శకునం చెప్పరా.. అంటే వెనుకటికి అదేదో అన్నాడట ఒకడు. అలా ఉంది డబ్ల్యూహెచ్వో తీరు. ముందస్తుగా ప్రజలను అలర్ట్ చేయాల్సిన సమయంలో చేయకుండా, ఇప్పుడు మాత్రం నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్. కరోనా వైరస్ విషయంలో డబ్ల్యూహెచ్ వో చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావు. దాని బాధ్యతలను విస్మరించి, చైనాను వెనకేసుకు రావడమే పనిగా పెట్టుకున్నట్టుగా పనిచేసింది ఈ సంస్థ. దాని వల్ల జరగాల్సిన నష్టం జరిగింది.
అంతే కాదు.. చైనాలో ఏం జరుగుతోందో, కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తోందో కనీస పరిశీలన కూడా చేసిన పాపన పోలేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ. కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాపించదు అనే మైండ్ లెస్ మాటలను కూడా మొదట్లో చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అప్పుడేమో అన్నీ తప్పుడు అంచనాలు, తప్పుడు వ్యవహారాలతో .. ప్రపంచానికి ముప్పును తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించింది డబ్ల్యూహెచ్వో.
తీరా ఇప్పుడు చూస్తే.. ఇక భూమ్మీద మానవుడే మిగలడు అన్నట్టుగా స్పందిస్తూ ఉంది ఆ సంస్థ. ప్రత్యేకించి డబ్ల్యూహెచ్వో చీఫ్ మీడియా ముందుకు వచ్చి చెబుతున్న మాటలు వింటే .. జనాలు బండబూతులు తిట్టుకోవాల్సిందే. కొన్ని దేశాలు కరోనా నివారణకు సరిగా పని చేయడం లేదని, రాంగ్ రూట్లో వెళ్తున్నాయంటూ తనకు తోచినట్టుగా చెబుతున్నాడు. అలాగే కోవిడ్ 19 కు ఇప్పుడప్పుడే వ్యాక్సిన్ వచ్చే సమస్యే లేదంటూ.. వీళ్లు నెగిటివ్ మాటలనే మాట్లాడుతూ ఉన్నారు.
మరి డబ్ల్యూహెచ్ వో అంచనాలు నిజమే అనుకుందాం. అలాంటప్పుడు ఇదే వైరస్ గురించి ఈ వైద్య మేధావులు మొదట్లో చెప్పిన మాటలేంటి? అసలు కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాపించదని మొదట్లో ఈ సంస్థ ట్వీట్ చేసి పెట్టింది. అలాంటి తప్పుడు అంచనాలు వేసిన సంస్థ ఇప్పుడు వేస్తున్న అంచనాలను నమ్మేదెలా? నమ్మేదెవరు? అంత వరకూ డబ్లూహెచ్వో అంటే దాని మీద ఉండిన అంచనాలను, అభిప్రాయాలను స్వయంగా ఆ సంస్థలో పని చేస్తున్న వాళ్లే నేలకు దించారు. ఇలాంటి నేపథ్యంలో.. కరోనా గురించి ఇప్పుడు డబ్ల్యూహెచ్వో ఏం చెప్పినా చాలా మంది నమ్మడం లేదు. అది కూడా కేవలం నెగిటివ్ మాటలు, భయభ్రాంతులకు గురి చేయడమే తప్ప.. ఇప్పటి వరకూ కరోనా వైరస్ విషయంలో డబ్ల్యూహెచ్వో ప్రపంచాన్ని ఉద్ధరించింది కూడా ఏమీ లేదు!