ఫేస్ బుక్ పేరు మారింది..ఎందుకు?

మార్క్ జుకర్ బర్గ్ సీఈవోగా వ్యవహరిస్తున్న ఫేస్ బుక్ సంస్థ పేరు మార్చారు. ఇకపై దీన్ని మెటాగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ మేరకు జుకర్ బర్గ్ తన కంపెనీ కొత్త పేరు, లోగోను ప్రకటించారు.…

మార్క్ జుకర్ బర్గ్ సీఈవోగా వ్యవహరిస్తున్న ఫేస్ బుక్ సంస్థ పేరు మార్చారు. ఇకపై దీన్ని మెటాగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ మేరకు జుకర్ బర్గ్ తన కంపెనీ కొత్త పేరు, లోగోను ప్రకటించారు. నిజానికి దీని పూర్తి పేరు మెటావర్స్. సంక్షిప్తంగా మెటా అని నామకరణం చేశారు.

ఫేస్ బుక్ యాప్ పేరు మారలేదు. యాప్ లో అదే పేరుతో అది కొనసాగనుంది. కాకపోతే మాతృసంస్థ పేరును మెటాగా మార్చారు. అంటే.. ఇకపై మెటా కింద ఫేస్ బుక్, మెసెంజర్, ఇనస్టాగ్రామ్, వాట్సాప్ యాప్స్ ఉంటాయన్నమాట. అయితే ఉన్నఫలంగా ఇప్పటికిప్పుడు ఈ మార్పు ఎందుకు?

సీఈవో చెబుతున్న రీజన్ ఇది..

“భవిష్యత్తులో సంస్థ ఏం చేయబోతోందనే విషయాన్ని ఫేస్ బుక్ అనే పదంతో నిర్వచించలేం. మన విస్తరణకు ఆ పదం చాలా చిన్నదైపోయింది. కొత్త పేరు ఫేస్ బుక్ యాప్స్ అన్నింటినీ రిప్రజెంట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో సంస్థ భారీ ఎత్తున చేపట్టబోయే ఆగ్యుమెంట్, వర్చువల్ రియాలటీ ఉత్పత్తులకు ప్రతిబింబంగా మెటా నిలుస్తుంది. మనం ఎవరు, మనం భవిష్యత్తులో ఏం నిర్మించాలనుకుంటున్నాం అనేదిద మెటా మీనింగ్.”

ఇలా మెటా వెనక కథాకమామిషును బయటపెట్టాడు జుకర్ బర్గ్. లోగో మార్చడంతో పాటు తన భవిష్యత్ ప్రణాళికను ఆవిష్కరించాడు. యూరోప్ మార్కెట్ ను శాసించడంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ ఆధారిత సేవలకు చిరునామాగా మారాలనే లక్ష్యాన్ని మెటా నిర్దేశించుకుంది.

మార్పు వెనక మతలబు ఇదేనా?

సీఈవో జుకర్ బర్గ్ ఇలా ఎన్ని చెబుతున్నప్పటికీ మరోవైపు టెక్ నిపుణులు మాత్రం ఈ పేరు మార్పు వెనక వేరే కారణాలున్నాయని చెబుతున్నారు. ఈమధ్య కాలంలో తరచుగా వివాదాలు ఎదుర్కొంటోంది ఫేస్ బుక్. ఆ గొడవలు వాట్సాప్ కు కూడా విస్తరించాయి. ప్రైవసీ పాలసీపై దుమారం రేగింది. దీంతో ఆసియా దేశాల్లో ఫేస్ బుక్ పై ఓ రకమైన వ్యతిరేక భావన వ్యక్తం అయింది. 

అదే టైమ్ లో ఇండియా లాంటి దేశాల్లో టెలిగ్రామ్ వాడకం కూడా పెరిగింది. వీటన్నింటికీ ఒకేసారి చెక్ పెట్టాలంటే సంస్థ పేరు మార్చేయడమే ఉత్తమమని భావించాడు జుకర్ బర్గ్. అందుకే ఈ మార్పు చోటుచేసుకుందని చెబుతున్నారు సైబర్ నిపుణులు. ఇకపై కంపెనీ స్టాక్స్ అన్నీ కొత్త కంపెనీ మెటావర్స్ తోనే లిస్ట్ అవుతాయి.