రసకందాయంలో ఉన్న మహారాష్ట్ర రాజకీయంలో చివరికి శివసేన మెత్తబడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సగంకాలం అధికారం అడగడం మాత్రమేకాదు.. అది కూడా మొదటి రెండున్నరేళ్లు తమ పార్టీ సీఎం పదవిలో ఉండాలంటూ పట్టుపట్టిన… శివసేన, ‘సగంకాలం సీఎం’ డిమాండును పూర్తిగా పక్కన పెట్టేసి, మంత్రి పదవులతో సర్దుకుపోవాల్సి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిణామాలకు కారణాలుగా.. ఎవరెలా భావించినప్పటికీ.. శివసేనకు వేరే గతిలేకపోవడం వల్లనే మెట్టు దిగి వస్తున్నదని అర్థమవుతోంది.
శివసేనను రెచ్చగొడితే తమ పబ్బం గడుపుకోవచ్చునని కాంగ్రెస్ శతథా ప్రయత్నించింది. ఆ పార్టీ సాధించింది అత్యల్పంగా 44 సీట్లే అయినప్పటికీ.. శివసేనను కమలకూటమిలోంచి చీలిస్తే తాము కూడా అధికారం పంచుకోవచ్చునని వారు ఆశపడ్డారు. శివసేన కూడా తొలుత కాస్త ఆ ఎరకు లొంగింది. కానీ నిజానికి వారికి అలాంటి అనౌచిత పొత్తు వలన జరిగే లాభం చాలా తక్కువ. భాజపాతో వారు 20 మంత్రి పదవులకోసం బేరమాడుతున్నారు. అటునుంచి 13 మంత్రి బెర్తులకు హామీ ఉంది. మధ్యలో ఎక్కడో ఒకచోట బేరం తెగుతుంది.
అయితే అదే సమయంలో వారు విపక్ష కూటమితో అధికారం పంచుకోవాల్సి వస్తే గనుక.. ఖచ్చితంగా ఆ మాత్రం మంత్రి పదవులు కూడా రావు. పైగా.. సీఎం కుర్చీని ముగ్గురూ పంచుకోవాలని భావిస్తే ఇంకా చికాకు. వీరు సాధించిన 56 సీట్లకు ఇంచుమించు సమానంగా ఎన్సీపీ కూడా 54 గెలిచింది. మరి పంపకాల్లో వారి మాట ఏకపక్షంగా నెగ్గదు. ఇన్ని అవాంతరాలుండగా.. కమలంతో మైత్రి వ్రతం చెడుతుంది. వ్రతం చెడినా ఫలం కూడా దక్కే అవకాశం కొంతే ఉంది.
అయితే అలాంటి కొత్త బంధం వలన భవిష్య పరిణామాలు ఎలా ఉంటాయోననే భయం వెన్నాడుతుంటుంది. భాజపాతోడు లేకుండా.. భవిష్యత్తులో ఇన్ని సీట్లు గెలుచుకోవడంపై వారికి నమ్మకం లేకపోవచ్చు. ఇన్ని రకాల సమీకరణాలను పరిశీలించినప్పుడు.. వేరే గతిలేకపోవడం వల్లనే.. శివసేన… సీఎం కుర్చీ విషయంలో పట్టుపట్టకుండా.. భాజపాతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒప్పుకుంటున్నదని తెలుస్తోంది.