కొందరికి రాజకీయాలంటే చాలా ఆషామాషీ వ్యవహారంగా ఉంటుంది. రాజకీయాల్లో చేరితే ప్రజలు బ్రహ్మరథం పడతారని, నెత్తిన పెట్టుకుంటారని, ఉన్నత పదవులు సాధించవచ్చని అనుకుంటారు. ఇలా అనుకునేవారు వారు పనిచేస్తున్న రంగాల్లో గొప్ప పేరు తెచ్చుకున్నవారు, ప్రజల్లో ఇమేజ్ సాధించినవారు. ఇలాంటి వారిలో కొందరు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పేరు సంపాదించినవారు ఉంటారు. కానీ వీరికి ఇది చాలదు.
రాజకీయాల్లో చేరితే ఇంకా పేరు తెచ్చుకోవచ్చని, ఇంకా గొప్పగా రాణించవచ్చని భ్రమ పడతారు. దశాబ్దాలుగా రాజకీయ వాసనలు లేకుండా గడిపినవారు ఒక్కసారిగా ఆ సముద్రంలోకి దూకేసారికి ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతారు. చివరకు చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా అవుతారు. అయితే అందరూ ఇలా అవుతారని కాదు, అవ్వాలని రూలేం లేదు. ఇతర రంగాల్లోని వారు రాజకీయాల్లోకి వచ్చి రాణించాలంటే వారు వచ్చే సమయం సందర్భం అందుకు అనుగుణంగా ఉండాలి.
ఆ పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలచుకునే నేర్పు ఉండాలి. అన్నింటికీ మించి అదృష్టం కలిసిరావాలి. ఇతర రంగాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాణించినవారూ ఉన్నారు. విఫలమై సన్యాసం తీసుకున్నవారూ ఉన్నారు. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. సరే… ఇప్పుడు అసలు సంగతి ఏమిటంటే మెట్రో మ్యాన్ గా పేరు తెచ్చుకున్న శ్రీధరన్ గుర్తుండే ఉంటారు. దేశంలోని ప్రధాన నగరాల్లో మెట్రో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో గొప్ప పేరు తెచ్చుకున్నారు.
ఢిల్లీ మెట్రోకు ఆద్యుడిగా దేశవ్యాప్తంగా మన్ననలు అందుకున్నారు. నాటి ఢిల్లీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు. ఈ ప్రాజెక్టును అనుకున్న షెడ్యూల్ కంటే ముందే పూర్తిచేసి అందరితో శభాష్ అనిపించుకున్నారు. దీంతో ఆయనకు ‘మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా’ అన్న పేరు కూడా వచ్చింది.
90 వదశకంలో రైల్వే సీనియర్ ఇంజినీర్‌గా పదవీవిరమణ చేసిన ఆయనకు క్లిష్టమైన కొంకణ్ రైల్వే నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. అసాధ్యమనుకున్న కొంకణ్ రైల్వే ప్రాజెక్టును అత్యంత చాకచక్యంగా పూర్తిచేసి, సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. దేశంలోనే తొలి మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు 1995లో ప్రారంభం కావడంతో శ్రీధరన్‌కు వీటిని అప్పగించారు.
అయితే, 2005లోనే ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉన్నా మళ్లీ పొడిగించారు. మెట్రో రెండో దశ పూర్తి బాధ్యతలు అప్పగించడంతో 2011లో పదవీ విరమణ చేశారు. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అంటారు కదా అలా ఈ మెట్రో మ్యాన్ కు రాజకీయాల్లోకి రావాలనే బుద్ధి పుట్టింది. దీన్నెవరూ తప్పుపట్టారు. కానీ రాజకీయాల్లోకి రావడం రావడమే ముఖ్యమంత్రి అయిపోదామని అనుకున్నారు. ఈయన కేరళీయుడు.
దీంతో ఈ ఏడాది జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేశారు. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానన్నారు. అప్పటికే ఆయనకు 88 ఏళ్ళు. ‘నేను పదవీ విరమణ తర్వాత గత పదేళ్లుగా కేరళలోనే నివసిస్తున్నాను.. వివిధ ప్రభుత్వాలను చూశాను.. ప్రజలకు అవసరమైన వారు చేయలేకపోయారు.. నేను బీజేపీలో చేరి నా అనుభవాన్ని ఉపయోగించుకుంటాను’ అని స్పష్టం చేశారు. ఇతర పార్టీలను గుడ్డి ప్రతిపక్షాలని ఆరోపించిన ఆయన.. దేశాన్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.
‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన రాజకీయ పార్టీలు జాతీయంగా చాలా చెడును చిత్రీకరిస్తున్నాయి.. ఏదో వ్యతిరేకించాలని వ్యతిరేకిస్తున్నాయి.. కాంగ్రెస్ వంటి పార్టీలు భారతదేశానికి చెడ్డ ఇమేజ్ సృష్టిస్తున్నాయి’ అని దుయ్యబట్టారు. కానీ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. శ్రీధరన్ కూడా ఓడిపోయారు. దీంతో మెట్రోమ్యాన్ శ్రీధరన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో ఏ మాత్రం అనుభవం లేని ఆయనపై బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఎన్నికల్లో భారీ షాక్ తప్పలేదు.
ఇప్పుడేమో ఇకపై క్రియాశీల రాజకీయాలపై ఆసక్తి లేదని శ్రీధరన్ పేర్కొని బీజేపీకి షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాలక్కాడ్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన ఆయన తాను రాజకీయాల్లో ఉండే సమయం గడిచిపోయిందని అన్నారు. తాను రాజకీయాలను వదులుకోలేదని కానీ ఇకపై వాటి చుట్టూ తిరగడంపై ఆసక్తి పోయిందని పేర్కొన్నారు.
తానెప్పుడూ రాజకీయ నాయకుడిని కాదని బ్యూరోక్రాట్‌గా రాజకీయాల్లోకి వచ్చానని వాటికి అతీతంగా మూడు ట్రస్టుల ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు. గత ఎన్నికల్లో ఓడినప్పుడు నిరాశ చెందానని కానీ ఇప్పుడు ఫీలింగ్ లేదని చెప్పారు. ఎందుకంటే ఒక్కడినే ఎమ్మెల్యేగా గెలిచినా ఏమీ చేయలేకపోయేవాణ్ని అని తెలిపారు