తాను ఢిల్లీ స్థాయి నాయకుడినని చంద్రబాబు పలు సందర్భాల్లో ప్రజలకు గుర్తు చేస్తుంటారు. రాష్ట్రం కోసం ప్రధాని పదవిని కూడా తృణప్రాయంగా విడిచిపెట్టానని గొప్పలు చెప్పుకుంటారు. అలాంటి ఢిల్లీ నాయకుడు కొన్నిరోజులుగా గల్లీ రాజకీయాలకు పరిమితమైపోయారు. కేవలం కొన్ని గ్రామాల ప్రజలను వెంటబెట్టుకుని ఉద్యమం అని చెప్పుకుంటూ కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నారు.
ఈ ఉద్యమం రాష్ట్ర స్థాయిలో జరుగుతోందని అనుకోవడం చంద్రబాబు భ్రమ. కనీసం ఆ 29 గ్రామాల ప్రజలైనా దీనిపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారా అంటే, అదీ అనుమానమే. మొత్తమ్మీద తాను ఎవరి కోసం, ఏ స్థాయి పోరాటం చేస్తున్నానో తెలియకుండానే చంద్రబాబు ఓ చక్రబంధంలో ఇరుక్కుపోయారు.
జిల్లాలు పట్టుకుని తిరుగుతున్న బాబుని, ఒకే ఒక్క ప్రకటనతో అమరావతిలో లాక్ చేశారు సీఎం జగన్. మూడు రాజధానుల ప్రకటనతో బాబు రాజధాని ప్రాంతానికి పరిమితమైపోయారు. ఒక రకంగా ఇది జగన్ వ్యూహాత్మక ఎత్తుగడే. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున రాజధానుల పై జగన్ ప్రకటన చేయడం, ఆ తర్వాత జీఎన్ రావు కమిటీ రిపోర్ట్, వెనువెంటనే బోస్టన్ కమిటీ నివేదిక, హైపవర్ కమిటీ అంటూ మరో అంకానికి తెరలేవడం.. ఎక్కడా గ్యాప్ లేకుండా అన్నీ జరిగిపోతున్నాయి. కనీసం ఆలోచించుకునే అవకాశం లేకుండా బాబుని ఇరుకున పెట్టేశారు జగన్.
జగన్ ఉచ్చులో చిక్కుకున్న చంద్రబాబు గ్రామస్థాయి రాజకీయాలకు పరిమితమైపోయారు. అమరావతి రైతుల బాధ, కేవలం ఆ ప్రాంతానికే పరిమితమైంది. ఓ వర్గం మీడియా హైలెట్ చేస్తుంది కానీ, మిగతా జిల్లాల ప్రజలు దీనిపై ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. మిగతా జిల్లాల టీడీపీ నేతలు కూడా తమకెలాంటి సంబంధం లేదన్నట్టు పట్టీ పట్టనట్టుగా ఉన్నారు. ఇలా చంద్రబాబుని అటు ప్రజలకీ, ఇటు పార్టీ నాయకులకీ కాకుండా దూరం చేశారు జగన్. అమరావతి చుట్టూ తిరిగేలా అష్టదిగ్బంధం చేశారు. కనీసం ఇలాంటి ఓ ట్రాప్ లో పడిపోయాననే ఆలోచన కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి రాలేదంటే.. జగన్ దెబ్బ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇన్ సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డ బడా నాయకులు, మీడియా అధినేతలు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్తలు తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారు. కేవలం రైతుల్ని, స్థానికుల్ని అడ్డం పెట్టుకుని ఓ బోగస్ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఇది కూడా ఎక్కువరోజులు సాగేలా కనిపించడంలేదు. వైసీపీ మంత్రులు రైతుల్ని చర్చలకు ఆహ్వానించడంతో వారిలో కొంత మార్పు వచ్చినట్టు తెలుస్తోంది.
నిజమైన రైతులు, తమకు ప్రభుత్వం భరోసా ఇస్తే ఈ గొడవని ఇక్కడితో ఆపేసేలా ఉన్నారు. వారికి జగన్ నుంచి హామీ లభిస్తే.. అమరావతి ఉద్యమం కాస్తా, చంద్రబాబు ఉద్యమంలా మారిపోతుంది. మొత్తమ్మీద ఢిల్లీ పేరు చెప్పుకునే చంద్రబాబుని ఓ పద్ధతి ప్రకారం గల్లీ స్థాయికి తీసుకొచ్చేశారు జగన్.