డ్రగ్స్ కేసు నుంచి కొడుకు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ దొరికిన వెంటనే తన లీగల్ టీమ్ కు షారూక్ ఖాన్ పెద్ద పార్టీ ఇచ్చాడు. దానికి సంబంధించి విడుదలైన 2 ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే షారూక్ మాత్రం ఇప్పటికీ రియాక్ట్ అవ్వలేదు. ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. ఈ ఫొటోలు కూడా లాయర్ల టీమ్ నుంచి బయటకొచ్చాయి.
ఈ ఫొటోలో అడ్వకేట్లు సతీష్ మానషిండే, అమిత్ దేశాయ్ తో పాటు లాయర్ల టీమ్ మొత్తం కనిపిస్తోంది. అయితే హైకోర్టులో ఈ కేసును వాదించి, ఆర్యన్ కు బెయిల్ వచ్చేలా చేసిన ప్రముఖ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ మాత్రం ఈ ఫొటోలో లేరు. ఆయన మరో కేసులో బిజీగా ఉన్నారని లాయర్ల
టీమ్ ప్రకటించింది.
ఈనెల 2న ముంబయి క్రూయిజ్ షిప్ లో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన వెంటనే బెయిల్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు షారూక్ ఖాన్. ముందుగా సతీష్ మాన్ షిండే రంగంలోకి దిగారు. ఆ తర్వాత ఆయన తరపున అమిత్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఎప్పుడైతే బెయిల్ పిటిషన్ హైకోర్టుకు వెళ్లిందో, అప్పుడు ముకుల్ రోహత్గీ రంగంలోకి దిగారు.
ఆయన రావడంతోనే బెయిల్ వస్తుందనే నమ్మకం అందర్లో కలిగింది. అందుకు తగ్గట్టుగానే ముకుల్ వాదించారు. ఏ అధికారంతో ఎన్సీబీ అధికారులు ఇన్నాళ్లు ఆర్యన్ ను నిర్బంధంలోకి తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్సీబీ అధికారులు పోలీసులు కాదన్నారు.
క్రూయిజ్ షిప్ లో పట్టుబడిన రోజు నుంచి ఆర్యన్ ఖాన్ వద్ద డ్రగ్స్ లేవనే విషయాన్ని లాయర్లు గట్టిగా వాదిస్తూ వస్తున్నారు. ఆర్యన్ డ్రగ్స్ తీసుకోలేదని, ఆయన క్రూయిజ్ షిప్ లో పార్టీని నిర్వహించలేదని, కేవలం గెస్ట్ గా మాత్రమే వెళ్లారని వాదించారు. అలాంటప్పుడు ఆర్యన్ ను 3 వారాలకు పైగా రిమాండ్ లో ఉంచడం అర్థం లేదన్నారు.
ఇక వాట్సాప్ ఛాటింగ్స్ కు సంబంధించి ఎన్సీబీ వినిపించిన వాదనల్ని కూడా ముకుల్ గట్టిగా తిరస్కరించారు. ఆర్యన్ విదేశాల్లో ఉన్నప్పుడు చేసిన ఛాటింగ్స్ ను కూడా కోర్టుకు నివేదించడంలో అర్థం లేదన్నారు. మొత్తమ్మీద ముకుల్, అమిత్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, ఆర్యన్ కు బెయిల్ ఇచ్చింది.
ఆర్యన్ డ్రగ్స్ సేవించలేదని, డ్రగ్స్ కలిగిలేడని, డ్రగ్స్ పార్టీ నిర్వహించలేదని కోర్టు విశ్వసించింది. ఈ అంశాలకు వ్యతిరేకంగా ఎన్సీబీ విచారణ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి. అటు ఆర్యన్ కు బెయిల్ దొరకడంతో, అనన్యకు కూడా ఊరట కలిగినట్టయింది.