టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రుణం తీరిపోయినట్టుగా ఉంది. ఉత్తమ్ ను తప్పించాలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొందరు చాన్నాళ్లుగా గగ్గోలు పెడుతూ ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచినే ఆ డిమాండ్ ఉంది. అయితే అధిష్టానం ఆ డిమాండ్ ను సీరియస్ గా తీసుకోలేదు.
అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శనతో ఉత్తమ్ కు తీవ్రమైన ఇబ్బంది తప్పలేదు. తను మొన్నటి వరకూ ప్రాతినిధ్యం వహించిని నియోజకవర్గంతో తన భార్యను పోటీచేయించి ఆయన గెలిపించుకోలేకపోయారు. ఈ పరిణామాల్లో పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగడానికి ఉత్తమ్ కూడా మొహమాట పడుతున్నట్టుగా ఉన్నారు.
ఇప్పటికే రాజీనామా విషయాన్ని అధిష్టానానికి ఆయన తెలియజేసినట్టుగా సమాచారం. అది ఆమోదం కూడా పొందినట్టే అని, తదుపరి ఆ పదవికి ఎవరో ఒకరిని ఎంపిక చేశాకా అధికారిక ప్రకటనలు రాబోతున్నాయని సమాచారం.
ఇక జానారెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఈ ముగ్గురూ జాబితాలో వినిపిస్తున్న పేర్లు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు దూరంకావడం వెంకట్ రెడ్డికి ఇబ్బందికరంగా మారుతూ ఉంది. అన్నదమ్ములిద్దరూ ఒకే పార్టీ వైపే ఉండి ఉంటే.. ఈ సమయంలో రాజగోపాల్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కేదేమో! ఇక రేవంత్ రెడ్డి దూకుడైన నేతే కానీ, అందరికీ ఆమోదయోగ్యుడేనా? అనేది సందేహమే.
ఇక జానారెడ్డికి ఆ పదవి దక్కొచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే జానాకు ఆ పదవి దక్కినా ఒకటే, దక్కకపోయినా ఒకటే. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే.. అనే భావనలూ వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యాల్లో టీపీసీసీకి కొత్త ప్రెసిడెంట్ ఎంపిక గురించి సోనియా, రాహుల్ లు కసరత్తు చేస్తున్నారట!