బీజేపీతో స్నేహం కోసం చంద్రబాబు ఎంతలా వెంపర్లాడుతున్నారో తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల సభలో మరోసారి ప్రత్యక్షంగా కనిపించింది. బీజేపీ తరఫున ఈ సభకు హాజరైన కన్నా లక్ష్మీనారాయణపై ఎక్కడలేని ప్రేమ కురిపించారు చంద్రబాబు. 'రారా..రారా.. నా పక్కన కూర్చో' అనే టైపులో దగ్గరుండి తన పక్కన కూర్చోబెట్టించుకున్నారు.
ఓవైపు సభ జరుగుతుంటే, మరోవైపు కన్నాతో ముచ్చట్లు పెట్టారు. తన మనసులో మాటల్ని ఆయన చెవిలో వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాబుకు బట్టర్ తో పెట్టిన విద్య
ఎవర్నయినా బుట్టలో వేసుకోవడం బాబుకు బట్టర్ తో పెట్టిన విద్య. ఆ పవన్ కల్యాణ్ కు ఏ మందు వేశారో కానీ, జనసేన పార్టీ పెట్టినప్పట్నుంచి ఇప్పటివరకు టీడీపీకీ మద్దతిస్తూనే ఉన్నారు పవన్ కల్యాణ్. ఇక రాష్ట్ర విభజన టైమ్ లో బీజేపీకి చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. మీటింగ్స్ లో నా పక్కన కూర్చో అంటే, వద్దు నా పక్కన కూర్చో అంటూ మోడీ-బాబు స్టేజ్ పై చేసిన షో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పటికీ ఆ వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి.
ఇప్పుడు మరోసారి ఆ సీన్ ను కన్నాతో రిపీట్ చేశారు చంద్రబాబు. సీపీఐ అగ్రనేత, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏకంగా ఓ ఎంపీ సభలో ఉన్నప్పటికీ.. కన్నాకు పెద్దపీట వేశారు బాబు. ఒకప్పుడు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా కన్నా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడా దోస్తీ ఇలా కనిపించింది.
పొత్తు కోసం కోటి ఎత్తులు
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీతో దోస్తీ కట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నారు చంద్రబాబు. బీజేపీ అండ లేకపోతే జగన్ కు ఎదురొడ్డి నిలబడ్డం అసాధ్యం అని గ్రహించారు. అందుకే కొన్నాళ్లుగా బీజేపీ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు అమరావతి రైతుల సభను కూడా తన స్వార్థం కోసం ఉపయోగించుకున్నారు. కన్నాను కాకా పట్టే పనిని దిగ్విజయంగా పూర్తిచేశారు. ఓవైపు సభావేదికపై కన్నాను ప్రసన్నం చేసుకుంటూనే, మరోవైపు తన ప్రసంగంలో మోదీని, బీజేపీని పొగిడేశారు బాబు.
నిజం చెప్పాలంటే చంద్రబాబు పొగడ్తల వర్షం కాస్త తగ్గిందనే చెప్పాలి. దానికి కారణం బీజేపీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సభకు రాకపోవడమే. వివిధ కారణాల వల్ల వాళ్లు ఈ సభకు రాలేదు. మద్దతు మాత్రం తెలిపారు. వాళ్లు కూడా వచ్చి ఉంటే, బాబు నటన ఆస్కార్ లెవెల్లో ఉండేది.