‘అఖిలమ్మా మీ నాయనపై నమ్మకంతో ఆ రోజు సంతకాలు చేశాం. పైసా కూడా మేము తీసుకోలేదు తల్లి. ఇప్పుడు మా అకౌంట్లను సీజ్ చేశారు. మాకు ప్రభుత్వం వచ్చే లబ్ధి కూడా చేతికి రావడం లేదు. అభిమానంతో మీ నెత్తిన పాలు పోస్తే, మీరు మాత్రం మా నెత్తిన బ్యాంకు నోటీసులను పెడతారా అమ్మా’ అని ఆ రైతులు అత్యంత దయనీయంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయినా అఖిలప్రియ మనసు కరగడం లేదని రైతులు వాపోతున్నారు. ఏం చేయాలో ఆ రైతులకు దిక్కుతోచడం లేదు. సుమారు 350-400 మంది రైతుల గోడు అరణ్య రోదనైంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అసలేం జరుగుతోందంటే…
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ‘భూమా’ కుటుంబానికి ఎదురు లేని సామ్రాజ్యం. గెలుపోటములు ఎలా ఉన్నా భూమా నాగిరెడ్డి బతికి ఉన్నంత వరకు ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనంలా ఉండేది. భూమా నాగిరెడ్డి కుటుంబానికి జగత్ డెయిరీ ఉంది. భూమా నాగిరెడ్డి కుమారుడే జగత్. ఈ నేపథ్యంలో ఐదేళ్ల క్రితం ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సుమారు 350 నుంచి 400 మంది రైతుల పేర్లతో నంద్యాల ఆంధ్రా బ్యాంకులో గేదెల కొనుగోలుకు జగత్ డెయిరీ తరపున లోన్లు తీసుకున్నారు. పేరుకు రైతులే తప్ప సొమ్మంతా జగత్ డెయిరీ అకౌంట్‌లో సుమారు రూ.9 కోట్లు జమ అయ్యింది.
భూమా నాగిరెడ్డి బతికి ఉన్నంత వరకు నెలనెలా బ్యాంక్‌కు రుణం చెల్లించేవారు. ఆయన మరణానంతరం రైతులకు భూమా కుమార్తె , మాజీ మంత్రి అఖిలప్రియ చుక్కలు చూపుతున్నారు. ఇప్పుడు సుమారు రూ.4.50 కోట్లు ఆంధ్రా బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంది. రైతులకు రుణాలు ఇప్పించేటప్పుడు భూమా నాగిరెడ్డికి సంబంధించిన ఎందుకూ పనికి రాని బీడు భూములను ష్యూరిటీ పెట్టారు. ఒకవేళ బ్యాంకర్లు ఆ భూములను వేలం వేసినా కొనడానికి ఎవరూ ముందుకు రారు. ఒకటి భూమా కుటుంబానికి చెందిన భూములను కొనడానికి ఎవరూ సాహసించలేరు, రెండోది ఆ భూములు ఏ విధంగానూ సాగుకు ఇతరత్రా పనికి రావంటున్నారు.
రైతుల అకౌంట్లను NPA (non-performing asset) కింద బ్యాంకర్లు వేశారు. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. తమకు ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరించిన ఒకట్రెండు గ్రామస్తుల రైతుల రుణాలను మాత్రం భూమా అఖిలప్రియ చెల్లించారంటున్నారు. మిగిలిన వారి గోడు వినేందుకు కూడా ఆమె ఇష్టపడటం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ అఖిలప్రియ వద్దకు వెళ్లడం, రుణాన్ని చెల్లించి తమను ఇబ్బందుల నుంచి బయట పడేయాలని వేడుకోవడం మినహా మరేం చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ రైతులున్నారు.
నిజానికి ఈ భారీ స్కాంలో బ్యాంకర్ల ప్రమేయం కూడా ఉంది. గేదెలను కొనుగోలు చేసిన తర్వాత, వాటిని చూశాకే బ్యాంకర్లు రుణం ఇస్తుంటారు. కానీ నంద్యాల ఆంధ్రా బ్యాంక్ అధికారులు అలాంటి నిబంధనలేవీ పాటించలేదు. రైతులు ఎలాంటి గేదెలు కొనుగోలు చేయకుండానే జగత్ డెయిరీ అకౌంట్‌కు రైతులకు మంజూరు చేసిన రూ.9 కోట్ల రుణాన్ని ట్రాన్స్‌ఫర్ చేశారని సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంక్ అధికారులకు 3 శాతం వాటా అందినట్టు సమాచారం. నిబంధనలు పేదలకు, పలుకుబడి లేనివారికే అని నంద్యాల ఆంధ్రా బ్యాంక్ అధికారులు మరోమారు రుజువు చేశారు.
విద్యార్థికి గేదెల కొనుగోలుకు రుణం
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఒక విద్యార్థికి కూడా రూ.1,73,669 సొమ్మును ఆంధ్రా బ్యాంక్ మంజూరు చేసింది. ఈ రుణానికి సంబంధించి కంతులు చెల్లించకపోవడంతో ఆంధ్రా బ్యాంక్ నోటీసులు పంపింది. ఇలా 350 నుంచి 400 మంది రైతులకు నోటీసులు అందాయి.
సొంత రైతులకు న్యాయం చేయలేని అఖిల…
‘పిచ్చోడి చేతిలో రాయి అనే చందంగా సీఎం జగన్ చేతిలో అధికారం అలా తయారైంది. రాజధాని మార్పు ప్రకటనతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి. రాజధాని రైతుల ఆందోళన చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది. రాజధాని రైతులకు మద్దతుగా రాయలసీమ నుంచి రైతులను తీసుకెళ్తా’ అని ఇటీవల మాజీ మంత్రి అఖిలప్రియ పదేపదే చెబుతున్నారు. ఆమె మాటలు వింటున్న సొంత నియోజకవర్గ రైతులు అమ్మా ముందు మీ కోసం గుడ్డిగా సంతకాలు చేసిన తమ గోడు పట్టించుకోవాలని వేడుకుంటున్నారు.
ఆళ్లగడ్డలో ఎక్కడ చూసినా ఇదే చర్చ
ప్రస్తుతం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పల్లెల్లో ఏ రచ్చ బండ దగ్గర చూసినా ఇదే చర్చ సాగుతోంది. భూమా నాగిరెడ్డి జీవించి ఉంటే రైతులకు ఇలా చేసేవారు కాదని, ఆయన మరణించడం వల్లే తమకు ఇబ్బందులు వచ్చాయని రైతులు వాపోతున్నారు. భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ రుణాలు చెల్లించకుండా ఉంటారని అసలు ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని రైతుల కన్నీళ్లు చూడలేని అఖిలప్రియ…తమ కన్నీళ్లకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. అమ్మా అఖిలా…ఇదేం న్యాయం తల్లి