాని విషయానికి వస్తే.. దాన్ని అమరావతి ప్రాంతంనుంచే మార్చేయాలని అనుకుంటున్నారు గనుక.. జగన్మోహన రెడ్డి అక్కడి పనుల మీద శ్రద్ధ పెట్టడం లేదు అనుకోవచ్చు. కానీ.. రాష్ట్రంలో మిగిలిన వ్యవహారాల పరిస్థితి ఏంటి?
పరిపాలనలో కొత్త సర్కారు ఇబ్బందులు పడుతున్నదనే సంగతి.. ఇసుక వ్యవహారంలోనే బయల్పడింది. నిజానికి అది పాలన పరమైన వైఫల్యమే. కానీ తాత్కాలికమైనది. దానికి తోడు వర్షాకాలం వల్ల సహజంగా ఉత్పన్నమయ్యే కొరత కాటేసింది. కానీ.. విపక్షాలు దానిని నానాయాగీ చేశాయి. కొన్ని వారాల కొరత వలన, నిర్మాణరంగం మొత్తానికి ఇక భవిష్యత్తే లేనట్లుగా ప్రచారం చేసి ఆందోళన చెందే కార్మికులను పొట్టన పెట్టుకున్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే.. ప్రభుత్వం చాలా సులువుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిపించి ఉండేది కానీ విఫలమైంది.
ప్రత్యేకించి ప్రస్తావిస్తే.. అనవసర చర్చకు తావిచ్చినట్లు అవుతుంది గానీ.. కొన్ని వృత్తి వర్గాలకు ప్రకటించిన తాయిలాలు, నిధుల పందేరం వంటి సంక్షేమ పథకాలు కూడా కొంత మేర విమర్శల పాలయ్యాయి. జగన్ సంక్షేమంలో కూడా పూర్తిగా తన సొంత ముద్ర మాత్రమే ఉండాలని అనుకున్నారో ఏమో తెలియదు. అయిదు రూపాయల భోజన పథకాన్ని కూడా ఉన్న పళంగా ఆపేశారు. ఆ పథకమేమీ చంద్రబాబు బుర్రలోంచి పుట్టినది కాదు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నదానినే ఆయన ఇక్కడ ప్రవేశపెట్టారు. పథకం పేరు మారిస్తే సరిపోయేదానికి.. పేదల నోటికాడ కూడు తీసేశారనే విమర్శలూ వచ్చాయి. కొన్ని విషయాలలో అనవసరమైన దూకుడు, కొన్ని విషయాలలో అవసరానికి మించిన కాలయాపన జరుగుతూ వచ్చాయి. ప్రభుత్వం తాలూకు ఏ నిర్ణయాలు ఎవరెవరి ప్రభావాలకు లోనై అలా జరిగాయో మనకు బోధపడని సంగతి.
జనంతో మాట్లాడని దాపరికమేల?
‘చంద్రబాబు ఏం చేసేవాడో.. నేను దానికి అచ్చంగా విరుద్ధంగా మాత్రమే చేస్తా’ అనే పోకడతో జగన్ వ్యవహరిస్తున్నారా? ఆయన అభిప్రాయం అదే అయితే గనుక.. అది తప్పు. అలాఅని జగన్ భావిస్తే గనుక.. అవసరానికి మించి ప్రత్యర్థి నీడను చూసి భయపడుతున్నట్లు లెక్క. వ్యవహారాలు సంబవాళించడంలో తన సొంత ఆలోచన లేకుండా.. ప్రత్యర్థి ప్రభావానికి లోనై- ఆ శైలికి వ్యతిరేకంగా నడిస్తే అది మంచిది కాదు. చంద్రబాబు సీఎంగా ఉండగా.. అవసరానికంటె ఎక్కువ సందర్భాల్లో విలేకర్ల సమావేశాలు నిర్వహిస్తుండేవారు. కానీ.. జగన్ తీరు అందుకు పూర్తిగా భిన్నం. ఆయన జమానాలో అసలు విలేకర్ల సమావేశాలే ఉండడం లేదు. విలేకర్లు అంటే… ఏదో ప్రత్యర్థులు అన్నట్లుగా.. తాను వారితో సంభాషించను అన్నట్లుగా జగన్ దాక్కోవడం ఎందుకు? ఆయన ప్రెస్ మీట్లు నిర్వహించరు. చివరికి మంత్రి స్థాయిలోని నాయకులు నిర్వహించాల్సిన ప్రెస్ మీట్లను కూడా అధికార్ల స్థాయికి తీసుకువచ్చేశారు.
నిజానికి ఆయన ‘ప్రెస్’ను శత్రువుల్లా చూడనక్కర్లేదు. ప్రతి విషయమూ ప్రజలతో నేరుగా మాట్లాడడానికి రాష్ట్రాధినేతకు వీలు కాదు. పత్రికలు కేవలం సమాచారాన్ని ప్రజలవద్దకు తీసుకెళ్లే మాధ్యమాలు. ప్రజలకు రేకెత్తగల సందేహాలే ప్రెస్ నుంచి వస్తే గనుక వాటిని ఆయన నివృత్తి చేస్తే సరిపోతుంది. కానీ అలా జరగడం లేదు. ప్రెస్ మీట్లలో విలేకర్లు కూడా పగబట్టినట్టుగా ప్రశ్నలడుగుతున్న తీరు ఇప్పుడు కనిపిస్తోంది. దానికి తగ్గట్లే ఆయన అసలు ప్రెస్ ను ఫేస్ చేయడమే మానేశారు. ఇవన్నీ మంచి సంకేతాలు కావు.
ఇలాంటి వ్యవహార సరళి ఒక తరహా ఫ్యూడల్, నిరంకుశ ధోరణులకు నిదర్శనం. ఆ మాటకొస్తే జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో కాస్త మెరుగు. అప్పుడప్పుడూ ప్రెస్ మీట్లు పెట్టేవారు. వారు ప్రశ్నలు అడిగేదాకా ఆగక, తాను చెప్పదలచుకుంది చెప్సి వెళ్లేవారు. ఇపుడు అది కూడా లేదు. నిజానికి ఇవి లేకపోవడం అనేది.. ప్రజలతో కమ్యూనికేషన్ తెంచేసుకోవడమే అవుతుంది.
సంక్షేమ పథకాల్ని తిరుగులేని రీతిలో అమలు చేసినంత కాలమూ.. ఇలాంటి మీడియా ప్రచార గిమ్మిక్కులు ఏవీ తనకు అనవసరం అని జగన్ అనుకోవచ్చు గాక.. కానీ… అక్కడే ఆయన సంతులనం పాటించాల్సి ఉంటుంది. సీఎంగా ఒక ఉన్నతమైన బాధ్యతలో ఉన్నప్పుడు దానికి తగినట్లుగానే నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఇవన్నీ మోడీ అడుగుజాడలేనా?
నాయకుడు ఎప్పుడూ కూడా అందరి మాటలను వినాలి. నిర్ణయం తాను తీసుకోవాలి. పూర్తి స్వయం నిర్ణయాధికారంతో ఒంటెత్తు పోకడలతో వ్యవహరించినా కూడా.. తన తీరులో అందరి సలహాలకు పాత్ర ఉంటోంది అన్నట్లుగా బయటకు కనిపించాలి. ఇప్పుడు కేంద్రంలో నరేంద్రమోడీ పాలన కూడా ఇదే చందంగా ఉంది. తాము చేయదలచుకున్నదంతా చేసుకుంటూ పోవడమే. ముందు వెనుకలో ఆలోచించే వ్యవధి వారికి ఉండడం లేదు. ఏదో సమయం మించిపోతున్నట్లు, ఎవరో తరుముకు వస్తున్నట్లు… అన్ని రకాల వివాదాస్పద నిర్ణయాలను వెంటవెంటనే తీసేసుకుంటూ.. మోడీ సర్కారు ఒంటెత్తు పోకడలతో.. వ్యతిరేకతలను ఏమాత్రం ఖాతరు చేయకుండా దూసుకుపోతోంది.
మోడీ 2.0 పాలన సాగుతోందిప్పుడు. ఇప్పటి మోడీ, చాలా రాష్ట్రాల పాలకులకు కూడా ఆదర్శంగా మారిపోయారు. చాలామంది సీఎంలు ఇతర అంశాలను పట్టించుకోవడం లేదు. ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఎవరినీ ఖాతరు చేయడం లేదు. తాము తలచిందే బాటగా దూసుకుపోతున్నారు. అలాంటి సీఎంల బాటలోనే జగన్ కూడా నడుస్తున్నారు.
మోడీ మార్గం తప్పు అని చెప్పడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. మోడీ ప్రెస్ ను పక్కన పెట్టినా కూడా.. ప్రజలతో టచ్ లో ఉన్నారు. మన్ కీ బాత్ కావచ్చు.. ఇతరత్రా కావొచ్చు… ఆయన నిరంతరం ప్రజలతో టచ్ లోనే ఉన్నారు. ప్రజలతో కలిసి పాలన సాగిస్తున్నాననే భావన వారికి కలిగిస్తున్నారు. కనీసం అలాంటి మార్గాలను కూడా ఎంచుకోకుండా జగన్ వ్యవహారం నడుస్తోంది.
సినీ ఫార్ములాలో పోతున్నారా?
చాలావరకు కమర్షియల్ సినిమాలకు ఒక ఫార్ములా ఉంటుంది. తొలుత కొంత యాక్షన్, తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్, ఆ తర్వాత సెకండాఫ్ కాస్త గడిచాక.. కథలో ఉండే సీరియస్ నెస్ మొత్తం చొప్పించేసి ప్రేక్షకుడిని బరువుగా ఇంటికి పంపిచండం! ఈ ఫార్ములా జగన్ పాలనకు వర్తిస్తుందా అనే అనుమానం వస్తోంది. రాగానే యాక్షన్ షురూ చేసి.. ప్రజావేదిక కూల్చివేత లాంటి గందరగోళాలు నడిపించారు. ఇప్పుడు వరుస సంక్షేమ పథకాలతో ఎంటర్‌టైన్‌మెంట్ ఎపిసోడ్ నడుస్తోంది. ఇంకొన్నాళ్లయ్యాక సీరియస్ పాలన చేస్తాననేది వారి వ్యూహం కావచ్చు. కానీ రాజకీయాల్లో ఈ ఫార్ములాలు వర్కవుట్ కావు.
మౌనం.. కొన్నిసార్లు ప్రమాదం
అమరావతి వ్యవహారమే తీసుకుందాం. రాజధానిని విశాఖకు తరలించడం అనేది జగన్ ఏకపక్షంగా తీసేసుకున్న నిర్ణయం. జీఎన్ రావు, బీసీజీ నివేదికలన్నీ.. ఆయన నిర్ణయానికి చిడతలు మాత్రమే అనేది జనాభిప్రాయం. అందులోని మంచి చెడుల సంగతి తర్వాత.. తాను అమలు చేయదలచుకున్న నిర్ణయాన్ని ప్రజలకు వెల్లడించడానికి సీఎం జగన్ కు సంకోచం ఎందుకు? ఎంతకాలం ఇలాంటి ఉద్యమాలను పోషిస్తూ.. ఆయన వ్యవహారాన్ని సాగదీస్తారు. తాను మాట్లాడవలసిన సందర్భాల్లో మంత్రులతో మాట్లాడిస్తూ, మంత్రులు మాట్లాడాల్సిన చోట అధికార్లతో మాట్లాడిస్తూ జగన్ కొత్త పోకడలు చూపిస్తున్నారు.
విశాఖకు రాజధాని ఎందుకు తరలిస్తున్నాడో, దానివల్ల రాష్ట్రానికి మేలు ఏమిటో, తన ఆలోచన ఏమిటో ఆయన తేల్చి చెప్పేయాలి. అమరావతిలో శాసనరాజధాని, కర్నూలు లో న్యాయరాజధాని అనే ప్రకటనలు కేవలం కంటితుడుపు మాటలు కాదని.. ఆచరణాత్మకంగా ఉంటామని ప్రజలకు నమ్మకం కలిగించాలి. ప్రత్యర్థులు కాకపోయినా.. ఆ మాటలు మాయేనేమో అనుకుంటున్న తటస్థులు ఇంకా ఆ ప్రాంతాల్లో ఉన్నారు. వారికి భరోసా కల్పించాలి. అప్పుడు ఆయన నిర్ణయాలకు అన్ని ప్రాంతాల నుంచి ఇప్పటికంటె పెద్దగా బలం మద్దతు లభిస్తుంది.
మంది ఎక్కువైనాక మజ్జిగ పలచనే…
వైఎస్ జగన్మోహన రెడ్డి… ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్లూ తనకు అండగా నిలిచిన వారికి, తనను నమ్ముకుని, ఆశ్రయించుకుని ఉన్న వారికి అందరికీ కూడా.. అధికారంలోకి రాగానే ఒక దారి చూపించదలచుకున్నారు. సలహాదార్లు, కన్సల్టెంట్ల రూపంలో గతంలో ఏ ప్రభుత్వంలోనూ లేనన్ని పదవులు వెల్లువలా వచ్చాయి. సలహాదార్ల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కో అంశాన్ని పాయలుపాయలుగా విడదీసి.. విడివిడిగా కన్సల్టెంట్లను నియమించారు. ఇవన్నీ ఉపాధి హామీ పదవులే అనడంలో సందేహం లేదు. పరిపాలనను గమనించినప్పుడు మాత్రం.. ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలచన’ అవుతుందనే సామెత గుర్తు రాక మానదు.
సలహాదార్లు ఎక్కువయ్యారు. మరి అందరి మేథస్సు కలిపి పాలనలో ప్రతిఫలిస్తోందా? అంటే అనుమానమే. లక్షల్లో జీతాలు తీసుకోవడానికి సలహాదార్లే తప్ప… ప్రభుత్వం ప్రతిష్ట పెంచేలా వారి పనితీరు మాత్రం లేదనే విమర్శలున్నాయి. రాజధాని తరలింపు, అధికార వికేంద్రీకరణ విషయాలకే వస్తే.. నేషనల్ మీడియా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అనేక కథనాలు వచ్చాయి. విపక్షాలు ‘మేనేజ్’ చేశాయంటూ ఆత్మవంచన చేసుకుంటే ప్రతిసారీ కుదర్దు. అలాగని మీడియాను ప్రలోభపెట్టాలని కాదు. కానీ.. ప్రభుత్వ ఆలోచన ఏమిటో, దానివల్ల ప్రభుత్వం ఆశిస్తున్న మేలు ఏమిటో ఆ దిశగా కూడా అదే మీడియాలో కొన్ని కథనాలైనా వచ్చేలా చేయాల్సిన వ్యవస్థ జగన్ కు మద్దతుగా లేకుండా పోయింది.
పథకాలపై వేలెత్తి చూపలేరు
నిజానికి జగన్ రాజకీయ ప్రత్యర్థుల పరిస్థితి ఇరకాటంలోనే ఉంది. ఆయనను పూర్తిగా విఫలపాలకుడిగా చిత్రిస్తే ప్రజలు ఛీకొడతారనే భయం వారిలో ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ప్రభుత్వంలో చిన్న లోపం దొరికినా దాన్ని భూతద్దంలో చూపించి.. ఆయన చేపడుతున్న సంక్షేమ పథకాలన్నీ మసకబారిపోయేలా చేస్తున్నారు. పథకాలపై వేలెత్తి చూపడానికి వారికి ఆస్కారం దొరకడం లేదు. జగన్ ఇంకాస్త క్రియాశీలంగా వ్యవహరిస్తే అన్ని రకాలుగానూ ప్రత్యర్థుల నోర్లు మూయించడం కుదురుతుంది.
ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అందుబాటులో ఉండరనే విమర్శ కూడా అమరావతి వర్గాల్లో వినిపిస్తుంటుంది. శనివారం సాయంత్రం ‘వర్కింగ్ అవర్స్’ ముగిశాక మళ్లీ సోమవారం ఉదయం దాకా జగన్ ను కలుసుకోవడం దుర్లభం అనే మాట ప్రజాప్రతినిధుల్లోనే వినిపిస్తుంటుంది. నాయకుడు అయినందుకు వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా బలిపెట్టాలని ఎవ్వరూ కోరుకోరు. కానీ.. అందులోనూ కొన్ని పట్టు విడుపులు ఉండాలని మాత్రం ఆశిస్తారు! రాష్ట్రంలోని పిల్లలందరికీ తాను మేనమామనని ప్రకటించుకున్న జగన్.. రాష్ట్రమంతా తన కుటుంబమే అనుకుంటే.. ఇలాంటి విమర్శలు మళ్లీ వినిపించవు.