సునీల్ మరోసారి కమెడియన్ గా రీఎంట్రీ ఇస్తున్నాడనగానే అంతా త్రివిక్రమ్ వైపు చూశారు. ఎందుకంటే… సునీల్-త్రివిక్రమ్ బెస్ట్ ఫ్రెండ్స్. స్నేహితుడి కోసం త్రివిక్రమ్ ఇక అదిరిపోయే కామెడీ ట్రాక్ రాస్తాడని, తన పెన్ పవరు చూపిస్తాడని ఏవోవో అనుకున్నారు ప్రేక్షకులు. నిజం చెప్పాలంటే సునీల్ కూడా అలానే అనుకున్నాడు. కానీ….
ఎన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా అనే వేదాంతం లేదా సిద్ధాంతాన్ని ఇక్కడ కచ్చితంగా చెప్పుకోవాలి. అవును.. సునీల్ జాతకాన్ని త్రివిక్రమ్ కూడా మార్చలేకపోతున్నాడు. అరవింద సమేతలో సునీల్ ను పెట్టాడు. కానీ అతడితో కామెడీ చేయించాలో లేక హీరోను ఎలివేట్ చేయించేలా మాట్లాడించాలో అర్థంకాక త్రివిక్రమే సతమతమైపోయాడు. ఆ సతమతం లోనే సినిమా అయిపోయింది. చూస్తుంటే ఈసారి అల వైకుంఠపురములో సినిమాలో కూడా సునీల్ పరిస్థితి మెరుగైనట్టు కనిపించలేదు.
బన్నీ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమా వస్తోంది. రాత్రి ఈ సినిమా ట్రయిలర్ విడుదలైంది. ఇందులో కూడా సునీల్ ఉన్నాడు. కానీ వెదుక్కోవాల్సిన పరిస్థితి. చివరికి సునీల్ పక్కనుండే హర్షవర్థన్ డైలాగ్ ఉంది కానీ సునీల్ కు డైలాగ్ లేదు. అరవింద సమేత టైపులో ఇది కాన్సెప్ట్ ఫిలిం కాదు కాబట్టి సునీల్ కామెడీ ట్రాక్ అదిరిపోతుందని ఆడియన్స్ భావించారు. ట్రయిలర్ లోనే మచ్చుకు 2 వదుల్తారని కూడా ఆశించారు. కానీ అలా జరగలేదు.
ట్రయిలర్ చూస్తుంటే… సునీల్ పాత్ర నలుగురిలో ఒకటిగా అలా వెళ్లిపోతుంది తప్ప, నలుగురిలో చెప్పుకునేలా లేదనే విషయం అర్థమౌతూనే ఉంది. కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చిన సునీల్, బ్రేక్ కోసం ఇంకొన్నాళ్లు ఆగాలేమో.