విశాఖ రాజధాని అని వైసీపీ సర్కార్ చెప్పిన దగ్గర నుంచి టీడీపీ అధినాయకత్వం నానా రకాలైన వ్యూహాలతో అక్కడ రైతులను రెచ్చగొట్టి లేని ఉద్యమాన్ని తెచ్చిందని వైసీపీ అంటోంది.
పాదయాత్ర నాలుగు జిల్లాలలో చేసి ఏపీ మొత్తం చేశామని చెబుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ అన్నారు. ఇంతకీ విశాఖ అంటే ఎందుకు ఇష్టం లేదు బాబూ ఆయన ప్రశ్నించారు. విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలు గత నాలుగు దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటలుగా నిలిచి పలు మార్లు అధికారంలోకి తెచ్చాయి. మరి అటువంటి ప్రాంతం మీద ఎందుకు ద్వేషం చంద్రబాబూ అని గట్టిగానే నిలదీశారు గుడివాడ.
విశాఖ ప్రగతిని కోర్టుల ద్వారా అడ్డుకోవాలని చూస్తున్నారని అయన ఫైర్ అయ్యారు. ఇక విశాఖ రాజధానిగా ఉంటుందని, అలాగే అమరావతి కి కూడా అన్యాయం జరగదని తమ ప్రభుత్వం చెబుతోందని ఆయన అన్నారు. అయినా సరే అక్కడ భూములకు రేట్లు పడిపోతాయన్న బాధతోనే చంద్రబాబు అమరావతి ఏకైక రాజధాని అంటూ రైతుల ముసుగులో ఉద్యమానికి తెర లేపారని ఆయన ఆరోపించారు.
ఆరు నూరు అయినా కూడా మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతామని, అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని గుడివాడ స్పష్టం చేశారు. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది గతంలో వైఎస్సార్ అయితే నేడు జగన్ మాత్రమే అని ఆయన అన్నారు.