పవన్ కల్యాణ్ కనిపించడం లేదు, కనీసం ట్విట్టర్లో కూడా ఆయన జాడ లేదు, ఏదో ఆయన పేరుతో ప్రెస్ నోట్ లు విడుదలవుతున్నాయి కాబట్టి ఆయన ఉన్నారు అనుకుంటున్నాం కానీ, అసలు ప్రజల మధ్యే తిరుగుతా, ప్రజలతోనే ఉంటానని చెప్పుకునే ఆ జనసేనాని జాడేది అంటూ జనసేన కార్యకర్తలే వెతుక్కుంటున్నారు.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి మూడు రాజధానులపై ప్రకటన చేసిన వెంటనే ట్విట్టర్లో గొంతు చించుకున్న పవన్ కల్యాణ్ ఆవేశం చూస్తే.. అమరావతే రాజధాని అని ప్రకటన వచ్చేవరకు ఊరుకునేలా లేడని అనుకున్నారంతా. మందడం దగ్గర ముళ్లకంచె ముందు ఊగిపోయి మాట్లాడుతుంటే.. ఉద్యమాన్ని ముందుండి ఉధృతంగా నడిపిస్తారేమోనని అనుకున్నారంతా.
చివరకు ఈసారి కూడా పవన్ తుస్సుమన్నారు. తనది ఆరంభ శూరత్వమేనని ఎప్పట్లానే సక్సెస్ ఫుల్ గా రుజువు చేసుకున్నారు. సీజనల్ పొలిటీషియనే కానీ, సీరియస్ పొలిటీషియన్ ఎప్పటికీ కాలేనని తనకుతానుగా నిరూపించుకున్నారు జనసేనాని. రాజధాని గురించి మాట్లాడటం ఆపేశారు కాబట్టి.. మూడు రాజధానులతో జరిగే అధికార, అభివృద్ధి వికేంద్రీకరణకు పవన్ అనుకూలంగా ఉన్నారు అనుకుంటే పొరపాటే. ఈ మౌనం వెనక అలాంటి ఉద్దేశం ఆయనకు ఎంతమాత్రం లేదు.
ఎందుకంటే.. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ వ్యతిరేకించడం, చంద్రబాబుకి వంత పాడటం, బీజేపీ హిడెన్ అజెండాను అమలు చేయడం.. ఇవే పవన్ కి తెలిసినవి. మరో రెండు రోజుల తర్వాత, తనకి మళ్లీ ఉత్సాహం వచ్చినప్పుడు బరిలో దిగుతారు పవన్. రైతుల దగ్గరకు వెళ్లి, రోడ్డుపైనే కూర్చుని, జుట్టు సరిచేసుకుంటూ, ఆవేశంతో ఊగిపోతూ.. తనదైన సిగ్నేచర్ స్టెప్పులు రెండు వేసి చల్లగా జారుకుంటారు.
అమరావతిని సపోర్ట్ చేస్తే తాడోపేడో తేల్చుకునే వరకు రోజూ పోరాటం చేయాలి, లేదా మూడు రాజధానులకే తన ఓటు అంటే.. ఆ విషయమైనా స్పష్టంగా చెప్పాలి. ఈ రెండూ లేకుండా.. నాకిష్టం వచ్చినప్పుడు బైటకొస్తాను, నాకు ఆవేశం వచ్చినప్పుడే మాట్లాడతానంటే.. రాజకీయాల్లో కుదరదు. షూటింగ్ టైమ్ లో ప్రతి సీన్ కీ విరామం ఇచ్చినట్టు, సినిమా సినిమాకీ హీరోలు వెకేషన్ కి వెళ్లినట్టు.. ఉంటుంది పవన్ వ్యవహారం. అది సినిమా ఇండస్ట్రీలో సరిపోతుందేమో కానీ, రాజకీయాల్లో కుదరదు. అది తెలుసుకున్నరోజే పవన్ సీరియస్ పొలిటీషియన్, అప్పటి వరకూ ఆయన సీజనల్ పొలిటీషియనే.