అవును ఎవరు వీరంతా. నిజమే ఇలా ప్రశ్నిస్తే గబుక్కున జవాబు చెప్పడం కష్టమే. కానీ వారు పరాయి పాలకులు, విదేశీయులు అని పేర్లను బట్టి ఇట్టే చెప్పవచ్చు. వారితో ఇక ఇపుడు మనకు పనేంటి, వారి పేర్లు మన సంస్థలకు ఎందుకు పెట్టాల్సి వస్తుంది అని అడిగితే మాత్రం కాస్తా ఆలోచించి జవాబు చెప్పాలేమో.
ఈ దేశాన్ని బ్రిటిష్ వారు చెరబట్టిన సంగతి అందరికీ తెలిసిందే. వందల ఏళ్ళు పాలించారు. చెడూ చేశారు, కొన్ని చోట్ల మంచి కూడా చేశారు. అలా కనుక చూసుకుంటే విశాఖకు బ్రిటిష్ పాలకులు ప్రగతి దారులు చూపి గట్టి మేలే చేశారు.రాతి కట్టడాలో వందేళ్ల క్రితం కట్టిన కలెక్టరేట్ ఈ రోజుకీ దిట్టంగా ఉందంటే అది నాటి పాలకుల వల్లనే అని చెప్పాలి కదా.
అలాగే ఏకంగా ఉత్తరాంధ్రాకే కాదు, ఒడిషా చత్తీస్ గడ్ వంటి రాష్ట్రాలకు కూడా అతి పెద్ద ఆసుపత్రిగా విశాఖ కేజీహెచ్ ఉంది. దీనికి కింగ్ జార్జి ఆసుపత్రి అని పేరు. ఇప్పటికి వందేళ్ళ క్రితం ఎక్కడా ఎలాంటి వైద్య సదుపాయాలు లేని నాడు కేజీహెచ్ ని ఏర్పాటు చేసి జనాల ప్రాణాలను కాపాడారు. మరి దాని పేరు మార్చాలన్నది బీజేపీ పెద్ద సోము వీర్రాజు డిమాండ్.
కింగ్ ఎవరు జార్జి ఎవరు అని ఆయన అడుగుతున్నారు. కానీ ఇంత కంటే పెద్ద ఆసుపత్రులు మన ఏలికలు కట్టించలేకపోయారన్నది ఒక చేదు నిజం. ఇక వందేళ్ల క్రితం కట్టినా ఈనాటికీ చెక్కుచెదరని నిర్మాణపు విలువలు కూడా నాటి వారి కృషిని ఆలోచించేలా చేస్తున్నాయి కదా.
నిజమే ఈ ఆసుపత్రికి విశాఖ దిగ్గజం, త్యాగమూర్తి తెన్నేటి విశ్వనాధం పేరు పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఇంతకు మించి అభివృద్ధి చేసి మరో ప్రాజెక్టుకు ఆ మహనీయుల పేరు పెట్టుకోవచ్చు కదా అన్న సూచనలూ ఉన్నాయి. ఇక పేద మహిళలకు పురుళ్ళ ఆసుపత్రిగా పేరు గాంచిన విక్టోరియా ఆసుపత్రి కూడా విశాఖలోనే ఉంది. దాని పేరు కూడా మార్చాలని ఇప్పటికైతే ఎవరూ అడగలేదు.రేపు అడగవచ్చేమో. అలాగే విశాఖకు పోర్టు, రైల్వేస్ సహా ఎంతో అభివృద్ధి స్వాతంత్రానికి పూర్వమే జరిగింది. వాటి గురుతులూ ఉన్నాయి. వాటిని చెరిపేయాలని కూడా మరో నాడు అడగవచ్చేమో.
అయితే స్వాతంత్రం వచ్చి ఇప్పటికి ఏడున్నర పదుల కాలం అయింది. ఇపుడు ఉన్న వాటి కంటే పెద్ద ప్రాజెక్టులు విశాఖ లాంటి నగరాలకు తెచ్చి మన వారి పేర్లు పెడితే ఎవరికీ ఇబ్బంది లేదు, అదే సమయంలో మంచి పనులు చేసిన వారి పేర్లను వద్దు అనడం కూడా భావ్యం కాదు అన్నది మేధావుల భావన. జనాలకు అలవాటు అయిపోయిన పేర్లు అవి. అయినా అభివృద్ధి ఎవరు చేసినా జనాలు వారిని గుండెల్లో పెట్టుకుంటారు, రాతి గోడల మీద పేర్ల కంటే అవి గొప్పవి కదా. ఆ దిశగా సోము వీర్రాజు లాంటి వారు ఆలోచన చేస్తే మంచిదేమో అన్నది చదువరుల, వివేచనాపరుల సూచనా. సలహా కూడా.