పీఆర్సీ గొడ‌వ‌లో అస‌లాయ‌న‌ ఎస్కేప్‌!

పీఆర్సీ వ్య‌వ‌హారం రోజురోజుకూ ప్ర‌భుత్వానికి, ఉద్యోగుల‌కు మ‌ధ్య గ్యాప్ పెంచుతోంది. ఈ మొత్తం గొడ‌వ‌లో అస‌లాయ‌న ఎస్కేప్ కావ‌డం కీల‌క ప‌రిణామంగా చెప్పుకోవ‌చ్చు. కానీ పీఆర్సీతో ఏ మాత్రం సంబంధం లేని మంత్రులు, ఎమ్మెల్యేలు…

పీఆర్సీ వ్య‌వ‌హారం రోజురోజుకూ ప్ర‌భుత్వానికి, ఉద్యోగుల‌కు మ‌ధ్య గ్యాప్ పెంచుతోంది. ఈ మొత్తం గొడ‌వ‌లో అస‌లాయ‌న ఎస్కేప్ కావ‌డం కీల‌క ప‌రిణామంగా చెప్పుకోవ‌చ్చు. కానీ పీఆర్సీతో ఏ మాత్రం సంబంధం లేని మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందుకొచ్చి రెచ్చ‌గొట్టే ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం… ఉద్యోగుల పుండుమీద కారం చ‌ల్లిన చంద‌మ‌వుతోంది. పీఆర్సీ అనేది పూర్తిగా ఆర్థిక ప‌ర‌మైన అంశం. అంటే ఆర్థిక‌శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద‌ర్‌రెడ్డికి సంబంధించిన శాఖ‌. ఇంత వివాదం జ‌రుగుతున్నా ఆయ‌న ఎక్క‌డున్నారో, ఏం చేస్తున్నారో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అసలీ స‌మ‌స్య‌పై ఆయ‌న మ‌న‌సులో మాట ఏంటో ఎవ‌రికీ తెలియ‌డం లేదు.

పీఆర్సీకి సంబంధించి వాస్త‌వాలేంటో ప్ర‌జ‌ల‌కు, ఉద్యోగుల‌కు వివ‌రించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల్సిన బుగ్గ‌న రాజేంద‌ర్‌రెడ్డి, ఆ ప‌ని చేయ‌కుండా ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి. పీఆర్సీతో పాటు హెచ్ఆర్ఏ, ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌ల‌పై ఒక‌వైపు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వెళ్ల‌గ‌క్క‌డంతో పాటు ఉద్య‌మ బాట ప‌డుతుంటే… ఇదే స‌మ‌యంలో మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, పేర్ని నాని, అప్ప‌ల‌రాజు, ఆదిమూల‌పు సురేష్‌, ప్ర‌భుత్వ చీఫ్‌విప్ గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి త‌దితరులు అన‌వ‌స‌రంగా జోక్యం చేసుకుని, స‌మ‌స్య‌ను జ‌ఠిలం చేశార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఉద్యోగులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే క్షమించేది లేదని, మంచి వాతావరణాన్ని పాడు చేసుకోవద్దని కోరుతున్నానని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చ‌రించారు. ఉద్యోగుల మాటలు బాధ క‌లిగిస్తున్నాయ‌ని, సంయమనం లేకుండా మాట్లాడుతున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. ఉద్యోగులకు కావాల్సింది ఘర్షణా? లేక సమస్య పరిష్కారమా? అని ప్రశ్నించారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని గ్రహించాలని, ఇలా మాట్లాడి పర్యవసానాలు చూడాల్సిన పరిస్థితి వద్దని బొత్స ఘాటుగా హెచ్చరించ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యమంత్రి తపన పడుతున్నారని, ఆర్థిక పరిస్థితి వల్ల చేయలేకపోతున్నారని సంఘాల నేతలే చెప్పారని మంత్రి బొత్స‌ పేర్కొన్నారు.  

మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఉద్యోగుల‌ను యూనియన్ నేత‌లు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని విమ‌ర్శించారు. గతంలో ఎన్నడూ 27 శాతం ఐఆర్‌ ఇవ్వలేదని, ఐఆర్‌ను జీతంలో భాగంగా ఎలా భావిస్తారని ప్రశ్నించారు. హెచ్‌ఆర్‌ఏ అనేది జీతభత్యాల్లో భాగం కాదా అని అన్నారు. పీఆర్సీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కొత్త పీఆర్సీతో జీతాల్లో కోత పడుతుందనేది అవాస్తవమన్నారు. మొత్తానికి జీతాలు పెరిగాయా లేదా అనేది చూడాలన్నారు.

మ‌రో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ పీఆర్సీకి అంగీకరించి, ఇప్పుడు ఆందోళనలు చేస్తామనడం ఉద్యోగులకు సరికాదని హితవు ప‌లికారు. ఉపాధ్యాయ, ఉద్యోగులు ఆందోళనలు చేయడమేంటని ప్రశ్నించారు. ఉద్యోగులు రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకోవాల‌ని ప్ర‌భుత్వ చీఫ్‌విప్ గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి కోరారు. నూత‌న పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు పెరుగుతాయన్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలన్న కొంతమంది ట్రాప్‌లో పడొద్దని ఆయ‌న‌ హెచ్చరించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ ఆర్థిక స‌మ‌స్య‌ల గురించి సంబంధిత శాఖ మంత్రి బుగ్గ‌న చెబితే స‌బ‌బుగా ఉంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఈ లోటు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఏ స‌మ‌స్య‌పైనైనా ఎవ‌రైనా మాట్లాడొచ్చ‌నే విధానాన్ని చూస్తున్నాం. ఇక ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అయితే స‌క‌ల‌శాఖ‌ల మంత్రిగా ప్ర‌తిప‌క్షాలు ఓ శాఖ‌నే ఇచ్చేశాయి. 

ఒక‌వైపు ఉద్యోగులు ఉద్య‌మాన్ని తీవ్ర‌త‌రం చేయాల‌ని ముందడుగు వేస్తున్న త‌రుణంలో ఆర్థిక మంత్రి బుగ్గ‌న ఏం చెప్ప‌లేక త‌ప్పించుకు తిరుగుతున్నాడా? అనే అనుమానాలు, ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌న‌కెందుకొచ్చిన గొడ‌వ అన్న‌ట్టు బుగ్గ‌న వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లపాలు చేస్తోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో స‌మ‌న్వ‌య లోపం ఉంద‌నేందుకు బుగ్గ‌న ప‌లాయ‌నం చిత్త‌గించ‌డ‌మే నిద‌ర్శ‌న‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.