ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు ఖరారు కావడంతో.. దేశ రాజకీయంలో మరో రసవత్తర పోరుకు తెర లేచినట్టుగా అయ్యింది. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. 11 తేదీన కౌంటింగ్ జరబోతూ ఉంది. ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు రకరకాలు ప్రిపేర్ అయ్యాయి.
భారతీయ జనతా పార్టీ ఒక నినాదాన్ని ఎత్తుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆప్ తో పొత్తు లేదని.. తాము సొంతంగా పోటీ చేయబోతున్నట్టుగా ప్రకటించింది. ఇలా ముక్కోణపు పోరు జరగబోతూ ఉంది ఢిల్లీ లో.
ఐదేళ్ల కిందట ఢిల్లీ ప్రజలు సంచలన తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. 70 సీట్లకు గానూ..67 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకుంది. బీజేపీ మూడంటే మూడు సీట్లకు పరిమితం కాగా, కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరి సత్తా ఏమిటనేది ఆసక్తిదాయకంగా మారింది.
భారతీయ జనతా పార్టీ వాళ్లేమో తాము 67 కన్నా ఎక్కువ సీట్లను సాధిస్తామని అంటున్నారు. అప్పట్లో ఆప్ సాధించిన సీట్ల కన్నా ఇప్పుడు బీజేపీ ఎక్కువ సీట్లను పొందుతుందట! ఇక అప్పట్లో సంచలన విజయం సాధించిన ఆప్ కు కూడా ఇప్పుడు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.
ఇక రాష్ట్రాల వారీగా భారతీయ జనతా పార్టీకి వివిధ ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆ పార్టీ పాగా వేయగలదా? ఆప్ ను ఢీ కొట్టి బీజేపీ సత్తా చాటగలదా? అనే అంశాలు ఆసక్తిదాయకం. మొత్తానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మూడు పార్టీలకూ ప్రతిష్టాత్మకమే. ఈ పోరులో ఎవరి పరువు నిలబడుతుందో!