సోదాలు చేయండి.. మొబైల్స్ మాత్రం చూడకండి..!

హైదరాబాద్ పోలీసులు లిమిట్స్ క్రాస్ చేశారు. తెలంగాణలో గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామంటున్న పోలీసులు.. పౌరుల హక్కుల్ని అదే ఉక్కుపాదం కింద తొక్కేస్తున్నారు. ప్రతి బండినీ ఆపి చెక్ చేస్తున్నారు. అంతవరకు బాగానే…

హైదరాబాద్ పోలీసులు లిమిట్స్ క్రాస్ చేశారు. తెలంగాణలో గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామంటున్న పోలీసులు.. పౌరుల హక్కుల్ని అదే ఉక్కుపాదం కింద తొక్కేస్తున్నారు. ప్రతి బండినీ ఆపి చెక్ చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ, బైక్ లు, కార్లలో పోతున్నవారి ఫోన్లు కూడా లాగేసుకుని వాట్సప్ చాటింగ్ చూస్తున్నారు. 

గంజా, డ్రగ్స్ అనే కీవర్డ్స్ ని వెదుకుతున్నారు. పొరపాటున ఆ పేరుతో ఏదైనా సమాచారం దొరికితే అనుమానితుల కింద జమచేస్తున్నారు. ప్రధానంగా ధూల్ పేట, మంగళ్ హాట్, జుమ్మెరాత్ బజార్.. లో ఇలా తనిఖీలు చేస్తున్నారు. ఫోన్లు లాగేసుకుని, పాస్ వర్డ్ లు కనుక్కుని చాటింగ్, మెసేజ్ లు చెక్ చేస్తున్నారు.

పౌరుల హక్కులకు భంగం కాదా..

ఇలా మొబైల్స్ వెదకడం పౌరుల హక్కులకు భంగం అని అంటున్నారు న్యాయవాదులు. ప్రాథమిక స్వేచ్ఛను పోలీసులు హరించినట్టే అంటున్నారు. మరికొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు మాత్రం మాస్ ఏరియాల్లో, చదువు రాని వారి దగ్గర ఈ దందా ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

పోలీసులకు దమ్ముంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో బైక్ లు ఆపి, వారి ఫోన్లు, వాట్సప్ చాట్ లు చెక్ చేయండి చాలా విషయాలు బయటపడతాయని సలహా ఇస్తున్నారు.

దాడులు చేయండి.. కానీ..

గంజాయి స్థావరాలపై దాడులు చేయండి, బైకులు, కార్లు వెదకండీ.. కానీ ఫోన్లు మాత్రం చూడొద్దంటూ నెటిజన్ల నుంచి అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు మొబైల్ ఫోన్లోనే సమస్త సమాచారమంతా దాచేసుకుంటున్నారు. పర్సు వెదుక్కునా పర్లేదు కానీ, నా ఫోన్ మాత్రం వెదక్కండి అంటూ చాలామంది కుర్రకారు పోలీసుల్ని వేడుకుంటున్నారు. ఫోన్ లోనే పర్సనల్ మేటర్ అంతా దాగున్న వేళ.. తమ వ్యక్తిగత వివరాల జోలికి రావొద్దంటున్నారు.

పోలీసులు మాత్రం తాము ఎవరి స్వేచ్ఛను హరించడంలేదని చెబుతున్నారు. అనుమానాస్పద వాతావరణం ఉన్న చోట డిజిటల్ సాక్ష్యాలు కూడా చాలా ముఖ్యం అని, అందుకే ఫోన్లు చెక్ చేస్తున్నామని చెప్పారు. తనిఖీల్లో అది తమ ప్రాథమిక విధి అంటున్నారు.